Fake passports
-
మోస్ట్ వాంటెడ్‌గా నాడు తండ్రి.. నేడు కొడుకు
హైదరాబాద్: అప్పట్లో మహ్మద్ షకీల్ ఆమీర్ అలియాస్ బోధన్ షకీల్... ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్... హైదరాబాద్ పోలీసులు వాంటెడ్‌గా మారారు. 2007 నాటి నకిలీ పాస్పోర్ట్స్ కేసులో షకీల్, తాజాగా ప్రజాభవన్ వద్ద చోటు చేసుకున్న బీఎండబ్ల్యూ కారు ప్రమాదం, తదనంతర నాటకీయ పరిణామాల కేసులో సాహిల్ నిందితులుగా ఉన్నారు. పదహారేళ్ళ క్రితం తండ్రి కోసం పరుగులు పెట్టిన సిటీ కాప్స్ ఇప్పుడు కుమారుడి కోసం వెతుకుతున్నారు. సాహిల్ దుబాయ్‌కి పారిపోవడంతో అతడిపై ఎల్ఓసీ జారీ చేశారు. పంజగుట్ట ప్రమాదం నేపథ్యంలో వెస్ట్‌జోన్ పోలీసులు గతేడాది జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన మరో యాక్సిడెంట్ ఫైల్‌ను బయటకు తీస్తున్నారు. ముప్పతిప్పలు పెట్టిన షకీల్... మనుషుల అక్రమ రవాణాలో భాగమైన నకిలీ పాస్పోర్ట్స్ స్కామ్ 2007లో వెలుగులోకి వచ్చింది. అమెరికా సహా కొన్ని దేశాల్లో గుజరాతీయులకు ఎంట్రీ ఉండేది కాదు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళను అక్రమంగా దేశం దాటించడానికి దేశ వ్యాప్తంగా ముఠాలు ఏర్పడ్డాయి. వీరు కొందరు ప్రజాప్రతినిధులతో ఒప్పందాలు చేసుకుని గుజరాతీయులను వాళ్ళ కుటుంబీకులుగా మార్చారు. ఆయా ప్రతినిధుల సిఫారసుల ఆధారంగా మారు పేర్లతో గుజరాతీయులకు పాస్‌పోర్టులు అందించారు. సుదీర్ఘకాలం జరిగిన ఈ స్కామ్‌లో ఢిల్లీలో ఎంపీ బాబూభాయ్ కటారా అరెస్టుతో వెలుగులోకి వచ్చింది. నగరంలో నమోదైన కేసులో బోధన్ షకీల్ నిందితుడిగా మారాడు. అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో షకీల్ కోసం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ముమ్మరంగా గాలించి పట్టుకున్నారు. కారు కేసులో కుమారుడి కోసం... నకిలీ పాస్పోర్ట్స్ స్కామ్ జరిగిన దాదాపు పదహారేళ్ల తర్వాత ‘బీఎండబ్ల్యూ కారు’ కేసు చోటు చేసుకుంది. పంజగుట్ట ఠాణా పరిధిలోని ప్రజాభవన్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం జరగడం, నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం వంటి అంశాలతో ముడిపడి ఉన్న ఈ కేసు నుంచి సాహిల్‌ను తప్పించడానికి పోలీసులు ప్రయతి్నంచడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పంజగుట్ట ఇన్స్పెక్టర్ బి.దుర్గారావును సస్పెండ్ చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి పరారీలో ఉన్న సాహిల్ కోసం పంజగుట్టతో పాటు వెస్ట్‌జోన్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తు అతడిపై ఎల్ఓసీ జారీ చేశారు. షకీల్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడని, అక్కడ నుంచే కుమారుడని తప్పించే కథ మొత్తం నడిపి, అతడినీ అక్కడికే రప్పించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. నాటి కేసులోనూ గోల్మాల్ జరిగిందా? తాజాగా పంజగుట్ట పరిధిలో జరిగిన ఈ ప్రమాదం కేసు గతేడాది నాటి జూబ్లీహిల్స్ యాక్సిడెంట్‌ను మరోసారి తెరపైకి తెచ్చింది. 2022 మార్చి 17 రాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి జూబ్లీహిల్స్ దూసుకువచ్చిన మహేంద్ర థార్ కారు రోడ్డుపై బుడగలు విక్రయించే వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మ భోస్లే గాయపడగా.. కాజల్ కుమారుడు అశ్వతోష్ (రెండు నెలలు) మృతి చెందాడు. ఈ థార్ కారుపై ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉండటంతో అప్పట్లో సాహిల్‌పై ఆరోపణలు వచ్చాయి. మరుసటి రోజు స్పందించిన షకీల్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. జూబ్లీహిల్స్‌లో ప్రమాదానికి కారణమైన కారు తన సోదరుడిదని (కజిన్), తానూ అప్పుడప్పుడు వాడుతుంటానని పేర్కొన్నారు. సోదరుడి కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా జూబ్లీహిల్స్ రోడ్ నం.45 వద్ద సిగ్నల్ సమీపంలో బెలూన్లు అమ్ముకునే యువతికి కారు వల్ల గాయమైందని, ఆ భయంలో ఆమే పసిపాపను పడేయడంతో దుర్ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు. ఆ ఉదంతం చాలా బాధాకరమంటూ జరిగిన విషయాన్ని తాను తన కజిన్‌తో మాట్లాడి తెలుసుకున్నానని షకీల్ పేర్కొన్నారు. పసిపాపను కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పానని అన్నారు. ఈ కేసులో పోలీసులు సైతం సాహిల్‌కు క్లీన్చిట్ ఇచ్చేశారు. తాజాగా పంజగుట్ట కేసులో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఉన్నతాధికారులు నాటి జూబ్లీహిల్స్ కేసును తిరగదోడుతున్నారు. అప్పట్లో జరిగిన ప్రమాదంలోనూ సాహిల్ పాత్ర ఉందా? ఏదైనా గోల్మాల్ జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తామని పశి్చమ మండల డీసీపీ ఎస్ఎం విజయ్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. -
కన్సల్టెన్సీ పేరుతో వీసాలు ఇప్పిస్తామంటూ..
సాక్షి, హైదరాబాద్: నకిలీ వీసాల దందా సాగిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. వీసా, పాస్‌పోర్టుల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ గ్యాంగ్ కన్సెల్టెన్సీల పేరుతో వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతుందన్నారు. కస్టమర్లకు నకిలీ పత్రాలు ఏర్పాటు చేయడం కోసం వీరు మూడు నుంచి నాలుగు లక్షలు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. కెనడా, అమెరికా, ఇటలీ, స్పెయిన్, అరబ్ దేశాలకు వెళ్లే వారే లక్ష్యంగా ఈ ముఠా కార్యకాలాపాలు సాగిస్తుందని పేర్కొన్నారు. ఈ ముఠా సమకూర్చిన పత్రాలతో కస్టమర్లు కాన్సులేట్‌లో వీసాకు దరఖాస్తు చేసుకుంటున్నారని వెల్లడించారు. ఇప్పటికే కొంతమంది నకిలీ పత్రాలతో వీసాలు పొంది స్టడీ, బిజినెస్, వర్క్, విజిటింగ్ కోసం విదేశాలకు వెళ్లారని తెలిపారు. 450 మందికి ఈ ముఠా నకిలీ పత్రాలు అందజేసిందన్నారు. నకిలీ పత్రాలతో వీసా పొంది ఎంత మంది విదేశాలకు వెళ్లారో గుర్తించే పనిలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ముఠాకు చెందిన రహీఉద్దీన్, ఖలిద్ ఖాన్, షైక్ ఇల్లియాస్, సైయాద్, జహీరుద్దీన్లను అరెస్ట్ చేశామని.. వారిపై ఇదివరకే చాలా క్రిమినల్ చేసులు ఉన్నాయని చెప్పారు. సైదాబాద్, గోల్కొండ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు సాగిస్తుందని.. నకిలీ పాస్‌పోర్టులను కూడా తయారుచేస్తుందని ఆయన తెలిపారు. అనుమానం రాకుండా ఉండేందుకు ముఠా సభ్యులు అధిక నాణ్యత కలిగిన నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి 100 పాస్‌పోర్ట్‌లు, రబ్బర్ స్టాంప్స్, 3 లక్షల రూపాయల నగదు, కంప్యూటర్, ప్రింటర్స్, సెల్ల్ ఫోన్లు, స్కానర్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. -
నకిలీ వీసాల దందా సాగిస్తున్న ముఠా గుట్టు రట్టు
-
నోటరీ.. నకిలీ..!
కరీంనగర్‌లీగల్: ‘గోదావరిఖనికి చెందిన ఇబ్రహీం దుబాయి వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పాస్‌పోర్టు తీసుకోవడానికి అవసరమైన పత్రాల్లో ఇబ్రహీం అని ఉండగా.. ప్రాథమిక విద్యార్థత సర్టిఫికెట్స్‌లో మాత్రం ఎబ్రహీం అని ఉంది. పేరులో ఇంగ్లిష్ మొదటి అక్షరం ‘ఐ’కి బదులు ‘ఈ’ అని ఉంది. ఆ విషయాన్ని అతడు చదువుకునే సమయంలో గమనించలేదు. బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లేందుకు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంటున్న సమయంలో గుర్తించాడు. దీనికి సదరు వ్యక్తి తనపేరు ఇబ్రహీంగా పేర్కొంటూ నోటరీ ద్వారా అఫిడవిట్ చేసి దాఖలు చేశాడు. దుబాయ్‌లో పనిచేస్తున్న సమయంలో ప్రమాదంబారిన పడి మరణించాడు. దీంతో కుటుంబసభ్యులు అతడికి రావాల్సిన బెన్ఫిట్స్ పొందడానికి ప్రయత్నించగా.. కంపెనీవారు గతంలో ఇబ్రహీం దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఎంక్వైరీ చేశారు. ఆ సమయంలో అతడు సమర్పించిన నోటరీ నకిలీ అని బయటపడింది. దీంతో బాధిత కుటుంబానికి బెన్ఫిట్స్ నిలిచిపోయాయి. జిల్లాలో చాలామంది నకిలీనోటరీలు అసలైన నోటరీలుగా పేర్కొంటూ చెలామణి అవుతున్నారు. వారివారి కార్యాలయాల ముందు దర్జాగా బోర్డులు ఏర్పాటు చేసుకుని అఫిడవిట్లు తయారు చేస్తున్నారు. నోటరీ అని సంతకంచేసి ముద్రవేశాడు కదా.. ఇక గండం గడిచిపోయింది అనుకుంటే బాధితులకు తిప్పలు తప్పకపోవచ్చు. సంతకం చేసిన వ్యక్తికి నోటరీగా అర్హత ఉందా..? అఫిడవిట్‌పై నోటరీగా సంతకం చేసినట్లు రిజిస్టర్లో నమోదుచేశాడా..? అసలు కొనుగోలు చేసిన స్టాంప్‌పేపర్ సరైందేనా..? కాదా..? తెలుసుకుంటేనే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. అర్హత లేకపోయినా అఫిడవిట్లపై సంతకాలు చేస్తూ నోటరీగా డబ్బులు దండుకుంటున్న వారు చాలామంది ఉన్నట్లు వెలుగుచూస్తుండడం విస్మయంగొలుపుతోంది. తప్పుదారి పడుతున్న నోటరీ వ్యవస్థ అఫిడవిట్ దాఖలుకు సంబంధించిన వ్యవహారంలో నోటరీ వ్యవస్థగా కీలకమైంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తుల బదలాయింపు, కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరడంతోపాటు ఇతర వాటిలో నోటరీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అభ్యర్తి తన పూర్తి చిరునామా నుంచి పుట్టు పూర్వోత్తరాలు తెలియచేయడానికి నోటరీ అవసరం అవుతోంది. అఫిడవిట్ రూపంలో వీటిని తెలియజేయాల్సి ఉంటుంది. అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు నిజమైనవేనని నోటరీదారుడు సంతకం చేయాల్సి ఉంటుంది. ఇలా దాఖలు చేసిన అఫిడవిట్స్ చివరికి కొన్ని సమయాల్లో నకిలీగా బయటపడుతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నకిలీ నోటరీలు ఎక్కువవుతున్నారు. నోటరీలుగా చెప్పుకుంటున్న వారిలో చాలామంది ప్రభుత్వ అనుమతి లేకుండానే కొనసాగుతున్నారు. నోటరీగా సంతకాలు చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎప్పుడో నోటరీగా నమోదు చేయించుకుని కనీసం రెన్యువల్ లేకుండా అఫిడవిట్లపై సంతకాలు చేస్తున్నారు. నిబంధనలు పాటించకుండా ఇలా ఇష్టానుసారంగా సంతకాలు చేస్తుండటంతో ప్రజలు ఆర్థికంగా నష్టపోవడంతోపాటు జరిమానాలు, శిక్షలు అనుభవించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. డబ్బుల కోసమేనా..? నోటరీలు అఫిడవిట్లపై సంతకాలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. జననం, మరణ, కులం, ఆదాయం, పేరు మార్పు, విడాకులు, బ్యాకింగ్, సేల్‌డీడ్‌పై కూడా సంతకాలు చేస్తున్నా రు. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనలు పాటిం చడం లేదని సమాచారం. స్టాంప్ పేపర్‌పై రాసి న దస్తూరిని పూర్తిగా చదివి.. వివరాలు ఉన్నట్లు అనిపిస్తేనే వాటిని ధ్రువీకరిస్తూ సంతకా లు చేయాలి. వివరాలకు సంబంధించిన వారు కూడా అందుబాటులోనే ఉండాలి. వ్యక్తి ముందుగా స్టాంప్‌పేపర్‌పై సంతకం చేసిన తర్వాతనే నోటరీగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇవేవీ పాటించకుండానే.. సంబంధించిన వారు లేకుం డానే డబ్బులకు ఆశపడి సంతకాలు చేస్తున్నారు. పరిధి దాటి విరుద్ధంగా.. నోటరీ ధ్రువీకరణ చేయాలంటే ఓ పరిధి ఉంటుంది. వారికి కేటాయించిన ప్రాంతంలోని వారికి మాత్రమే నోటరీ చేయాలి. నోటరీ నెంబర్‌ను రిజిస్ట్రర్‌లో నమోదు చేసుకుని సంతకం చేయాలి. ఇలాంటి నిబంధనలు పాటించకుండానే సంతకాలు చేస్తూ నోటరీలు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 250 మందే.. నోటరీగా రిజిస్ట్రషర్ అయినవారు ఉమ్మడి జిల్లాలో 250మంది ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు తెలుపుతున్నాయి. కానీ.. ఒక్క కరీంనగర్‌లోనే 100 మంది వరకు నోటరీలు ఉన్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో వెయ్యిమందికిపైగా నోటరీలుగా చెలామణి అవుతున్నట్లు సమాచారం. అఫిడవిట్‌పై సంతకాలు చేయడానికి సాధారణంగా కలెక్టరేట్, తహసీల్దార్, ఆర్టీఏతోపాటు ఎక్కువగా కోర్టు పరిసరాల్లో కనిపిస్తుంటారు. నోటరీ అంటే అఫిడవిట్లో తెలిపిన వివరాలు అన్ని సక్రమమే అని.. దాని బలపర్చుతూ తెలియచేయడం. ప్రస్తుతం నోటరీ అని చెప్పుకునే వారికి అర్హత ఉందా..? అనే అనుమానం కలుగుతోంది. అర్హత అంటే ఒక డిగ్రీ పట్టానే కాదు. చదువుతోపాటు నోటరీగా ధ్రువీకరిస్తూ సంతకం చేయడానికిగల అర్హత. నిబంధనల ప్రకారం వీరిని ప్రభుత్వం నోటరీగా గుర్తించాలి. నోటరీగా పనిచేయడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి అనుమతి పొందాలి. ఇలా ఒకసారి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వారు జీవితకాలం నోటరీలు కాదు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా మాత్రమే వీరు నోటరీగా పనిచేయాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత తిరిగి నోటరీగా రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా గడువు దాటిపోయినా రెన్యువల్ లేకుండానే నోటరీగా సంతకాలు చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. నోటరీస్ యాక్ట్ సెక్షన్ 12 ప్రకారం నేరం అర్హత లేకుండా నకిలీ నోటరీ సంతకాలు చేసిన వారు నోక్ష శిక్షార్హులు. నకిలీ నోటరీ అని రుజువు అయితే 3నెలల జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అవకాశం ఉంది. నోటరీ స్టాంప్‌లో పేరు, వారికి కేటాయించిన ప్రాంతం, నోటరీగా వారికి ఉన్న గడువు తేదీ ఉండాలి. నోటరీ చేసినందుకు తీసుకున్న ఫీజుకు రశీదు కూడా ఇవ్వాలి. నకిలీలను శిక్షించాలి నకిలీ నోటరీలను గుర్తించి కఠినంగా శిక్షించాలి. చట్టభద్రతకు పనిచేయాల్సిన నోటరీలు చట్టానికే వ్యతిరేకంగా పనిచేయడం సరికాదు. దొంగ డాక్యుమెంట్లపై కొంతమంది నోటరీగా సంతకాలు చేస్తున్నారు. ఇలాంటివారిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగాల కోసం వెళ్లిన వారు నకిలీ నోటరీల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – ఎన్.శ్రీనివాస్, లోక్‌సత్తా జిల్లా అధ్యక్షుడు -
హైదరాబాదీలుగా గుజరాత్ జంట మోసం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌కు చెందిన వృద్ధదంపతుల పాస్‌పోర్ట్‌లతో కెనడా వెళ్లడానికి యత్నించిన గుజరాతీ ‘జంట’ను అబుదాబి ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. మరొకరి పాస్పోర్ట్స్పై తమ ఫొటోలు అతికించి ప్రయాణిస్తున్నారని గుర్తించి బలవంతంగా అహ్మదాబాద్‌కు తిప్పి పంపారు. ఇరువురినీ అరెస్టు చేసిన అక్కడి సర్దార్‌నగర్ పోలీసులు ‘హైదరాబాద్ కోణం’పై దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. పాస్పోర్ట్స్ కలిగిన అసలు వ్యక్తుల నుంచి వివరాలు సేకరించడానికి ఓ ప్రత్యేక బృందాన్ని నగరానికి పంపిస్తున్నారు. అక్రమ వలసలు పెరిగిపోతున్నాయనే కారణంగా కెనడా, అమెరికా దేశాలు గుజరాతీయులకు వీసాలు జారీ చేడయం దాదాపు ఆపేశాయి. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన వారు ఆయా దేశాలకు వెళ్లడానికి నకిలీ పాస్పోర్ట్స్ వినియోగిస్తుండటం పరిపాటిగా మారింది. 2007లో వెలుగులోకి వచ్చి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మనుషుల అక్రమ రవాణా కుంభకోణం సైతం ఈ కోవకు చెందినదే. దీని మూలాలు హైదరాబాద్‌లోనూ బయటపడ్డాయి. కెనడా వెళ్లేందుకు అడ్డదారి... గుజరాత్‌లోని కల్లోల్ ప్రాంతానికి చెందిన నేమిష్ పటేల్ (35), నరోడాలోని కృష్ణనగర్ వాసి దీప్తి పటేల్ (28) స్థిరపడేందుకు కెనడా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ పాస్పోర్ట్స్పై వీసాలు రావడం కష్టమని గుర్తించిన ఆ ఇద్దరూ... రామన్ అలియాస్ లాలాభాయ్ అనే దళారీని సంప్రదించారు. ఇరువురితోనూ ఒప్పందం కుదుర్చుకున్న రామన్ వారి నుంచి ఫొటోలు సేకరించాడు. హైదరాబాద్‌కు చెందిన వృద్ధ దంపతులు మహ్మద్ జన్సిత్, సాజిదాబానులకు చెందిన ఒరిజినల్ పాస్పోర్ట్స్ చేజిక్కించుకున్న ఇతగాడు వాటిపై ఉన్న ఫొటోల స్థానంలో గుజరాతీ ‘జంట’వి అతికించాడు. ఈ పాస్పోర్ట్స్ తీసుకున్న నేమిష్, దీప్తి శనివారం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అబుదాబి మీదుగా కెనడా వెళ్లేందుకు బయలుదేరారు. పాస్పోర్ట్స్లో ఉన్న వయసులు, ఈ ఇద్దరికీ పొంతన లేకపోయినా ఇక్కడ ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పొందిన ఇరువురూ అబుదాబి వరకు వెళ్లిపోయారు. పాస్‌పోర్ట్స్‌ను తనిఖీ చేసిన అక్కడి అధికారులకు ఇదే విషయంలో అనుమానం వచ్చి పరిశీలించగా... ‘అతుకు’ వ్యవహారం బయపటడింది. వీరిని ప్రశ్నించిన నేపథ్యంలో పాస్పోర్ట్స్లో పేర్లకు సంబంధించిన వర్గం వారు కాదనీ స్పష్టమైంది. దీంతో నేమిష్, దీప్తిలను అదుపులోకి తీసుకున్న అబుదాబి అధికారులు ఆదివారం అహ్మదాబాద్‌కు డిపోర్ట్ (బలవంతంగా తిప్పిపంపడం) చేశారు. కీలకంగా మారిన సిటీ కోణం... అహ్మదాబాద్ చేసుకున్న ఇరువురినీ అదుపులోకి తీసుకున్న సర్దార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇప్పటి వరకు నకిలీ పాస్పోర్ట్స్తో ప్రయాణిస్తున్న వారిని పట్టుకున్న అక్కడి పోలీసులకు ఈ తరహా కేసు దర్యాప్తు చేయడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌కు చెందిన వృద్ధదంపతుల పాస్పోర్ట్స్ అహ్మదాబాద్‌లోని దళారీ రామన్‌కు ఏలా చేరాయన్నది ఇక్కడి కీలకంగా మారింది. దీంతో పాస్‌పోర్టుల ‘యజమానుల్ని’ ప్రశ్నించడం కోసం సర్దార్‌నగర్‌కు చెందిన ఓ ప్రత్యేక బృందం మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌కు రానుంది. ఇప్పటికే పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి మహ్మద్ జన్సిత్, సాజిదాబానులకు చెందిన వివరాలను సర్దార్‌నగర్ పోలీసులు సేకరించారు. రామన్ ముఠాలో హైదరాబాద్‌కు చెందిన వారితో పాటు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులూ ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ పాస్‌పోర్టులతో వచ్చిన 5గురి అరెస్టు
శంషాబాద్: సౌదీ అరేబియా నుంచి నకిలీ పాస్‌పోర్టులపై వచ్చిన ఐదుగురు ప్రయాణికులను విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు రాజస్థాన్, ఇద్దరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు. అక్కడ ఉద్యోగాలు కల్పించిన సంస్థలు తమ పాస్‌పోర్టులను లాగేసుకోవటంతో గత్యంతరం లేక నకిలీ పాస్‌పోర్టులపై వచ్చినట్లు వారు తెలిపారని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వర్గాలు పేర్కొన్నాయి. -
త్వరలో ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో అన్ని పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో వచ్చే ఏడాది నుంచి ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లను జారీ చేయాలని విదేశాంగ శాఖ యోచిస్తోంది. పూర్తిస్థాయిలో సాంకేతిక వ్యవస్థను రూపొందించుకుని, పాస్‌పోర్ట్‌ల తయారీకి వివిధ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించాలని యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టును 2015 సంవత్సరానికల్లా పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్టు విదేశాంగ శాఖకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. నకిలీ పాస్‌పోర్ట్‌లు లేకుండా చేయడమే ఈ-పాస్‌పోర్ట్‌ల లక్ష్యమని, త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను తమ శాఖ వెల్లడిస్తుందని చెప్పారు. ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లు ఇలా ఉంటాయి వేలిముద్రలతో కూడిన చిప్‌ను పాస్‌పోర్ట్‌లో అమర్చుతారు. పాస్‌పోర్ట్‌లోని రెండో పేజీలో డిజిటల్ సంతకం, షేడెడ్ ఫొటోగ్రఫీ, ఐరిస్ (కంటిపాప) ముద్ర తదితరాలు ఉంటాయి. వేలిముద్రలతో కూడిన చిప్‌ను కవర్ పేజీ లేదా చివరి కవర్లో అమర్చుతారు. బయోమెట్రిక్, ఐరిస్, ఫొటోగ్రఫీకి సంబంధించిన ఆధారాలు ఉంటాయి కాబట్టి నకిలీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావుండదు. ఎయిర్‌పోర్ట్‌లో చిప్‌తో కూడిన ఆధారాలను పరిశీలించాకే అనుమతిస్తారు.ప్రస్తుతం ఉన్న పాస్‌పోర్ట్‌లను కూడా ఈ-పాస్‌పోర్ట్‌లుగా మార్చే ఆలోచన కూడా ఉంది. -
తప్పిపోయిన విమానం కోసం ఉపగ్రహాలతో వేట!
కౌలాలంపూర్: నాలుగు రోజుల క్రితం తప్పిపోయిన మలేషియన్ విమానం కోసం గాలింపు చర్యలను చైనా ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఉపగ్రహాల ఆధారంగా రంగంలోకి దిగడానికి పూనుకుంది. ఉపగ్రహాలతో విమాన జాడన కనుగొనవచ్చిన భావిస్తున్న చైనా ఇందుకు సమాయత్తమవుతుంది. ఇప్పటికే విమాన ఆచూకీ కనుగొనడానికి పది దేశాలు నడుంబిగించాయి. మలేసియా నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయల్దేరిన ఎంహెచ్370 బోయింగ్ 777 విమానం.. దక్షిణ చైనా సముద్రంపై ప్రయాణిస్తూ శనివారం అదృశ్యమైన విషయం తెలిసిందే. సముద్రంలో కూలిపోయి ఉంటుందని భావిస్తున్న ఈ విమానం శకలాల కోసం వివిధ దేశాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ‘‘దురదృష్టవశాత్తూ.. అసలు విమానమే కాదు.. విమానానికి సంబంధించిన ఎలాంటి వస్తువులూ మాకు కనిపించలేదు. ఈ విషయంలో మేం చేయాల్సిందంతా చేస్తున్నాం’’ అని మలేసియా పౌర విమానయాన విభాగాధిపతి అజహరుద్దీన్ అబ్దుల్ రహ్మాన్ సోమవారం కౌలాలంపూర్‌లో మీడియాతో పేర్కొన్నారు. ఐదుగురు భారతీయులు సహా 239 మందితో కౌలాలంపూర్ నుంచి బయల్దేరిన మలేషియన్ విమానం ఆచూకీ నేటికి లభించకపోవడంతో ప్రయాణికుల బంధువులు ఆందళోనకు గురౌతున్నారు. కాగా, ఒ క ఇటలీ వ్యక్తి, మరో ఆస్ట్రియా వ్యక్తి నుంచి దొంగిలించిన పాస్‌పోర్టులతో ఇద్దరు ప్రయాణికులు ఆ విమానం ఎక్కినట్లు బయటపడటంతో.. మలేసియా అధికారులు విమానం అదృశ్యంపై ఉగ్రవాద కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇద్దరు ప్రయాణికుల్లో ఒకరిని గుర్తించామని.. అతడు ఆసియా వాసిలా కనిపించటం లేదని రహ్మాన్ తెలిపారు. వారిద్దరికీ టికెట్లు విక్రయించిన థాయ్‌లాండ్‌లోని ట్రావెల్స్ ఏజెన్సీ యజమానులను పోలీస్, ఇంటర్‌పోల్ సిబ్బందిని కూడా ప్రశ్నించారు. విమానం అదృశ్యంపై హైజాకింగ్ సహా అన్ని కోణాల్లోనూ పరిశోధన జరుగుతోందని.. ఎఫ్బీఐతో పాటు పలు ఉగ్రవాద వ్యతిరేక సంస్థలూ రంగంలోకి దిగాయని చెప్పారు. -
3 రోజులైన జాడ లేదు
మలేసియా విమానం అదృశ్యంపై వీడని మిస్టరీ 239 మంది ప్రయాణికులు ఏమయ్యారో? దొంగ పాస్‌పోర్టులతో ఇద్దరు ప్రయాణికులు గాలింపు చర్యల్లో 10 దేశాల బృందాలు అండమాన్ సముద్రం వరకూ గాలింపు ఉగ్రవాద కోణంలోనూ పరిశోధన కౌలాలంపూర్: మొత్తం 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ప్రయాణిస్తూ మూడు రోజుల కిందట అదృశ్యమైన మలేసియా విమానం ఆచూకీ ఇంకా తెలియరాలేదు. సముద్రంలో కూలిపోయి ఉంటుందని భావిస్తున్న ఈ విమానం శకలాల కోసం వివిధ దేశాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ‘‘దురదృష్టవశాత్తూ.. అసలు విమానమే కాదు.. విమానానికి సంబంధించిన ఎలాంటి వస్తువులూ మాకు కనిపించలేదు. ఈ విషయంలో మేం చేయాల్సిందంతా చేస్తున్నాం’’ అని మలేసియా పౌర విమానయాన విభాగాధిపతి అజహరుద్దీన్ అబ్దుల్ రహ్మాన్ సోమవారం కౌలాలంపూర్‌లో మీడియాతో పేర్కొన్నారు. ఐదుగురు భారతీయులు సహా 239 మందితో మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయల్దేరిన ఎంహెచ్370 బోయింగ్ 777 విమానం.. దక్షిణ చైనా సముద్రంపై ప్రయాణిస్తూ శనివారం అదృశ్యమైన విషయం తెలిసిందే. వియత్నాం జలాల్లో చమురు గుర్తులు..! విమానం అదృశ్యమైన ప్రదేశంలో వియత్నాం సముద్ర జలాల ఉపరితలంపై చమురు పారిన గుర్తులు, నీటిపై తేలుతున్న లైఫ్‌బోట్ వంటి వస్తువును గుర్తించినట్లు అధికారులు సోమవారం చెప్పటంతో.. అవి అదృశ్యమైన విమానానికి సంబంధించినవే కావచ్చని తొలుత భావించారు. అయితే.. కాదని పరిశీలన అనంతరం తేలింది. విమానం ఆచూకీ కోసం 34 విమానాలు, 40 నౌకలు, 10 దేశాలకు చెందిన బృందాలు.. విమానం అదృశ్యమైన ప్రాంతం చుట్టూ 50 నాటికల్ మైళ్ల విస్తీర్ణంలో గాలింపు నిర్వహిస్తున్నాయి. మలేసియా - వియత్నాంల మధ్య సముద్రంపై గాలింపు నిర్వహించటంతో పాటు.. మలేసియా భూభాగంపైన, పశ్చిమ మలేసియా ఆవలవైపు కూడా గాలిస్తున్నట్లు రహ్మాన్ తెలిపారు. విమానం కౌలాలంపూర్‌కు తిరిగివచ్చేందుకు వెనుదిరిగి ఉండొచ్చన్న రాడార్ సమాచారం మేరకు.. థాయ్‌లాండ్ సరిహద్దులోని అండమాన్ సముద్రానికి కూడా గాలింపును విస్తరించామని చెప్పారు. విమానం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అత్యవసర సిగ్నళ్లూ అందలేదని గాలింపు అధికారులు చెప్పారు. ‘ఉగ్ర’ కోణంలో దర్యాప్తు: ఒక ఇటలీ వ్యక్తి, మరో ఆస్ట్రియా వ్యక్తి నుంచి దొంగిలించిన పాస్‌పోర్టులతో ఇద్దరు ప్రయాణికులు ఆ విమానం ఎక్కినట్లు బయటపడటంతో.. మలేసియా అధికారులు విమానం అదృశ్యంపై ఉగ్రవాద కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇద్దరు ప్రయాణికుల్లో ఒకరిని గుర్తించామని.. అతడు ఆసియా వాసిలా కనిపించటం లేదని రహ్మాన్ తెలిపారు. వారిద్దరికీ టికెట్లు విక్రయించిన థాయ్‌లాండ్‌లోని ట్రావెల్స్ ఏజెన్సీ యజమానులను పోలీస్, ఇంటర్‌పోల్ సిబ్బంది ప్రశ్నించారు. విమానం అదృశ్యంపై హైజాకింగ్ సహా అన్ని కోణాల్లోనూ పరిశోధన జరుగుతోందని.. ఎఫ్బీఐతో పాటు పలు ఉగ్రవాద వ్యతిరేక సంస్థలూ రంగంలోకి దిగాయని చెప్పారు. విమానంలో 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం 154 మంది చైనీయులు, 38 మంది మలేసియన్లు, ఏడుగురు ఇండోనేసియన్లు, ఆరుగురు ఆస్ట్రేలియన్లు, ఐదుగురు భారతీయులు, నలుగురు అమెరికన్లు, ఒక కెనడియన్ ఉన్నారు. భారతీయులను చేతనా కోలేకర్ (55), స్వానానంద్ కోలేకర్ (23), వినోద్ కోలేకర్ (59), చంద్రికాశర్మ (55), క్రాంతి శీర్సథా (44)గా గుర్తించారు. ఈ విమానంలో ప్రయాణించేందుకు టికెట్లు తీసుకున్న మరో ఐదుగురు ప్రయాణికులు సమయానికి విమానం ఎక్కలేకపోయారని రహ్మాన్ తెలిపారు. ఏం జరిగిందో వాస్తవం చెప్పండి... విమానంలో ప్రయాణిస్తున్న వారి గురించి తెలియక బంధువులు మనోవేదనకు గురవుతున్నారు. వీరు సోమవారం చైనాలోని బీజింగ్‌లో సమావేశమై.. వివరాలు వెల్లడించాలంటూ మలేసియా విమానయాన సంస్థను కోరుతూ పిటిషన్ పంపించారు. అదృశ్యమైన విమానాన్ని గుర్తించటంలో మలేసియా చాలా నెమ్మదిగా స్పందిస్తోందని చైనా అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ తప్పుపట్టింది. విమానాన్ని గుర్తించేందుకు, గాలింపు చర్యలకు సాయమందించేందుకు చైనా తనకు సంబంధించిన పది ఉపగ్రహాలను (శాటిలైట్లను) ఆ దిశగా మళ్లించిందని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) తెలిపింది. -
ఇంకా ఆచూకీ లేని మలేసియా విమానం