
తప్పిపోయిన విమానం కోసం ఉపగ్రహాలతో వేట!
కౌలాలంపూర్: నాలుగు రోజుల క్రితం తప్పిపోయిన మలేషియన్ విమానం కోసం గాలింపు చర్యలను చైనా ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఉపగ్రహాల ఆధారంగా రంగంలోకి దిగడానికి పూనుకుంది. ఉపగ్రహాలతో విమాన జాడన కనుగొనవచ్చిన భావిస్తున్న చైనా ఇందుకు సమాయత్తమవుతుంది. ఇప్పటికే విమాన ఆచూకీ కనుగొనడానికి పది దేశాలు నడుంబిగించాయి. మలేసియా నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయల్దేరిన ఎంహెచ్370 బోయింగ్ 777 విమానం.. దక్షిణ చైనా సముద్రంపై ప్రయాణిస్తూ శనివారం అదృశ్యమైన విషయం తెలిసిందే.
సముద్రంలో కూలిపోయి ఉంటుందని భావిస్తున్న ఈ విమానం శకలాల కోసం వివిధ దేశాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ‘‘దురదృష్టవశాత్తూ.. అసలు విమానమే కాదు.. విమానానికి సంబంధించిన ఎలాంటి వస్తువులూ మాకు కనిపించలేదు. ఈ విషయంలో మేం చేయాల్సిందంతా చేస్తున్నాం’’ అని మలేసియా పౌర విమానయాన విభాగాధిపతి అజహరుద్దీన్ అబ్దుల్ రహ్మాన్ సోమవారం కౌలాలంపూర్‌లో మీడియాతో పేర్కొన్నారు. ఐదుగురు భారతీయులు సహా 239 మందితో కౌలాలంపూర్ నుంచి బయల్దేరిన మలేషియన్ విమానం ఆచూకీ నేటికి లభించకపోవడంతో ప్రయాణికుల బంధువులు ఆందళోనకు గురౌతున్నారు.
కాగా, ఒ క ఇటలీ వ్యక్తి, మరో ఆస్ట్రియా వ్యక్తి నుంచి దొంగిలించిన పాస్‌పోర్టులతో ఇద్దరు ప్రయాణికులు ఆ విమానం ఎక్కినట్లు బయటపడటంతో.. మలేసియా అధికారులు విమానం అదృశ్యంపై ఉగ్రవాద కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇద్దరు ప్రయాణికుల్లో ఒకరిని గుర్తించామని.. అతడు ఆసియా వాసిలా కనిపించటం లేదని రహ్మాన్ తెలిపారు. వారిద్దరికీ టికెట్లు విక్రయించిన థాయ్‌లాండ్‌లోని ట్రావెల్స్ ఏజెన్సీ యజమానులను పోలీస్, ఇంటర్‌పోల్ సిబ్బందిని కూడా ప్రశ్నించారు. విమానం అదృశ్యంపై హైజాకింగ్ సహా అన్ని కోణాల్లోనూ పరిశోధన జరుగుతోందని.. ఎఫ్‌బీఐతో పాటు పలు ఉగ్రవాద వ్యతిరేక సంస్థలూ రంగంలోకి దిగాయని చెప్పారు.