3 రోజులైన జాడ లేదు
మలేసియా విమానం అదృశ్యంపై వీడని మిస్టరీ
239 మంది ప్రయాణికులు ఏమయ్యారో?
దొంగ పాస్‌పోర్టులతో ఇద్దరు ప్రయాణికులు
గాలింపు చర్యల్లో 10 దేశాల బృందాలు
అండమాన్ సముద్రం వరకూ గాలింపు
ఉగ్రవాద కోణంలోనూ పరిశోధన
కౌలాలంపూర్: మొత్తం 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ప్రయాణిస్తూ మూడు రోజుల కిందట అదృశ్యమైన మలేసియా విమానం ఆచూకీ ఇంకా తెలియరాలేదు. సముద్రంలో కూలిపోయి ఉంటుందని భావిస్తున్న ఈ విమానం శకలాల కోసం వివిధ దేశాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ‘‘దురదృష్టవశాత్తూ.. అసలు విమానమే కాదు.. విమానానికి సంబంధించిన ఎలాంటి వస్తువులూ మాకు కనిపించలేదు. ఈ విషయంలో మేం చేయాల్సిందంతా చేస్తున్నాం’’ అని మలేసియా పౌర విమానయాన విభాగాధిపతి అజహరుద్దీన్ అబ్దుల్ రహ్మాన్ సోమవారం కౌలాలంపూర్‌లో మీడియాతో పేర్కొన్నారు. ఐదుగురు భారతీయులు సహా 239 మందితో మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయల్దేరిన ఎంహెచ్370 బోయింగ్ 777 విమానం.. దక్షిణ చైనా సముద్రంపై ప్రయాణిస్తూ శనివారం అదృశ్యమైన విషయం తెలిసిందే.
వియత్నాం జలాల్లో చమురు గుర్తులు..!
విమానం అదృశ్యమైన ప్రదేశంలో వియత్నాం సముద్ర జలాల ఉపరితలంపై చమురు పారిన గుర్తులు, నీటిపై తేలుతున్న లైఫ్‌బోట్ వంటి వస్తువును గుర్తించినట్లు అధికారులు సోమవారం చెప్పటంతో.. అవి అదృశ్యమైన విమానానికి సంబంధించినవే కావచ్చని తొలుత భావించారు. అయితే.. కాదని పరిశీలన అనంతరం తేలింది. విమానం ఆచూకీ కోసం 34 విమానాలు, 40 నౌకలు, 10 దేశాలకు చెందిన బృందాలు.. విమానం అదృశ్యమైన ప్రాంతం చుట్టూ 50 నాటికల్ మైళ్ల విస్తీర్ణంలో గాలింపు నిర్వహిస్తున్నాయి. మలేసియా - వియత్నాంల మధ్య సముద్రంపై గాలింపు నిర్వహించటంతో పాటు.. మలేసియా భూభాగంపైన, పశ్చిమ మలేసియా ఆవలవైపు కూడా గాలిస్తున్నట్లు రహ్మాన్ తెలిపారు. విమానం కౌలాలంపూర్‌కు తిరిగివచ్చేందుకు వెనుదిరిగి ఉండొచ్చన్న రాడార్ సమాచారం మేరకు.. థాయ్‌లాండ్ సరిహద్దులోని అండమాన్ సముద్రానికి కూడా గాలింపును విస్తరించామని చెప్పారు. విమానం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అత్యవసర సిగ్నళ్లూ అందలేదని గాలింపు అధికారులు చెప్పారు.
‘ఉగ్ర’ కోణంలో దర్యాప్తు: ఒక ఇటలీ వ్యక్తి, మరో ఆస్ట్రియా వ్యక్తి నుంచి దొంగిలించిన పాస్‌పోర్టులతో ఇద్దరు ప్రయాణికులు ఆ విమానం ఎక్కినట్లు బయటపడటంతో.. మలేసియా అధికారులు విమానం అదృశ్యంపై ఉగ్రవాద కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇద్దరు ప్రయాణికుల్లో ఒకరిని గుర్తించామని.. అతడు ఆసియా వాసిలా కనిపించటం లేదని రహ్మాన్ తెలిపారు. వారిద్దరికీ టికెట్లు విక్రయించిన థాయ్‌లాండ్‌లోని ట్రావెల్స్ ఏజెన్సీ యజమానులను పోలీస్, ఇంటర్‌పోల్ సిబ్బంది ప్రశ్నించారు. విమానం అదృశ్యంపై హైజాకింగ్ సహా అన్ని కోణాల్లోనూ పరిశోధన జరుగుతోందని.. ఎఫ్బీఐతో పాటు పలు ఉగ్రవాద వ్యతిరేక సంస్థలూ రంగంలోకి దిగాయని చెప్పారు. విమానంలో 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం 154 మంది చైనీయులు, 38 మంది మలేసియన్లు, ఏడుగురు ఇండోనేసియన్లు, ఆరుగురు ఆస్ట్రేలియన్లు, ఐదుగురు భారతీయులు, నలుగురు అమెరికన్లు, ఒక కెనడియన్ ఉన్నారు. భారతీయులను చేతనా కోలేకర్ (55), స్వానానంద్ కోలేకర్ (23), వినోద్ కోలేకర్ (59), చంద్రికాశర్మ (55), క్రాంతి శీర్సథా (44)గా గుర్తించారు. ఈ విమానంలో ప్రయాణించేందుకు టికెట్లు తీసుకున్న మరో ఐదుగురు ప్రయాణికులు సమయానికి విమానం ఎక్కలేకపోయారని రహ్మాన్ తెలిపారు.
ఏం జరిగిందో వాస్తవం చెప్పండి...
విమానంలో ప్రయాణిస్తున్న వారి గురించి తెలియక బంధువులు మనోవేదనకు గురవుతున్నారు. వీరు సోమవారం చైనాలోని బీజింగ్‌లో సమావేశమై.. వివరాలు వెల్లడించాలంటూ మలేసియా విమానయాన సంస్థను కోరుతూ పిటిషన్ పంపించారు. అదృశ్యమైన విమానాన్ని గుర్తించటంలో మలేసియా చాలా నెమ్మదిగా స్పందిస్తోందని చైనా అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ తప్పుపట్టింది. విమానాన్ని గుర్తించేందుకు, గాలింపు చర్యలకు సాయమందించేందుకు చైనా తనకు సంబంధించిన పది ఉపగ్రహాలను (శాటిలైట్లను) ఆ దిశగా మళ్లించిందని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) తెలిపింది.