కరీంనగర్‌లీగల్: ‘గోదావరిఖనికి చెందిన ఇబ్రహీం దుబాయి వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పాస్‌పోర్టు తీసుకోవడానికి అవసరమైన పత్రాల్లో ఇబ్రహీం అని ఉండగా.. ప్రాథమిక విద్యార్థత సర్టిఫికెట్స్‌లో మాత్రం ఎబ్రహీం అని ఉంది. పేరులో ఇంగ్లిష్ మొదటి అక్షరం ‘ఐ’కి బదులు ‘ఈ’ అని ఉంది. ఆ విషయాన్ని అతడు చదువుకునే సమయంలో గమనించలేదు. బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లేందుకు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంటున్న సమయంలో గుర్తించాడు.
దీనికి సదరు వ్యక్తి తనపేరు ఇబ్రహీంగా పేర్కొంటూ నోటరీ ద్వారా అఫిడవిట్ చేసి దాఖలు చేశాడు. దుబాయ్‌లో పనిచేస్తున్న సమయంలో ప్రమాదంబారిన పడి మరణించాడు. దీంతో కుటుంబసభ్యులు అతడికి రావాల్సిన బెన్‌ఫిట్స్ పొందడానికి ప్రయత్నించగా.. కంపెనీవారు గతంలో ఇబ్రహీం దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఎంక్వైరీ చేశారు. ఆ సమయంలో అతడు సమర్పించిన నోటరీ నకిలీ అని బయటపడింది. దీంతో బాధిత కుటుంబానికి బెన్‌ఫిట్స్ నిలిచిపోయాయి.
జిల్లాలో చాలామంది నకిలీనోటరీలు అసలైన నోటరీలుగా పేర్కొంటూ చెలామణి అవుతున్నారు. వారివారి కార్యాలయాల ముందు దర్జాగా బోర్డులు ఏర్పాటు చేసుకుని అఫిడవిట్లు తయారు చేస్తున్నారు. నోటరీ అని సంతకంచేసి ముద్రవేశాడు కదా.. ఇక గండం గడిచిపోయింది అనుకుంటే బాధితులకు తిప్పలు తప్పకపోవచ్చు. సంతకం చేసిన వ్యక్తికి నోటరీగా అర్హత ఉందా..? అఫిడవిట్‌పై నోటరీగా సంతకం చేసినట్లు రిజిస్టర్‌లో నమోదుచేశాడా..? అసలు కొనుగోలు చేసిన స్టాంప్‌పేపర్ సరైందేనా..? కాదా..? తెలుసుకుంటేనే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. అర్హత లేకపోయినా అఫిడవిట్‌లపై సంతకాలు చేస్తూ నోటరీగా డబ్బులు దండుకుంటున్న వారు చాలామంది ఉన్నట్లు వెలుగుచూస్తుండడం విస్మయంగొలుపుతోంది.
తప్పుదారి పడుతున్న నోటరీ వ్యవస్థ
అఫిడవిట్ దాఖలుకు సంబంధించిన వ్యవహారంలో నోటరీ వ్యవస్థగా కీలకమైంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తుల బదలాయింపు, కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరడంతోపాటు ఇతర వాటిలో నోటరీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అభ్యర్తి తన పూర్తి చిరునామా నుంచి పుట్టు పూర్వోత్తరాలు తెలియచేయడానికి నోటరీ అవసరం అవుతోంది. అఫిడవిట్ రూపంలో వీటిని తెలియజేయాల్సి ఉంటుంది. అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు నిజమైనవేనని నోటరీదారుడు సంతకం చేయాల్సి ఉంటుంది.
ఇలా దాఖలు చేసిన అఫిడవిట్స్ చివరికి కొన్ని సమయాల్లో నకిలీగా బయటపడుతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నకిలీ నోటరీలు ఎక్కువవుతున్నారు. నోటరీలుగా చెప్పుకుంటున్న వారిలో చాలామంది ప్రభుత్వ అనుమతి లేకుండానే కొనసాగుతున్నారు. నోటరీగా సంతకాలు చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎప్పుడో నోటరీగా నమోదు చేయించుకుని కనీసం రెన్యువల్ లేకుండా అఫిడవిట్‌లపై సంతకాలు చేస్తున్నారు. నిబంధనలు పాటించకుండా ఇలా ఇష్టానుసారంగా సంతకాలు చేస్తుండటంతో ప్రజలు ఆర్థికంగా నష్టపోవడంతోపాటు జరిమానాలు, శిక్షలు అనుభవించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
డబ్బుల కోసమేనా..?
నోటరీలు అఫిడవిట్‌లపై సంతకాలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. జననం, మరణ, కులం, ఆదాయం, పేరు మార్పు, విడాకులు, బ్యాకింగ్, సేల్‌డీడ్‌పై కూడా సంతకాలు చేస్తున్నా రు. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనలు పాటిం చడం లేదని సమాచారం. స్టాంప్ పేపర్‌పై రాసి న దస్తూరిని పూర్తిగా చదివి.. వివరాలు ఉన్నట్లు అనిపిస్తేనే వాటిని ధ్రువీకరిస్తూ సంతకా లు చేయాలి. వివరాలకు సంబంధించిన వారు కూడా అందుబాటులోనే ఉండాలి. వ్యక్తి ముందుగా స్టాంప్‌పేపర్‌పై సంతకం చేసిన తర్వాతనే నోటరీగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇవేవీ పాటించకుండానే.. సంబంధించిన వారు లేకుం డానే డబ్బులకు ఆశపడి సంతకాలు చేస్తున్నారు.
పరిధి దాటి విరుద్ధంగా..
నోటరీ ధ్రువీకరణ చేయాలంటే ఓ పరిధి ఉంటుంది. వారికి కేటాయించిన ప్రాంతంలోని వారికి మాత్రమే నోటరీ చేయాలి. నోటరీ నెంబర్‌ను రిజిస్ట్రర్‌లో నమోదు చేసుకుని సంతకం చేయాలి. ఇలాంటి నిబంధనలు పాటించకుండానే సంతకాలు చేస్తూ నోటరీలు అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 250 మందే..
నోటరీగా రిజిస్ట్రషర్ అయినవారు ఉమ్మడి జిల్లాలో 250మంది ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు తెలుపుతున్నాయి. కానీ.. ఒక్క కరీంనగర్‌లోనే 100 మంది వరకు నోటరీలు ఉన్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో వెయ్యిమందికిపైగా నోటరీలుగా చెలామణి అవుతున్నట్లు సమాచారం. అఫిడవిట్‌పై సంతకాలు చేయడానికి సాధారణంగా కలెక్టరేట్, తహసీల్దార్, ఆర్‌టీఏతోపాటు ఎక్కువగా కోర్టు పరిసరాల్లో కనిపిస్తుంటారు. నోటరీ అంటే అఫిడవిట్‌లో తెలిపిన వివరాలు అన్ని సక్రమమే అని.. దాని బలపర్చుతూ తెలియచేయడం.
ప్రస్తుతం నోటరీ అని చెప్పుకునే వారికి అర్హత ఉందా..? అనే అనుమానం కలుగుతోంది. అర్హత అంటే ఒక డిగ్రీ పట్టానే కాదు. చదువుతోపాటు నోటరీగా ధ్రువీకరిస్తూ సంతకం చేయడానికిగల అర్హత. నిబంధనల ప్రకారం వీరిని ప్రభుత్వం నోటరీగా గుర్తించాలి. నోటరీగా పనిచేయడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి అనుమతి పొందాలి. ఇలా ఒకసారి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వారు జీవితకాలం నోటరీలు కాదు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా మాత్రమే వీరు నోటరీగా పనిచేయాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత తిరిగి నోటరీగా రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా గడువు దాటిపోయినా రెన్యువల్ లేకుండానే నోటరీగా సంతకాలు చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.
నోటరీస్ యాక్ట్ సెక్షన్ 12 ప్రకారం నేరం
అర్హత లేకుండా నకిలీ నోటరీ సంతకాలు చేసిన వారు నోక్ష శిక్షార్హులు. నకిలీ నోటరీ అని రుజువు అయితే 3నెలల జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అవకాశం ఉంది. నోటరీ స్టాంప్‌లో పేరు, వారికి కేటాయించిన ప్రాంతం, నోటరీగా వారికి ఉన్న గడువు తేదీ ఉండాలి. నోటరీ చేసినందుకు తీసుకున్న ఫీజుకు రశీదు కూడా ఇవ్వాలి.
నకిలీలను శిక్షించాలి
నకిలీ నోటరీలను గుర్తించి కఠినంగా శిక్షించాలి. చట్టభద్రతకు పనిచేయాల్సిన నోటరీలు చట్టానికే వ్యతిరేకంగా పనిచేయడం సరికాదు. దొంగ డాక్యుమెంట్లపై కొంతమంది నోటరీగా సంతకాలు చేస్తున్నారు. ఇలాంటివారిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగాల కోసం వెళ్లిన వారు నకిలీ నోటరీల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – ఎన్.శ్రీనివాస్, లోక్‌సత్తా జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment