
సాక్షి, హైదరాబాద్: నకిలీ వీసాల దందా సాగిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. వీసా, పాస్‌పోర్టుల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ గ్యాంగ్ కన్సెల్టెన్సీల పేరుతో వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతుందన్నారు. కస్టమర్లకు నకిలీ పత్రాలు ఏర్పాటు చేయడం కోసం వీరు మూడు నుంచి నాలుగు లక్షలు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. కెనడా, అమెరికా, ఇటలీ, స్పెయిన్, అరబ్ దేశాలకు వెళ్లే వారే లక్ష్యంగా ఈ ముఠా కార్యకాలాపాలు సాగిస్తుందని పేర్కొన్నారు.
ఈ ముఠా సమకూర్చిన పత్రాలతో కస్టమర్లు కాన్సులేట్‌లో వీసాకు దరఖాస్తు చేసుకుంటున్నారని వెల్లడించారు. ఇప్పటికే కొంతమంది నకిలీ పత్రాలతో వీసాలు పొంది స్టడీ, బిజినెస్, వర్క్, విజిటింగ్ కోసం విదేశాలకు వెళ్లారని తెలిపారు. 450 మందికి ఈ ముఠా నకిలీ పత్రాలు అందజేసిందన్నారు. నకిలీ పత్రాలతో వీసా పొంది ఎంత మంది విదేశాలకు వెళ్లారో గుర్తించే పనిలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ముఠాకు చెందిన రహీఉద్దీన్, ఖలిద్ ఖాన్, షైక్ ఇల్లియాస్, సైయాద్, జహీరుద్దీన్‌లను అరెస్ట్ చేశామని.. వారిపై ఇదివరకే చాలా క్రిమినల్ చేసులు ఉన్నాయని చెప్పారు.
సైదాబాద్, గోల్కొండ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు సాగిస్తుందని.. నకిలీ పాస్‌పోర్టులను కూడా తయారుచేస్తుందని ఆయన తెలిపారు. అనుమానం రాకుండా ఉండేందుకు ముఠా సభ్యులు అధిక నాణ్యత కలిగిన నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి 100 పాస్‌పోర్ట్‌లు, రబ్బర్ స్టాంప్స్, 3 లక్షల రూపాయల నగదు, కంప్యూటర్, ప్రింటర్స్, సెల్ల్ ఫోన్లు, స్కానర్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment