
సిటీ నుదుట పచ్చబొట్టు
సిటీలో మెగా హరితహారానికి అద్భుత స్పందన లభించింది. గ్రేటర్ నలుమూలలా.. ఒకే రోజు 29 లక్షల మొక్కలు నాటి సిటీజనులు పచ్చదనంపై మక్కువ చూపారు. గవర్నర్, సీఎం, మంత్రులతో పాటు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వలంటీర్లు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు.
సిటీబ్యూరో: మెగా హరిత హారంలో భాగంగా గ్రేటర్‌లో సోమవారం ఒక్కరోజే దాదాపు 29 లక్షల మొక్కలు నాటారు. వీటిని కనీసం మూడు నాలుగేళ్లు కాపాడగలిగితే నగర పచ్చదనం పెరగడంతోపాటు ప్రజలకు స్వచ్ఛమైన గాలి పీల్చే అవకాశం లభిస్తుంది. దే శ చరిత్రలోనే.. బహుశా మానవచరిత్రలోనే నభూతో నభవిష్యతి అన్న చందంగా ఒకేరోజు 29 లక్షల మొక్కలు నాటడం ద్వారా హైదరాబాద్ రికార్డు సృష్టించింది. ఒకే ఒక్కరోజు నాటిన ఇన్ని మొక్కలు/చెట్లను బతికించడమే ఇప్పుడు సవాల్. వీటిని కనుక కాపాడగలిగితే ఈ ఒక్కరోజు చేసిన ప్రయత్నం ఎన్నో ఏళ్లుగా పెంచిన పచ్చదనానికి సమానం కానుంది. గ్రేటర్ విస్తీర్ణం 1,50,000 ఎకరాలు కాగా, దాదాపు 6,590 ఎకరాల ప్రదేశంలో వీటిని నాటారు. ఇది దాదాపు 16 కేబీఆర్ పార్కులతో సమానం. ఇవి పెరిగి పెద్దవైతే గ్రేటర్‌లో ఇప్పుడు 5 శాతంగా ఉన్న పచ్చదనం, అదనంగా మరో 4.3 శాతం పెరిగి 9.3 శాతానికి చేరుకోనుంది. జనాభాకు త గిన విధంగా 33 శాతం పచ్చదనం ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యసాధనలో భాగంగా ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటాలనే దీక్షతో పనిచేసి లక్ష్యాన్ని అధిగమించారు. ఇదే దీక్షను కడదాకా కొనసాగించాల్సి ఉందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. మూడు నాలుగేళ్లు వీటిని సంరక్షిస్తే.. గ్రేటర్‌లోని దాదాపు కోటి మంది జనాభాకు కాలుష్యం కొంత తగ్గి కొత్త ఊపిరి అందుతుందని అంచనా.
మొక్కలు ఎక్కువగా నాటిన ప్రదేశాలు..
జీహెచ్‌ఎంసీ జీవవైవిధ్య విభాగం అధికారుల అంచనా మేరకు ఎకరాకు దాదాపు 440 మొక్కల వంతున నాటారు. వీటిల్లో ఎక్కువ మొత్తాల్ని ఆయా సంస్థల్లోని ఖాళీ ప్రదేశాల్లో నాటారు. వీటిల్లో ప్రగతి రిసార్ట్స్ , లహరి రిసార్ట్స్, జన్వాడ, డీఆర్‌డీఎల్ (దుండిగల్), ఇక్రిశాట్ , సెంట్రల్ యూనివర్సిటీ తదితరమైనవి ఉన్నాయి. వీటితోపాటు పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.
సంప్రదాయ మొక్కలకే జై ..
దాదాపు వంద జాతుల మొక్కల్ని ఈ కార్యక్రమంలో నాటారు. పెల్టోఫామ్ (కొండ తంగేడు) చెట్లు ఇటీవల వేల సంఖ్యలో గాలివానలకు నేలకొరగడంతో వాటి జోలికి పోలేదు. వేప, మర్రి, రావి,మద్ది, మేడి, మోదుగ, తెల్లమద్ది, రెడ్‌ఫౌంటెయిన్, బూరుగు, మల్బరీ వేప, చీమచింత, జువ్వి, జామ, సైకస్, సీమ తంగేడు, ఆకాశమల్లి, బారింగ్‌టోనియా, జిట్రేగి, దానిమ్మ, సువర్ణ గన్నేరు, పచ్చగన్నేరు, వెదురు, కృష్ణ తులసి తదితర రకాలకు ప్రాధాన్యమిచ్చారు. ప్రజలు తమ రాశి కనుగుణంగా ఉత్సాహంగా మొక్కలు నాటారు.
ఏడాది నిర్వహణకు రూ. 98 కోట్లు ..
నాటిన మొక్కల నిర్వహణ కోసం జీహెచ్‌ఎంసీ ఈ సంవత్సరం రూ. 22.50 కోట్లు కేటాయించింది. అయితే ఆయా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఎవరు నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతల్ని వారే నిర్వహించనున్నారు. ఒక్కో మొక్క నిర్వహణకు రూ. 340 వంతున సంవత్సరానికి దాదాపు రూ. 98 కోట్లు ఖర్చు కానుంది.
హరితం లెక్క ఇదీ..
గ్రేటర్ విస్తీర్ణం:
625 చదరపు కిలోమీటర్లు..(1.50 లక్షల ఎకరాలు)
మెగా హరితహారంలో నాటిన మొక్కలు:
సోమవారం ఒకేరోజు 29 లక్షలు
వినియోగమైన భూమి: సుమారు 6,590 ఎకరాలు
పెరగనున్న హరితం శాతం: 4.39
ప్రస్తుతం గ్రేటర్‌లో హరితం శాతం: 5
తాజా హరితహారంతో పెరగనున్న హరితం : 9.39 శాతం
నాటేందుకు, ఏడాది పాటు బతికించేందుకు అయ్యే వ్యయం:
ఒక్కో మొక్కకు దాదాపు రూ.340...
29 లక్షల మొక్కలకు 98.60 కోట్లు