మెుక్కలకు రక్షణేది ? | Plants ..No safety | Sakshi
Sakshi News home page

మెుక్కలకు రక్షణేది ?

Published Wed, Sep 21 2016 7:38 PM | Last Updated on Tue, Sep 18 2018 6:32 PM

మెుక్కలకు రక్షణేది ? - Sakshi

మెుక్కలకు రక్షణేది ?

  • సంరక్షణ మరిచిన అధికారులు 
  • ట్రీగార్డులు కరువు
  • ఎండిపోతున్న మెుక్కలు 
  • పట్టించుకోని బల్దియా యంత్రాంగం
  • కరీంనగర్‌ కార్పొరేషన్‌ : లక్ష్యం కోసం లక్షకు పైగా మెుక్కలు నాటారు. అయితే వాటి సంరక్షణమాత్రం మరిచారు. ఫలితంగా మెుక్కలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. పచ్చగా పెరిగిన వాటికి ట్రీగార్డులు లేక పశువుల పాలవుతున్నాయి. జూలై 18న తెలంగాణకు హరితహరంలో భాగంగా నగరంలో లక్షకు పైగా మెుక్కలు నాటారు. పలు డివిజన్లలో నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయకపోవడంతో పశువులు, పందులు తినిశాయి. కొన్ని వాడిపోగా, మరికొన్ని ఎండిపోయి మెుండాలు ఎక్కిరిస్తున్నాయి. 
    ట్రీగార్డుల కొనుగోలు జాప్యం
    నగరపాలక సంస్థ పరిధిలో ట్రీగార్డుల కొరత ఏర్పడింది. మొక్కలు నాటిన నెల రోజుల వరకు ట్రీగార్డులను సమకూర్చలేకపోయారు. దాతలు సహకారం అందించినా సరైన సమయానికి స్పందించకపోవడంతో లక్ష్యం నీరుగారిపోయింది. దాతల నుంచి సేకరించిన నిధులను బల్దియా అకౌంట్‌కు జమచేస్తే టెండర్ల ప్రాసెస్‌ ఆలస్యమవుతుందని, నేరుగా ట్రీగార్డుల తయారీకి ఉపయోగించారు. రెండు వేలకు మించి ట్రీగార్డులు కూడా అందించలేకపోయారు. మొక్కలు నాటిన తర్వాత అధికారులు మళ్లీ అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో నీరు లేక మొక్కలు ఎండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానికులే ట్రీగార్డులు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటికి నీరు దొరకని పరిస్థితులు ఎదురయ్యాయి. నగరాన్ని జోన్లుగా విడదీసి అధికారులను బాధ్యులుగా నియమించినా మెుక్కల సంరక్షణ మాత్రం మరిచారు. 
    ఆలస్యంగా వర్షాలు 
    జూలైలో మొక్కలు నాటితే ఆగస్టు నెలంతా వర్షాలు లేకపోవడంతో మెజారిటీ మొక్కలు ఎండిపోయాయి. ఆలస్యంగా వర్షాలు కురుస్తున్నా, సరైన సమయంలో నీరు లేకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. జియో ట్యాగింగ్‌తో మొక్కల లెక్కలు ఖచ్చితంగా చెబుతామని అప్లికేషన్‌ తయారు చేసినప్పటికీ దాని ఉపయోగం శూన్యం.  
    గుంతల బిల్లులు స్వాహా
    మొక్కల పరిస్థితి ఇలా ఉంటే గుంతల తవ్వి వాటి బిల్లులు మాత్రం వెంటనే తీసేసుకున్నారు. కొన్ని డివిజన్‌లలో అసలు గుంతలు తవ్వకుండానే బిల్లులు నొక్కేశారు. 82 వేల గుంతలు తవ్వినట్టు లెక్కలు చూసి హడావిడిగా రూ.16.5 లక్షల బిల్లులు పొందారు. ఈ విషయం తెలిసిన పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్‌లలో అసలు గుంతలే తవ్వలేదని, వందల సంఖ్యలో రికార్డు చేయడం విడ్డూరంగా ఉందని విస్తుపోయారు. హరితహారం మహోద్యమంలా సాగాలని ప్రభుత్వం భావిస్తే, కొందరి జేబుల్లోకి నిధుల వరద సాగింది.  
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement