తాగి బిల్లు ఎగ్గొట్టడం హాబీ !
హైదరాబాద్: చదివింది ఎంబీఏ... మొన్నటి వరకూ ఓ సాఫ్ట్ వేర్ సంస్థను నిర్వహించాడు. అయితే అదేం బుద్దో కాని స్టార్ హోటల్‌లోకి వెళ్లి పీకలదాకా మద్యం తాగి బిల్లు ఎగ్గొట్టడం అలవాటు చేసుకున్నాడు. ఇదే విధంగా గురువారం బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని పార్క్ హయత్ హోటల్‌లో మద్యం తాగి, రూ.4,700 బిల్లు చేశాడు. చెల్లించేందుకు జేబులో డబ్బులేకపోవడంతో బిల్లు ఎగ్గొట్టేందుకు యత్నించి పోలీసులకు చిక్కాడు.
పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో నివసించే సరోజ్ గుంట(38)కి స్టార్‌హోటళ్లలో మద్యం తాగడం మహాఇష్టం. ఎంబీఏ చదివిన సరోజ్ ఓ సాఫ్ట్ వేర్ సంస్థను పెట్టి దివాళా తీశాడు. అప్పటి నుంచి స్టార్ హోటళ్లకు వెళ్లడం.. బిల్లు ఎగ్గొట్టి పోలీసులకు చిక్కడం పరిపాటిగా మారింది. పోలీస్ స్టేషన్‌కు రాగానే విషయం తెలుసుకొని తండ్రి లేదా తమ్ముడు వచ్చి హోటల్ బిల్లు చెల్లించి స్టేషన్ నుంచి విడిపించుకెళ్లడం కూడా రివాజుగా మారింది. ఒక్క పార్క్ హయత్ హోటలే కాదు సోమాజిగూడలోని దిపార్క్, తాజ్‌బంజారా, తాజ్‌కృష్ణా, గ్రాండ్ కాకతీయ తదితర స్టార్ హోటళ్లు సరోజ్ బాధిత జాబితాలో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.