అరచేతిలో ఆరోగ్య డేటా | health data will get soon with smart cards | Sakshi
Sakshi News home page

అరచేతిలో ఆరోగ్య డేటా

Published Mon, Jan 4 2016 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

health data will get soon with smart cards

► రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ త్వరలో ఉచిత వైద్య పరీక్షలు
► సమగ్ర ఆరోగ్య వివరాలతో స్మార్ట్ కార్డులు
► ఉద్యోగుల నగదు రహిత వైద్య చికిత్సలో సమస్యల్ని పరిష్కరిస్తాం
► వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో సాక్షి ఇంటర్వ్యూ

 
 సాక్షి, హైదరాబాద్: చాలా మందికి బీపీ, షుగర్, గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులు ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నాయన్న సంగతి తెలియనే తెలియదు! ప్రాథమిక స్థాయిలో రోగాలను గుర్తించకపోతే అవి ముదిరి నయం కాని స్థితికి చేరుకుంటాయి. ఒక్కోసారి చేయి దాటిపోయే పరిస్థితి కూడా తలెత్తుతుంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించి అందరికీ ఆరోగ్య డేటా స్మార్ట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఏడాదే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. వివిధ అంశాలపై ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ..
 ప్రశ్న: ఆరోగ్య డేటా కార్డుల ఉద్దేశం ఏంటి?
 మంత్రి: అనేక వ్యాధులను ప్రాథమిక స్థాయిలో గుర్తించకపోవడం వల్ల చాలాసార్లు పరిస్థితి చేయి దాటిపోతోంది. ఇటీవల ఒకచోట నిర్వహించిన వైద్య శిబిరంలో ప్రజలకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తే అందులో 15 మందికి కేన్సర్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ వ్యాధి బారిన పడినవారు నిర్ఘాంతపోయారు. వ్యాధులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే వాటిని నయం చేయడానికి వీలుంటుంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరి ఆరోగ్యంపై వివరాలు సేకరించాలని నిర్ణయించాం. అందుకోసం ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. బ్లడ్ గ్రూప్, లిఫిడ్ ప్రొఫైల్, గుండె, లివర్, కిడ్నీ ఇతరత్రా వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య వివరాలు సేకరిస్తాం. ఆ సమాచారాన్నంతా కంప్యూటరీకరించి ఆన్‌లైన్‌లో పెడతాం. ప్రతీ ఒక్కరికి ఒక ఆరోగ్య డేటా నంబర్ కేటాయిస్తాం. ఆ నంబర్‌తో ఏటీఎం కార్డు సైజులో ఆరోగ్య డేటా స్మార్ట్ కార్డు జారీ చేస్తాం. ఏదైనా సమస్యతో వైద్యుడి వద్దకు వెళ్తే డేటా కార్డుపై ఉన్న నంబర్‌తో ఆన్‌లైన్లో ఆ రోగి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చు. ప్రజలు కూడా తమ అనారోగ్య సమస్యలు తెలుసుకొని ముందు జాగ్రత్తలు తీసుకుంటారు.

 ప్ర: అందరి ఆరోగ్య డేటా సేకరించడం సాధ్యమా?
మంత్రి: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) నిధుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు డయాగ్నోస్టిక్ కేంద్రాలను నెలకొల్పుతాం. ఆయా కేంద్రాల్లో ప్రజలందరికీ ఉచితంగానే వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ఆరోగ్య డేటా సేకరణకు నిర్ణీత తేదీలు ప్రకటించి ఆ ప్రకారం వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తాం. తర్వాత వారికి ఆరోగ్య డేటా కార్డులు అందజేస్తాం. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

 ప్ర: 12 కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందడం లేదు. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు?
మంత్రి: త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తాం. కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను పిలిపించి మాట్లాడతాం. ఉద్యోగులు ఒక విషయం అర్థం చేసుకోవాలి. కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనే కాకుండా ఆ స్థాయి లో మరో 24 ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. కేవలం ఆ 12 కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతాయన్న అపోహలను ఉద్యోగులు విడనాడాలి.

 ప్ర: మిగిలిన ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ నగదు రహిత వైద్య సేవలు అందడంలేదన్న విమర్శలున్నాయి కదా!
మంత్రి: రాష్ట్రం మొత్తం అలా ఏమీలేదు. నిమ్స్‌లో ఈ మూడు నెలల్లోనే 6 వేల మందికి ఉచిత ఓపీ నిర్వహించాం. ఆ కాలంలో అక్కడ 600 శస్త్ర చికిత్సలు జరిగాయి. ఎక్కడైనా సమస్యలున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే సరిదిద్దుతాం.

 ప్ర: వైద్యశాఖలో భర్తీ ప్రక్రియ ఎలా జరగబోతోంది?
 మంత్రి: వరంగల్ ఎంజీఎం, ఆరోగ్య వర్సిటీ, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీల్లో కొత్త ఉద్యోగాలు మంజూరయ్యాయి. ఇవిగాక ఇప్పటికే వైద్య శాఖలో పనిచేస్తున్న 2 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం.

 ప్ర: ఆసుపత్రుల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉంటోంది. దీనిపై ఏమంటారు?
మంత్రి: పాత ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలే ఇంకా కొనసాగుతుండటం, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పారిశుధ్యం సరిగ్గా లేదన్నది వాస్తవం. ఈ పరిస్థితిని ఈ ఏడాది మెరుగుపర్చుతాం. అందుకు సూపరింటెండెంట్లకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతను మేనేజ్‌మెంట్ నిపుణులకు అప్పగిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement