కాంట్రాక్టర్లతో టీఎస్‌ఎంఐడీసీ ఇంజినీర్ల కుమ్మక్కు
రూ.28 కోట్ల నుంచి రూ.66 కోట్లకు చేరిన వ్యయం
నిలోఫర్‌లో మాయాజాలం
సాక్షి, సిటీబ్యూరో: ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే మనం నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ రూపొందించుకుంటాం. ఆ తర్వాత బడ్జెట్‌పై ఓ అంచనాకు వస్తాం. కానీ ప్రతిష్టాత్మక నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రిలో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) నిధులతో నిర్మించిన నాలుగంతస్తుల రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ భవన నిర్మాణాన్ని ప్లానింగ్ లేకుండా చేపట్టారు. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో నిర్మాణ ఖర్చులు అంచనాలు దాటిపోయాయి. తీరా పనులన్నీ పూర్తయిన తర్వాత భవనం ఎన్‌హెచ్‌ఎం సూచించిన ప్లానింగ్ ప్రకారం లేదని... వార్డులు, మరుగుదొడ్లు, ఆపరేషన్ థియేటర్లు రీమోడిపికేషన్ చేయాల్సి ఉందని... దీనికి మరో రూ.6 కోట్లు ఖర్చవుతుందని కాంట్రాక్టర్ కోరారు. అధికారులు ఏమీ ఆలోచించకుండా దీనికి నిధులు మంజూరు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంచనాకు మించిన ఖర్చులు
దేశంలోనే రెండో అతిపెద్దదైన ఈ నవజాత శిశువుల వైద్య కేంద్రం సామర్ధ్యం 500 పడకలు. నిత్యం ఇక్కడ 800 నుంచి 1000 మంది చిన్నారులు చికిత్స పొందుతుంటారు. శిశువుల నిష్పత్తికి తగినన్ని పడకలు, వెంటిలేటర్లు, ఇంక్యుబేటర్లు లేకపోవడంతో ఒక్కో బెడ్డుపై ఇద్దరు, ముగ్గురిని పడుకోబెట్టి చికిత్సలు అందిస్తున్నారు. కొన్ని సమయాల్లో ఈ పడకలు కూడా సరిపోక నేలపైనే పడుకోబెడుతున్నారు. పుట్టుకతోనే వివిధ రకాల జబ్బులతో బాధ పడుతున్న నిరుపేద చిన్నారుల కష్టాలు తీర్చాలనే
ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఎం పథకం కింద 2008లో ఆస్పత్రికి రూ.28 కోట్లు కేటాయించింది.
జి+2 నిర్మాణానికి 2009లో దివంగత ముఖ్యమంత్రి ైవె ఎస్.రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆస్పత్రి అవసరాల దృష్ట్యా భవన సామర్థ్యాన్ని జి+4కు పెంచారు. ఆ మేరకు నిధులు పెంచింది. ఏడాది క్రితం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ.60 కోట్లతో నాలుగు అంతస్తుల్లో 400 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ కొత్త భవనంలో లేబర్ డెలివరీ రికవరీ కాంప్లెక్స్ (ఎల్‌డీఆర్), మోడల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎంఐసీయూ), హెచ్‌డీయూలు లేకపోవడంపై ఎన్‌హెచ్‌ఎం బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు... క్యాజువాలిటీ, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఇతర నిర్మాణాల్లో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షించాల్సిన వైద్య మౌలిక సదుపాయాల సంస్థ ఇంజినీర్లు కాంట్రాక్టర్ ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడడమే ఈ దుస్థితికి కారణమని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు.
మార్పులు, చేర్పులు అవసరం లేదు
ఒకసారి పనులన్నీ పూర్తయిన తర్వాత మళ్లీ రీ మోడిపికేషన్ అంటే నిధులను దుబారా చేయడమే. రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో మళ్లీ మోడిపికేషన్ పనులు చేపడితే భవనం ప్రారంభానికి మరో రెండేళ్లు పడుతుంది. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో వచ్చిన వారికి కనీస వసతి కల్పించలేకపోతున్నాం. మార్పులు, చేర్పులతో పని లేకుండా వెంటనే భవనాన్ని ప్రారంభించి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలి. అవసరమైతే కేంద్రం తాజాగా మంజూరు చేసిన రూ.6 కోట్లతో ఇదేచోట మరో భవనం నిర్మించవచ్చు. ఈ విషయంపై ప్రభుత్వానికి లేఖ రాశాం.
-డాక్టర్ సురేష్ కుమార్, సూపరెంటెండెంట్, నిలోఫర్
ఏమిటో ప్లాన్?
Published Tue, Dec 8 2015 3:59 AM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM