
మోకాల్లోతున మహానగరం
రాజధానిని ముంచెత్తిన భారీ వర్షం
కాలనీలు జలమయం.. ట్రాఫిక్ జామ్‌తో ఇక్కట్లు
సాక్షి, హైదరాబాద్:
ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎడతెగని వర్షం కురిసింది. రాజేంద్రనగర్, మలక్‌పేట్, గోషా మహల్, పాతబస్తీలోని పలు ప్రాంతాలను, కాలనీలను వరదనీరు ముంచెత్తింది. రాజేంద్రనగర్‌లోని పలు అపార్ట్‌మెంట్లలోకి వర్షపు నీరు చేరింది. సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలో ఒక మోస్తరు వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన నీటిని తొలగించేందుకు జనం అవస్థలు పడ్డారు. భారీ వర్షానికి మూసీలో వరదనీరు పోటెత్తింది. చాదర్‌ఘాట్ మినీ కాజ్‌వేపై వరదనీటితో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల్లో స్వల్పంగా వరదనీరు చేరింది.
మలక్‌పేటలో కుంగిన రోడ్డు
భారీ వర్షాలతో రోడ్డుపై పోటెత్తిన వరదనీటితో మలక్‌పేట వద్ద రోడ్డు కుంగిపోరుుంది. వులక్‌పేట గంజ్ వద్ద మెట్రోరైల్ వూర్గం పిల్లర్ల నిర్మాణాల చుట్టూ ట్రాఫిక్ రక్షణార్థం ఏర్పాటు చేసిన ఇనుప బారికేడ్‌లు, పిల్లర్‌ల కోసం తవ్విన లోతైన గుంతల్లో కుంగిపోయాయి. అదే ప్రాంతంలో డ్రైనేజీ పనులకోసం తవ్విన గోతుల్లోకీ వర్షపు నీరు చేరడంతో రోడ్డు ఏదో, గొయ్యి ఏదో తెలియని ప్రమాదకర పరిస్థితి ఏర్పడి, ఆ ప్రాంతంలో రాకపోకలు భారీగా స్తంభించాయి. మలక్‌పేట రైల్వే బ్రిడ్జి కింది భాగంలో నడుములోతు వరద నీరు చేరి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో,.. కోఠీ నుంచి వచ్చే వాహనాలను నల్లగొండ క్రాస్‌రోడ్ నుంచి పల్టాన్ మీదుగా దిల్‌సుఖ్‌నగర్‌కు మళ్లించారు. చాదర్‌ఘాట్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ మధ్య రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణానికి వాహనాలకు రెండు గంటలు పట్టింది.