
జూలో పులిపై నీళ్లు చల్లుతూ..
సొంతిల్లు కట్టుకుంటున్నారనగానే... ఫ్లోరింగ్ మార్బులా? టైల్సా? సీలింగ్‌కి ప్లాస్టరాఫ్ పారిసా? థర్మాకోల్‌తోనా? మెయిన్‌డోర్ సంగతేంటి? ఇంటీరియర్స్ ఎలాంటివి చేయిస్తున్నారు?.. అన్నీ ఇలాంటి ప్రశ్నలే తప్ప ఇంట్లో మొక్కలకు స్థలం ఉందా? టైపైన గార్డెన్ ఏర్పాటు చేస్తున్నారా? అని అడిగేవారే లేరు..
ఆ విషయం గురించి ఆలోచించే వారూ లేరు. ఓ వైపు ఆకాశహర్మ్యాలతో సిటీని కాంక్రీట్ జంగిల్‌లా మారుస్తున్నాం. మరోవైపు పచ్చదనం వర్ధిల్లాల్సిన అవసరాన్ని విస్మరిస్తున్నాం. ఆ ధోరణే మండే ఎండలకు రెడ్ కార్పెట్ వేస్తోంది. అయితే సిటీలో ఈ విషయంలో కొందరు మాత్రం తమ వంతు కృషి చేస్తున్నారు. ఆధునికంగా ఇంటిని తీర్చిదిద్దుకుంటూనే పచ్చదనానికి కూడా పెద్ద పీట వేస్తూ మండే ఎండల బారి నుంచి ఉపశమనం పొందుతున్నారు. చుట్టుపక్కల వారంతా బాబోయ్ న‘గరం’ అంటున్నా, వీరు మాత్రం పచ్చదనమే సాక్షిగా ఎండలకి నో ఎం‘ట్రీ’ బోర్డు పెట్టేశారు.