సమావేశంలో మాట్లాడుతున్న ప్రకాష్‌రాజ్
హైదరాబాద్: రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సినీ నటుడు ప్రకాష్‌రాజ్ అన్నారు. గురువారం సాయంత్రం మణికొండ పంచాయతీ పరిధిలోని చిత్రపురి కాలనీలో ‘వెజ్ మంత్ర’ పేరుతో తాజా కూరగాయల విక్ర య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజ ఎరువులతో పండించే పంటలను తినాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉందన్నారు.
సమాజానికి సేవలదించాలనే ఉద్దేశంతోనే మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్నట్టు చెప్పారు. అక్కడ పండుతున్న కూరగాయలను నేరుగా వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాన న్నారు. తాను పొలం కొని వ్యవసాయం చేస్తున్నందున రైతుల బాధలు తెలిశాయన్నారు. ఆ గ్రామంలోని రైతుల కూరగాయలన్నీ నేరుగా ప్రజలకు అందించేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.
తాను సినిమా కుటుంబానికి చెందిన వ్యక్తిని కావటంతో మొదటగా చిత్రపురి నుంచి మొదలు పెడుతున్నానన్నారు. దత్తత తీసుకున్న గ్రామంలోని మిగతా రైతులందరితోనూ సహజ ఎరువులతోనే పంటలను పండించి రాబోయే రోజుల్లో మరిన్ని చోట్ల ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రపురి కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్, ఉపాధ్యక్షుడు వినోద్‌బాల, కాదంబరి కిరణ్, కట్టా రాజేశ్వర్‌రెడ్డి, చంద్రమధు తదితరులు పాల్గొన్నారు.