విపరీతమైన కరువుతో బాధపడుతున్న తమిళనాడు రైతులకు మద్దతుగా తమిళ నటులు కూడా రోడ్డెక్కారు. హీరో విశాల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ ఇద్దరూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. అప్పటికే అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్న రైతులతో కలిసి జంతర్ మంతర్ వదద్ రోడ్డు మీద కూర్చున్నారు. నల్లటి దుస్తులు వేసుకున్న విశాల్, ప్రకాష్ రాజ్ ఇద్దరూ కలిసి రైతులకు అనుకూలంగా నినాదాలు చేశారు.
రైతులు కూడా మెడలో కపాలాలు ధరించి.. కరువు తీవ్రతను ప్రతిబింబించేలా నిరసన వ్యక్తం చేశారు. రైతుల రోదనలను ఎవరూ వినిపించుకోవడం లేదని, అందుకే ఇక్కడ తీవ్రస్థాయిలో ధర్నా చేస్తున్నామని ప్రకాష్ రాజ్ అన్నారు. తమ నిరసనలతోనైనా సంబంధిత మంత్రులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన చెప్పారు.