జీవో 123 రద్దుపై అప్పీల్కు వెళ్తాం: హరీశ్ | High Court Cancelled GO No 123:Telangana govt to approach division | Sakshi
Sakshi News home page

జీవో 123 రద్దుపై అప్పీల్కు వెళ్తాం: హరీశ్

Published Wed, Aug 3 2016 7:42 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

జీవో 123 రద్దుపై అప్పీల్కు వెళ్తాం: హరీశ్

జీవో 123 రద్దుపై అప్పీల్కు వెళ్తాం: హరీశ్

హైదరాబాద్ : జీవో నెంబర్ 123, 124 రద్దుపై అప్పీల్కు వెళతామని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీని పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆయన బుధవారమిక్కడ అన్నారు. రైతులకు మెరుగైన పరిహారం ఇచ్చేందుకే జీవో 123ని తీసుకు వచ్చామన్నారు. జీవో 123పై ఖచ్చితంగా న్యాయం పొందుతామని హరీశ్ రావు దీమా వ్యక్తం చేశారు. జీవో 123 ద్వారా పేద ప్రజలకు, నిర్వాసితులకు మరింత మెరుగైన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం భావించిందన్నారు. 2013 భూసేకరణ చట్టంలో ఉన్న వెసులుబాటు ఆధారంగానే 123 జీవోను జారీ చేశామన్నారు.

123 జీవోపై రైతుల విజయం
కాగా కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం రుద్రంగి శివారులో గల కలికోట చెరువులో భూములు కోల్పోతున్న నలుగురు రైతులు 123జీవోపై హైకోర్టులో పోరాడి విజయం సాధించారు. భూసేకరణ జీవో 123ని సవాల్ చేస్తూ వీరు హైకోర్టు ఆశ్రయించగా.. కోర్టు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని బుధవారం తీర్పునిచ్చింది. కాగా...ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రభుత్వం కలికోట చెరువును మినీ రిజర్వాయర్‌గా నిర్మిస్తోంది. ఇందులో రుద్రంగి గ్రామానికి చెందిన 275 మంది రైతులకు చెందిన 450 ఎకరాల భూమి ముంపునకు గురవుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం 123 జీవో ప్రకారం ఎకరాకు రూ.2.10 లక్షల పరిహారం చెల్లించేందుకు సిద్ధపడగా, సగం మందికిపైగా రైతులు చెక్కులను తీసుకున్నారు. మరో వందమంది రైతులు పరిహారాన్ని తీసుకునేందుకు నిరాకరించారు. తమకు న్యాయం చేయూలంటూ సిహెచ్.బాలకిషన్‌రావు, సావనపెల్లి నారాయణ, ఆకుల శ్రీనివాస్, ఎర్రం వెంకటి ఆరునెలల క్రితం హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు రైతులు వేసిన పిటిషన్‌పై వాదోపవాదాల అనంతరం 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.4.95 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇదిలా ఉండగా, పరిహారం తీసుకున్న రైతులు సైతం ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ వాపోతున్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం తమకు కూడా రూ.4.95 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేంత వరకు పోరాడుతామని పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement