కోర్టులంటే జోక్ అయిపోయిందా?
- బోరు బావుల కేసులో రెవెన్యూ ముఖ్య కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం
- నివేదిక కోరితే రెండు కాగితాలు మా ముఖాన కొడతారా?
- ఇదేనా కోర్టులకిచ్చే గౌరవం.. బాధ్యతారాహిత్యం ఉపేక్షించబోం
- మీపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పండి
- ముఖ్య కార్యదర్శికి నోటీసులు.. విచారణ వచ్చే వారానికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ‘కోర్టులంటే జోక్ అయిపోయిందా? నివేదికివ్వాలని ఆదేశిస్తే, ఏవో రెండు కాగితాలు తీసుకుని కోర్టు ముఖం మీద కొడితే సరిపోతుందనుకుంటున్నారా? ఇదేనా కోర్టులకిచ్చే గౌరవం? ఇంత నిర్లక్ష్య వైఖరా?’ అంటూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బోరు బావుల్లో పడి చిన్నారులు మృతి చెందుతున్న ఘటనలు ఎక్కువవుతుండటంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. బోరు బావుల ఘటనలు పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది.
కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో.. దాన్ని కోర్టు ధిక్కారం కింద ఎందుకు పరిగణించకూడదో స్పష్టంగా చెప్పాలంటూ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అంతర్గత డాక్యుమెంట్ సమర్పించారు: న్యాయవాది
బోరు బావుల తవ్వకాలు, నిరుపయోగంగా మారిన బోరు బావుల పూడ్చివేత విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో న్యాయవాది బుద్ధారపు ప్రకాశ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. బోరుబావుల ఘటనలు పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని రెవెన్యూ ముఖ్య కార్యదర్శిని గత విచారణ సందర్భంగా కోర్టు ఆదేశించిందని ధర్మాసనానికి గుర్తు చేశారు. అయితే నివేదిక సమర్పించకుండా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, విపత్తుల నిర్వహణ కమిషనర్ మధ్య జరిగిన అంతర్గత డాక్యుమెంట్‌ను కోర్టుకు సమర్పించారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తమ ముందున్న కాగితాలను పరిశీలించిన ధర్మాసనం.. రెవెన్యూ ముఖ్య కార్యదర్శిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.