బోరుబావి ప్రమాదాలు.. ఒకసారి విఫలం.. మరోసారి సఫలం | Here's The List And Details Of 10 Borewell Incidents In India, Check Out For More Information | Sakshi
Sakshi News home page

బోరుబావి ప్రమాదాలు.. ఒకసారి విఫలం.. మరోసారి సఫలం

Published Thu, Jan 2 2025 7:58 AM | Last Updated on Thu, Jan 2 2025 8:47 AM

Borewell accidents in india with details

రాజస్థాన్‌లో మరో బోరుబావి దుర్ఘటన చోటుచేసుకుంది. బోరుబావిలో పడిపోయిన చిన్నారి చేతన(3)ను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫల‍మయ్యాయి. రెస్క్యూ సిబ్బంది 10 రోజుల ప్రయత్నాల అనంతరం ఆ చిన్నారిని విగతజీవిగా బయటకు తీసుకువచ్చారు. ఇటువంటి దుర్ఘటనలు గతంలోనూ అనేకం చోటుచేసుకున్నాయి.

ప్రిన్స్ కుమార్ కశ్యప్ (హర్యానా) 
2006లో హర్యానాలోని ఒక బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల ప్రిన్స్‌ కుమార్ కశ్యప్‌ను రక్షించేందుకు భారీ ఆపరేషన్ నిర్వహించారు. హర్యానాలోని కురుక్షేత్రలోని ఓ గ్రామంలో 55 అడుగుల లోతైన బోరుబావిలో ప్రిన్స్‌ పడిపోయాడు. దాదాపు 48 గంటల తర్వాత రెస్క్యూ సిబ్బంది ప్రిన్స్‌ను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. నాడు బాధిత బాలుడు సురక్షితంగా బయటపడాలని కాంక్షిస్తూ దేశవ్యాప్తంగా చాలామంది పూజలు, యజ్ఞాలు నిర్వహించారు.

మహి(హర్యానా) 
2012, జూన్‌లో హర్యానాకు చెందిన ఐదేళ్ల మహి తన స్నేహితులతో ఆడుకుంటూ 60 అడుగుల పాడుబడిన బోరుబావిలో పడిపోయింది. ఐదు రోజుల పాటు సైన్యం, జిల్లా యంత్రాంగం భారీ ప్రయత్నాలు చేసినప్పటికీ బాలికను రక్షించలేకపోయింది. ఒక భారీ రాయి రెస్క్యూ ఆపరేషన్‌కు అడ్డంకిగా నిలిచింది.

సాయి బర్హతే (మహారాష్ట్ర)
2017, మే నెలలో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని కోపర్‌గావ్‌లో ఏడేళ్ల బాలుడు సాయి బర్హతే బోరుబావిలో పడిపోయాడు. రెస్క్యూ సిబ్బంది పలు ప్రయత్నాలు చేసినప్పటికీ బాలుడిని రక్షించలేకపోయారు.

నదీమ్ (హర్యానా)
2019, మార్చిలో హిసార్ జిల్లాలోని బల్సామంద్ గ్రామంలో  55 అడుగుల లోతైన బోర్‌వెల్‌లో ఒకటిన్నర ఏళ్ల బాలుడు నదీమ్ పడిపోయాడు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, సైన్యం విభాగాల 48 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత బాలుడిని రక్షించారు. బోరుబావికి సమాంతర గొయ్యి తవ్వడం కోసం దాదాపు 40 జేసీబీ యంత్రాలను వినియోగించారు. 150 మంది పోలీసులతో పాటు ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 100 మంది సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సీమ (రాజస్థాన్)
2019, మే నెలలో జోధ్‌పూర్‌లోని మెలానా గ్రామంలో 440 అడుగుల లోతైన బోరుబావిలో సీమ అనే నాలుగేళ్ల బాలిక పడిపోయింది. 260 అడుగుల లోతులో ఇరుక్కుపోయిన చిన్నారిని బయటకు తెచ్చేందుకు 14 గంటల ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకపోయింది. బాలిక మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. బాలిక తండ్రి మరమ్మతుల కోసం బోరుబావిని తెరిచి ఉంచిన కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది.  

ఫతేవీర్ సింగ్ (పంజాబ్)
2019, జూన్‌లో రెండేళ్ల ఫతేవీర్ సింగ్ ఆడుకుంటూ 120 అడుగుల లోతైన బోర్‌వెల్‌లో పడిపోయాడు. 109 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్‌ చేసినప్పటికీ, బాలుడిని రక్షించలేకపోయాడు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినప్పటికీ, ప్రయోజనం లేకపోయింది. అధికారులు బాధిత చిన్నారికి ఆక్సిజన్ సరఫరా చేయగలిగినప్పటికీ, ఆహారం లేదా నీరు అందించలేకపోయారు.

రితేష్ జవాసింగ్ సోలంకి (మహారాష్ట్ర)
2021 నవంబర్‌లో ఆరేళ్ల బాలుడు రితేష్ జవాసింగ్ సోలంకి  200 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బందికి 16 గంటల సమయం పట్టింది.

గుజరాత్‌
2022 జూన్ 9న, గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలో రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. సైన్యం, అగ్నిమాపక దళం, పోలీసులు, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమై బాలుడిని రక్షించగలిగారు.

పంజాబ్‌
2022, మే 22న పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో 100 అడుగుల లోతైన బోరుబావిలో ఆరేళ్ల బాలుడు పడిపోయాడు. తొమ్మిది గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించనప్పటికీ ఫలితం లేకపోయింది.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
2009లో బోరుబావి ప్రమాదాలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. 2010లో వీటిని సవరించింది. వీటిలో బోరుబావి నిర్మాణ సమయంలో బావి చుట్టూ ముళ్ల కంచెను ఏర్పాటు చేయడం, బావి అసెంబ్లీపై బోల్ట్‌లతో  స్టీల్ ప్లేట్ కవర్లను అమర్చడం, బోరుబావి పాడయినప్పుడు దానిని మూసివేయడం మొదలైనవి ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: New Year 2025: ఇకపై పుట్టేవారంతా ‘బీటా బేబీస్‌’
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement