ఏపీఎస్‌ఎఫ్‌సీకి భూ కేటాయింపులపై యథాతథ స్థితి
తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు ఆదేశం
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కారుకు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం వద్ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఏపీఎస్‌ఎఫ్‌సీ)కు కేటాయించిన భూముల విషయంలో యథాతథ స్థితిని(స్టేటస్ కో) కొనసాగించాలని హైకోర్టు గురువారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ భూ కేటాయింపులను రద్దు చేయడంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2007లో ఏపీఎస్‌ఎఫ్‌సీకి గాజులరామారం వద్ద 271.39 ఎకరాలను కేటాయించింది.
ఈ కేటాయింపులను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గత నెల 29న ఉత్తర్వులిచ్చింది. ఈ రద్దును సవాలు చేస్తూ ఏపీఎస్‌ఎఫ్‌సీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ వ్యాజ్యాన్ని గురువారం ధర్మాసనం విచారించింది. ఏపీఎస్‌ఎఫ్‌సీ తరఫున ఏపీ అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఈ కేటాయింపులను రద్దు చేసే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదన్నారు. అనంతరం తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. రూ.కోట్ల విలువైన భూమిని ఏపీఎస్‌ఎఫ్‌సీ పరిరక్షించడం లేదని, ఆ భూమిని కాపాడేందుకు కేటాయింపులను రద్దు చేశామని తెలిపారు. తెలంగాణ భూభాగంలో ఉన్న భూమిపై తమకు చట్ట ప్రకారం హక్కులున్నాయని పేర్కొన్నారు. గడువు ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు.