APSFC
-
హైదరాబాద్‌లో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. త్వరపడండి
హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్సీ).. హెడ్ ఆఫీస్(తెలంగాణ డివిజన్ ఆఫీస్)లో పని చేయడానికి అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 20 ► విభాగాలు: ఫైనాన్స్, టెక్నికల్, లా. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో లా పోస్టు గ్రాడ్యుయేషన్, బీటెక్, సీఏ/సీఎంఏ/ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వయసు: 34 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ► జీతం: నెలకు రూ.35,120 నుంచి రూ.87,130 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానం(ఆన్లైన్)లో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 120 నిమిషాలు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022 ► వెబ్సైట్: esfc.telangana.gov.in -
‘ఈనాడు’ సొమ్ములు పోయాయా? ఏది నిజం?
‘ప్రభుత్వం డబ్బులు పోయినా పర్వాలేదు!. ఇంటిదొంగలు మింగేస్తే మింగేయనీయండి!. వాటిని సురక్షితంగా ప్రభుత్వం దగ్గరే ఉంచితే మాత్రం... మేం ఊరుకోం’... అన్నట్టుంది ‘ఈనాడు’ తీరు. ఒక వంక ప్రభుత్వ సంస్థల్లో కొందరి కారణంగా కోట్ల రూపాయల డిపాజిట్లు పక్కదోవ పట్టిన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మరోపక్క గత ప్రభుత్వాలు కమీషన్లకు కక్కుర్తి పడి... ఫలానా బ్యాంకులోనే డిపాజిట్లు చేయండంటూ ఇచ్చిన ఆదేశాలు కూడా కొంప ముంచిన సందర్భాలున్నాయి. వీటన్నిటికీ చెక్‌పెడుతూ రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థిక శాఖ పరిధిలో వాటిని ప్రభుత్వం వద్దే ఉంచే ప్రయత్నాలు మొదలెట్టింది. పైపెచ్చు ఇలా ఉంచిన సొమ్ముకు మిగతా బ్యాంకులకన్నా ఎక్కువ వడ్డీనే ఆఫర్ చేస్తోంది. దీనివల్ల పారదర్శకతతో పాటు ప్రభుత్వ సొమ్ముకు భద్రతా పెరుగుతుంది. ఆర్థికశాఖ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది కనక మెరుగైన రాబడీ వస్తుంది. కానీ ‘ఈనాడు’కు మాత్రం ఇది నచ్చడం లేదు. అంతే!!... ప్రభుత్వ నిర్ణయానికి వక్రభాష్యం చెబుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించేలా ఓ ఊహాజనిత కథనాన్ని వండేసింది. ‘డిపాజిట్ల మళ్లింపు’ శీర్షికతో సోమవారం మొదటి పేజీలో అచ్చేసింది కూడా. మిగులు నిధుల్ని ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు మళ్లించాలని ఆదేశించినా కొన్ని సంస్థలు వినలేదని, దీంతో ఈ ఉత్తర్వులిచ్చారని పేర్కొంటూ ‘ఈనాడు’ వండి వార్చిన ఈ కథనంలో నిజమెంత? ఏది నిజం? ఒకసారి చూద్దాం... రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రూ.9.6 కోట్లను అధికారులు కాజేశారు. ఓ ప్రైవేటు బ్యాంకులో ఖాతా తెరిచి... అందులోకి మళ్లించి... అక్కడి నుంచి డ్రా చేసుకుని మింగేశారు. అదే తరహాలో ఏపీ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ డిపాజిట్ చేసిన రూ.5 కోట్లను కూడా ఇంటిదొంగలు కాజేశారు. పాలకవర్గానికి తెలియకుండా నకిలీ ఎఫ్డీ రసీదులతో వాటిని సొంత ఖాతాలకు మళ్లించేసుకున్నారు. ఇలాంటి సంఘటనలను గతంలో పలు సార్లు ‘కాగ్’ నివేదికలు కూడా బయటపెట్టాయి. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ రంగ సంస్థలు ఇష్టానుసారం బ్యాంకు ఖాతాలు తెరిచి, నిధులు వెచ్చిస్తున్నాయి.. భారీగా అక్రమాలకూ పాల్పడుతున్నాయి’ అని పలుమార్లు కాగ్ నివేదికలు తప్పుబట్టాయి. ఇదిగో... ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాధనం దుర్వినియోగమయిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ... ఇకపై అలా కాకుండా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు తమ మిగులు నిధులను ‘ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్’లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. నిజానికి ప్రభుత్వ రంగ సంస్థల నిధులు వినియోగంపై ఎన్నో ఏళ్లుగా సరైన పర్యవేక్షక వ్యవస్థ లేదు. ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పలుమార్లు అప్పటి ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చింది కూడా!. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో సరైన ఆర్థిక నిపుణులు గానీ తగినంత మంది సిబ్బంది గానీ ఉండరు. ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుభవం ఉండదు. నిధుల డిపాజిట్, విత్‌డ్రాలపై సరైన పర్యవేక్షణ ఉండదు. పై అధికారి ఓకే చేస్తే ఏమైనా చేయొచ్చని గతంలో ఎన్నో ఉదంతాలు నిరూపించాయి. గతంలో పలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు, కొన్ని జిల్లాల్లో డీసీసీబీల నిధులు దుర్వినియోగమైన ఉదంతాలూ బయటపడ్డాయి. తాజాగా తెలంగాణలో తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారం సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థల మిగులు నిధులన్నీ ‘ఏపీఎస్ఎఫ్సీ’ ఖాతాలో డిపాజిట్ చేస్తే.. ఏకీకృత వ్యవస్థ ద్వారా పటిష్టంగా పర్యవేక్షించవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. అక్కడ ఆర్థిక నిపుణులూ ఉంటారు కనక మెరుగైన నిర్వహణ సాధ్యం. తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ సంస్థలు మినహా మిగతా శాఖలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, సొసైటీలు, బోర్డులు, ట్రస్టులు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నూరు శాతం యాజమాన్య సంస్థ అయిన ఏపీఎస్‌ఎఫ్‌సీకి జమ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదేమీ ప్రయివేటు బ్యాంకు కాదు కదా? ప్రభుత్వ రంగ సంస్థల మిగులు నిధులను ప్రభుత్వ సంస్థే అయిన ‘ఏపీఎస్ఎఫ్సీ’కి మళ్లిస్తే ‘ఈనాడు’ ఇంతలా ఎందుకు గుండెలు బాదుకుంటోందన్నది ఎవ్వరికీ అర్థం కాదు. ఇదేమైనా ప్రయివేటు బ్యాంకో, ఎన్బీఎఫ్సీనో అయితే ‘ఈనాడు’ అభ్యంతరం చెప్పినా అర్థం ఉండేదన్నది నిపుణుల మాట. నిజానికి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను ప్రైవేటు రంగంలోకి ‘యాక్సిస్ బ్యాంకు’లో డిపాజిట్ చేయాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై అప్పట్లో ఆర్థిక నిపుణులు అభ్యంతరాలు వ్యక్తంచేసినా పట్టించుకోలేదు. చంద్రబాబు ఒత్తిడితో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపినా.. ‘ఈనాడు’కు మాత్రం అదేమీ తప్పుగా అనిపించలేదు. శ్రీవారి భక్తుల విరాళాలకు ముప్పు ఉంటుందన్న ఆలోచనే కనిపించలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. ఆ నిధులన్నిటినీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయించింది. అదీ ప్రజాధనం పట్ల వై.ఎస్.జగన్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత. -
ముదిరిన ఏపీఎస్ఎఫ్సీ విభజన
• రూ.500 కోట్ల విలువైన భూములకు ఎసరుపెట్టిన ఏపీ • సమాచారం ఇవ్వకుండా విభజన ప్రణాళిక కేంద్రానికి పంపిన వైనం • ఏకపక్ష బోర్డు తీర్మానం చెల్లదంటూ తెలంగాణ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వైఖరితో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనలో తెలంగాణకు భారీగా నష్టం వాటిల్లే పరిస్థితి తలెత్తింది. సమాచారం ఇవ్వకుండా విభజన చేయమని నమ్మబలికి, చెప్పాపెట్టకుండా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని రూ.కోట్ల విలువైన భూములకు ఏపీ సర్కార్ ఎసరు పెట్టింది. దీంతో రంగారెడ్డి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్సీ) కేటాయించిన రూ.500 కోట్ల విలువైన తెలంగాణ భూములు చిక్కుల్లో పడ్డాయి. వాస్తవానికి విభజన చట్టం సెక్షన్ 53 ప్రకారం షెడ్యూల్ 9లోని సంస్థలకు సంబంధించిన ఆస్తులు ప్రధాన కార్యాలయం ఉన్నచోటనే పంచుకోవాలి. అయితే ప్రధాన కార్యాలయాన్ని నిర్వచించే అంశం కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉంది. పైగా ఏపీఎస్ఎఫ్సీ ప్రధాన కార్యాలయం రంగారెడ్డి జిల్లాలో లేదు. వీటితోపాటు ఏపీఎస్ఎఫ్సీ అధీనంలో ఉన్న రూ.కోట్ల డబ్బు పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. తమకున్న ఆస్తుల్లో ఎక్కువ వాటా ఏపీఎస్‌ఎఫ్‌సీకి దక్కేలా.. నామమాత్రంగా తెలంగాణ కార్పొరేషన్‌కు దక్కేలా సంస్థ విభజన పూర్తి చేసేందుకు గుట్టుచప్పుడు కాకుండా పావులు కదిలాయి. తెలంగాణ ప్రభుత్వానికి కనీస ప్రాధాన్యం ఇవ్వకుండా ఏపీఎస్ఎఫ్సీ బోర్డు ఏకపక్షంగా విభజన ప్రణాళికను ఆమోదించి కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. ఆలస్యంగా తేరుకున్న తెలంగాణ ప్రభుత్వం బ్యాంకుల్లో ఈ సంస్థ లావాదేవీలను నిలిపివేయాలని, తమకు తెలియకుండా డబ్బులు డ్రా కాకుండా చూడాలని బ్యాంకర్లకు లేఖలు రాసింది. మరోవైపు ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించేలా చేపట్టిన చర్యలన్నీ వెనక్కి తీసుకోవాలని, ఏపీఎస్ఎఫ్సీ పంపించిన విభజన ప్రణాళికను ఆమోదించవద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఏపీఎస్ఎఫ్సీ విభజన వ్యవహారం ముదిరి పాకానపడింది. మూడేళ్లయినా.. విభజన జరిగి మూడేళ్లు కావస్తున్నా ఏపీఎస్ఎఫ్సీ విభజన వివాదం ఇప్పటికీ సమసి పోలేదు. గుట్టు చప్పుడు కాకుండా గతేడాది జనవరిలోనే ఏపీఎస్ఎఫ్సీ విభజన తతంగం నడిపింది. బోర్డు సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇది గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ సందర్భంగా అనుసరించిన తీరును తప్పు బట్టింది. తమకు సమాచారం లేకుండా తమ ప్రమేయం లేకుండా విభజన ప్రణాళిక రూపొందించటంపై విస్మయం వ్యక్తం చేసింది. ఏపీఎస్ఎఫ్సీ బోర్డులో ఏపీకి సమానంగా తెలంగాణకు ప్రాతినిథ్యం లేదు. రెండు రాష్ట్రాలకు సరైన సంఖ్యలో సభ్యులుండేలా బోర్డును పునర్నియామకం చేయాలని, తర్వాతే విభజన చేపట్టాలని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ఈలోగా విభజన ప్రణాళికను తయారు చేయటాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుపట్టింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీఎస్ఎఫ్సీ తొమ్మిదో షెడ్యూలులో ఉంది. అందుకే చట్ట ప్రకారం ఆస్తులు, అప్పుల పంపిణీ జరగాల్సి ఉంది. విభజన ప్రణాళికను ఆమోదించవద్దు 9వ షెడ్యూలు సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీకి కేంద్రం షీలాబీడే కమిటీని నియమించింది. దాదాపు 60 సంస్థలకుపైగా విభజన వివాదాలన్నీ ఈ కమిటీ పరిధిలోనే పరిష్కారమయ్యాయి. ఏపీఎస్ఎఫ్సీ ఈ కమిటీని బేఖాతరు చేసింది. తమ కార్పొరేషన్ సెక్షన్ 70 ప్రకారం కమిటీ ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పింది. నేరుగా తమ విభజన వ్యవహారాన్ని కేంద్రానికి పంపిస్తామని, పాలక మండలి సభ్యుల ఆమోదం ఉంటే సరిపోతుందని వాదనకు దిగింది. ఇవన్నీ పునర్విభజన చట్టం ఉల్లంఘనలేనని, ఏపీఎస్ఎఫ్సీ ఎండీ పంపించిన విభజన ప్రణాళికను ఆమోదించవద్దని, ఆమోదిస్తే తమకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం తాజాగా కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. -
ఏపీఎస్‌ఎఫ్‌సీకి భూ కేటాయింపులపై యథాతథ స్థితి
తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు ఆదేశం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కారుకు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం వద్ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఏపీఎస్ఎఫ్సీ)కు కేటాయించిన భూముల విషయంలో యథాతథ స్థితిని(స్టేటస్ కో) కొనసాగించాలని హైకోర్టు గురువారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ భూ కేటాయింపులను రద్దు చేయడంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2007లో ఏపీఎస్‌ఎఫ్‌సీకి గాజులరామారం వద్ద 271.39 ఎకరాలను కేటాయించింది. ఈ కేటాయింపులను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గత నెల 29న ఉత్తర్వులిచ్చింది. ఈ రద్దును సవాలు చేస్తూ ఏపీఎస్ఎఫ్సీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ వ్యాజ్యాన్ని గురువారం ధర్మాసనం విచారించింది. ఏపీఎస్ఎఫ్సీ తరఫున ఏపీ అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఈ కేటాయింపులను రద్దు చేసే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదన్నారు. అనంతరం తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. రూ.కోట్ల విలువైన భూమిని ఏపీఎస్ఎఫ్సీ పరిరక్షించడం లేదని, ఆ భూమిని కాపాడేందుకు కేటాయింపులను రద్దు చేశామని తెలిపారు. తెలంగాణ భూభాగంలో ఉన్న భూమిపై తమకు చట్ట ప్రకారం హక్కులున్నాయని పేర్కొన్నారు. గడువు ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు.