‘ప్రభుత్వం డబ్బులు పోయినా పర్వాలేదు!. ఇంటిదొంగలు మింగేస్తే మింగేయనీయండి!. వాటిని సురక్షితంగా ప్రభుత్వం దగ్గరే ఉంచితే మాత్రం... మేం ఊరుకోం’... అన్నట్టుంది ‘ఈనాడు’ తీరు. ఒక వంక ప్రభుత్వ సంస్థల్లో కొందరి కారణంగా కోట్ల రూపాయల డిపాజిట్లు పక్కదోవ పట్టిన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మరోపక్క గత ప్రభుత్వాలు కమీషన్లకు కక్కుర్తి పడి... ఫలానా బ్యాంకులోనే డిపాజిట్లు చేయండంటూ ఇచ్చిన ఆదేశాలు కూడా కొంప ముంచిన సందర్భాలున్నాయి. వీటన్నిటికీ చెక్‌పెడుతూ రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థిక శాఖ పరిధిలో వాటిని ప్రభుత్వం వద్దే ఉంచే ప్రయత్నాలు మొదలెట్టింది. పైపెచ్చు ఇలా ఉంచిన సొమ్ముకు మిగతా బ్యాంకులకన్నా ఎక్కువ వడ్డీనే ఆఫర్ చేస్తోంది. దీనివల్ల పారదర్శకతతో పాటు ప్రభుత్వ సొమ్ముకు భద్రతా పెరుగుతుంది.
ఆర్థికశాఖ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది కనక మెరుగైన రాబడీ వస్తుంది. కానీ ‘ఈనాడు’కు మాత్రం ఇది నచ్చడం లేదు. అంతే!!... ప్రభుత్వ నిర్ణయానికి వక్రభాష్యం చెబుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించేలా ఓ ఊహాజనిత కథనాన్ని వండేసింది. ‘డిపాజిట్ల మళ్లింపు’ శీర్షికతో సోమవారం మొదటి పేజీలో అచ్చేసింది కూడా. మిగులు నిధుల్ని ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు మళ్లించాలని ఆదేశించినా కొన్ని సంస్థలు వినలేదని, దీంతో ఈ ఉత్తర్వులిచ్చారని పేర్కొంటూ ‘ఈనాడు’ వండి వార్చిన ఈ కథనంలో నిజమెంత? ఏది నిజం? ఒకసారి చూద్దాం...
రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రూ.9.6 కోట్లను అధికారులు కాజేశారు. ఓ ప్రైవేటు బ్యాంకులో ఖాతా తెరిచి... అందులోకి మళ్లించి... అక్కడి నుంచి డ్రా చేసుకుని మింగేశారు. అదే తరహాలో ఏపీ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ డిపాజిట్ చేసిన రూ.5 కోట్లను కూడా ఇంటిదొంగలు కాజేశారు. పాలకవర్గానికి తెలియకుండా నకిలీ ఎఫ్‌డీ రసీదులతో వాటిని సొంత ఖాతాలకు మళ్లించేసుకున్నారు. ఇలాంటి సంఘటనలను గతంలో పలు సార్లు ‘కాగ్’ నివేదికలు కూడా బయటపెట్టాయి. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ రంగ సంస్థలు ఇష్టానుసారం బ్యాంకు ఖాతాలు తెరిచి, నిధులు వెచ్చిస్తున్నాయి.. భారీగా అక్రమాలకూ పాల్పడుతున్నాయి’ అని పలుమార్లు కాగ్ నివేదికలు తప్పుబట్టాయి.
ఇదిగో... ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాధనం దుర్వినియోగమయిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ... ఇకపై అలా కాకుండా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు తమ మిగులు నిధులను ‘ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్’లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. నిజానికి ప్రభుత్వ రంగ సంస్థల నిధులు వినియోగంపై ఎన్నో ఏళ్లుగా సరైన పర్యవేక్షక వ్యవస్థ లేదు. ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పలుమార్లు అప్పటి ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చింది కూడా!. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో సరైన ఆర్థిక నిపుణులు గానీ తగినంత మంది సిబ్బంది గానీ ఉండరు. ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుభవం ఉండదు.
నిధుల డిపాజిట్, విత్‌డ్రాలపై సరైన పర్యవేక్షణ ఉండదు. పై అధికారి ఓకే చేస్తే ఏమైనా చేయొచ్చని గతంలో ఎన్నో ఉదంతాలు నిరూపించాయి. గతంలో పలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు, కొన్ని జిల్లాల్లో డీసీసీబీల నిధులు దుర్వినియోగమైన ఉదంతాలూ బయటపడ్డాయి. తాజాగా తెలంగాణలో తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ వ్యవహారం సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థల మిగులు నిధులన్నీ ‘ఏపీఎస్‌ఎఫ్‌సీ’ ఖాతాలో డిపాజిట్ చేస్తే.. ఏకీకృత వ్యవస్థ ద్వారా పటిష్టంగా పర్యవేక్షించవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. అక్కడ ఆర్థిక నిపుణులూ ఉంటారు కనక మెరుగైన నిర్వహణ సాధ్యం. తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ సంస్థలు మినహా మిగతా శాఖలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, సొసైటీలు, బోర్డులు, ట్రస్టులు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నూరు శాతం యాజమాన్య సంస్థ అయిన ఏపీఎస్‌ఎఫ్‌సీకి జమ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదేమీ ప్రయివేటు బ్యాంకు కాదు కదా?
ప్రభుత్వ రంగ సంస్థల మిగులు నిధులను ప్రభుత్వ సంస్థే అయిన ‘ఏపీఎస్‌ఎఫ్‌సీ’కి మళ్లిస్తే ‘ఈనాడు’ ఇంతలా ఎందుకు గుండెలు బాదుకుంటోందన్నది ఎవ్వరికీ అర్థం కాదు. ఇదేమైనా ప్రయివేటు బ్యాంకో, ఎన్‌బీఎఫ్‌సీనో అయితే ‘ఈనాడు’ అభ్యంతరం చెప్పినా అర్థం ఉండేదన్నది నిపుణుల మాట. నిజానికి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను ప్రైవేటు రంగంలోకి ‘యాక్సిస్ బ్యాంకు’లో డిపాజిట్ చేయాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై అప్పట్లో ఆర్థిక నిపుణులు అభ్యంతరాలు వ్యక్తంచేసినా పట్టించుకోలేదు. చంద్రబాబు ఒత్తిడితో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపినా.. ‘ఈనాడు’కు మాత్రం అదేమీ తప్పుగా అనిపించలేదు. శ్రీవారి భక్తుల విరాళాలకు ముప్పు ఉంటుందన్న ఆలోచనే కనిపించలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. ఆ నిధులన్నిటినీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయించింది. అదీ ప్రజాధనం పట్ల వై.ఎస్.జగన్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత.
‘ఈనాడు’ సొమ్ములు పోయాయా? ఏది నిజం?
Published Tue, Nov 30 2021 3:10 AM | Last Updated on Tue, Nov 30 2021 12:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment