ముదిరిన ఏపీఎస్‌ఎఫ్‌సీ విభజన
• రూ.500 కోట్ల విలువైన భూములకు ఎసరుపెట్టిన ఏపీ
• సమాచారం ఇవ్వకుండా విభజన ప్రణాళిక కేంద్రానికి పంపిన వైనం
• ఏకపక్ష బోర్డు తీర్మానం చెల్లదంటూ తెలంగాణ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వైఖరితో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనలో తెలంగాణకు భారీగా నష్టం వాటిల్లే పరిస్థితి తలెత్తింది. సమాచారం ఇవ్వకుండా విభజన చేయమని నమ్మబలికి, చెప్పాపెట్టకుండా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని రూ.కోట్ల విలువైన భూములకు ఏపీ సర్కార్ ఎసరు పెట్టింది. దీంతో రంగారెడ్డి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌సీ) కేటాయించిన రూ.500 కోట్ల విలువైన తెలంగాణ భూములు చిక్కుల్లో పడ్డాయి. వాస్తవానికి విభజన చట్టం సెక్షన్ 53 ప్రకారం షెడ్యూల్ 9లోని సంస్థలకు సంబంధించిన ఆస్తులు ప్రధాన కార్యాలయం ఉన్నచోటనే పంచుకోవాలి. అయితే ప్రధాన కార్యాలయాన్ని నిర్వచించే అంశం కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉంది.
పైగా ఏపీఎస్‌ఎఫ్‌సీ ప్రధాన కార్యాలయం రంగారెడ్డి జిల్లాలో లేదు. వీటితోపాటు ఏపీఎస్‌ఎఫ్‌సీ అధీనంలో ఉన్న రూ.కోట్ల డబ్బు పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. తమకున్న ఆస్తుల్లో ఎక్కువ వాటా ఏపీఎస్‌ఎఫ్‌సీకి దక్కేలా.. నామమాత్రంగా తెలంగాణ కార్పొరేషన్‌కు దక్కేలా సంస్థ విభజన పూర్తి చేసేందుకు గుట్టుచప్పుడు కాకుండా పావులు కదిలాయి. తెలంగాణ ప్రభుత్వానికి కనీస ప్రాధాన్యం ఇవ్వకుండా ఏపీఎస్‌ఎఫ్‌సీ బోర్డు ఏకపక్షంగా విభజన ప్రణాళికను ఆమోదించి కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. ఆలస్యంగా తేరుకున్న తెలంగాణ ప్రభుత్వం బ్యాంకుల్లో ఈ సంస్థ లావాదేవీలను నిలిపివేయాలని, తమకు తెలియకుండా డబ్బులు డ్రా కాకుండా చూడాలని బ్యాంకర్లకు లేఖలు రాసింది. మరోవైపు ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించేలా చేపట్టిన చర్యలన్నీ వెనక్కి తీసుకోవాలని, ఏపీఎస్‌ఎఫ్‌సీ పంపించిన విభజన ప్రణాళికను ఆమోదించవద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఏపీఎస్‌ఎఫ్‌సీ విభజన వ్యవహారం ముదిరి పాకానపడింది.
మూడేళ్లయినా..
విభజన జరిగి మూడేళ్లు కావస్తున్నా ఏపీఎస్‌ఎఫ్‌సీ విభజన వివాదం ఇప్పటికీ సమసి పోలేదు. గుట్టు చప్పుడు కాకుండా గతేడాది జనవరిలోనే ఏపీఎస్‌ఎఫ్‌సీ విభజన తతంగం నడిపింది. బోర్డు సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇది గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ సందర్భంగా అనుసరించిన తీరును తప్పు బట్టింది. తమకు సమాచారం లేకుండా తమ ప్రమేయం లేకుండా విభజన ప్రణాళిక రూపొందించటంపై విస్మయం వ్యక్తం చేసింది. ఏపీఎస్‌ఎఫ్‌సీ బోర్డులో ఏపీకి సమానంగా తెలంగాణకు ప్రాతినిథ్యం లేదు. రెండు రాష్ట్రాలకు సరైన సంఖ్యలో సభ్యులుండేలా బోర్డును పునర్నియామకం చేయాలని, తర్వాతే విభజన చేపట్టాలని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ఈలోగా విభజన ప్రణాళికను తయారు చేయటాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుపట్టింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీఎస్‌ఎఫ్‌సీ తొమ్మిదో షెడ్యూలులో ఉంది. అందుకే చట్ట ప్రకారం ఆస్తులు, అప్పుల పంపిణీ జరగాల్సి ఉంది.
విభజన ప్రణాళికను ఆమోదించవద్దు
9వ షెడ్యూలు సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీకి కేంద్రం షీలాబీడే కమిటీని నియమించింది. దాదాపు 60 సంస్థలకుపైగా విభజన వివాదాలన్నీ ఈ కమిటీ పరిధిలోనే పరిష్కారమయ్యాయి. ఏపీఎస్‌ఎఫ్‌సీ ఈ కమిటీని బేఖాతరు చేసింది. తమ కార్పొరేషన్ సెక్షన్ 70 ప్రకారం కమిటీ ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పింది. నేరుగా తమ విభజన వ్యవహారాన్ని కేంద్రానికి పంపిస్తామని, పాలక మండలి సభ్యుల ఆమోదం ఉంటే సరిపోతుందని వాదనకు దిగింది. ఇవన్నీ పునర్విభజన చట్టం ఉల్లంఘనలేనని, ఏపీఎస్‌ఎఫ్‌సీ ఎండీ పంపించిన విభజన ప్రణాళికను ఆమోదించవద్దని, ఆమోదిస్తే తమకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం తాజాగా కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది.