హైవేలపై హైటెక్ రైతు బజార్లు
శ్రీకారం చుట్టిన మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరం.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో పాతూరు గ్రామం.. గ్రామం మీదుగా రాజీవ్ జాతీయ రహదారి.. కొన్నేళ్లుగా అనేక మంది రైతులు, తాము పండించిన కూరగాయలు రహదారిపై విక్రయిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆ రహదారి గుండా సిద్దిపేట, కరీంనగర్ సహా పలు ప్రాంతాలకు వెళ్లే వందలాది మంది ప్రజలు అక్కడ కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. తాజా కూరగాయలు కావడంతో క్రమక్రమంగా విక్రయాలు పెరిగాయి. వినియోగదారుల తాకిడి ఎక్కువైంది. కానీ కనీస వసతుల్లేక.. ఎండనక, వాననక కూరగాయలు విక్రయించడం రైతులకు కష్టంగా మారింది.
ఆ మార్గంలోనే నిత్యం తన జిల్లాకు వెళ్లొచ్చే మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు.. రైతుల కష్టాలు కళ్లారా చూశారు. వెంటనే రహదారిపై పాతూరు వద్ద హైటెక్ రైతు బజారుకు తెరలేపారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా రూ. కోటికిపైగా ఖర్చు చేసి అన్ని వసతులతో రైతు బజారు ఏర్పాటు చేసి జూలై 26న ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులపై కూరగాయలు విక్రయించే కేంద్రాలుంటే గుర్తించాలని, అవసరమైన చోట్ల హైటెక్ రైతు బజార్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
రెండెకరాల్లో.. 100 స్టాళ్లతో..
పాతూరు హైటెక్ రైతు బజారును రెండెకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. ఆధునిక విద్యుత్ లైట్లు, సులభ్ కాంప్లెక్స్, క్యాంటీన్, రూ.15 లక్షలతో మంచినీటి సౌకర్యం కల్పించారు. అంతేకాదు.. వినియోగదారుల కోసం కారు పార్కింగ్, పిల్లలు ఆడుకోడానికి పార్కునూ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ రైతుల కోసం దాదాపు 100 స్టాళ్లు ఏర్పాటు చేశారు. పాతూరు, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, మత్రాజపల్లి, పాములపర్తి, లింగరాజపల్లి గ్రామాల రైతులు అక్కడ కూరగాయలు విక్రయిస్తున్నారు. అప్పటికప్పుడే చేలల్లో కోసి కూరగాయలు విక్రయిస్తుండటంతో వినియోగదారుల తాకిడి పెరిగింది. రోజూ 1,000 మందికి పైగా కూరగాయలు కొనుగోలు చేసేందుకు వస్తున్నారు.
నెల రోజుల్లో రూ.కోటి వ్యాపారం
మార్కెట్ విశేషాలను మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు పీఎస్ అశోక్‌రెడ్డి ఫేస్‌బుక్ ద్వారా తెలియజేయడంతో ఒక్క రోజులోనే 30 వేల లైకులొచ్చాయి. దేశవిదేశాల్లోని తెలంగాణ పౌరులు మంత్రి కృషిని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారని అశోక్ చెబుతున్నారు. ప్రస్తుత రైతు బజార్ల స్థానంలో ఇలాంటి హైటెక్ రైతు బజార్లు ఏర్పాటు చేయాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి. రైతు బజారు మొదలై నెల రోజులయిందని, దాదాపు రూ. కోటి వ్యాపారం జరిగిందని అంచనా వేశారు.
ఆధునిక హంగులతో..
రాజీవ్ జాతీయ రహదారిపై కొన్నేళ్లుగా రైతులు తాజా కూరగాయలు అమ్ముతున్నారు. కానీ కనీస వసతులు లేక వారంతా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గమనించిన మంత్రి హరీశ్‌రావు.. ఆధునిక హంగులతో రైతు బజారు ఏర్పాటు చేశారు. దీంతో వినియోగదారుల తాకిడి మరింత పెరిగింది. సౌకర్యంగా ఉండటంతో రైతులూ మంచి వ్యాపారం చేసుకుంటున్నారు.
-బి.వి.రాహుల్, కార్యదర్శి, పాతూరు రైతు బజారు