నిందితునిగా ఉన్న వ్యక్తి వీసీగా ఉండకూడదని ఎక్కడుంది..?
పిటిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఓ కేసులో మొదట నిందితునిగా ఉన్న వ్యక్తి వీసీగా బాధ్యతలు చేపట్టకూడదని ఏ చట్టంలో ఉందో చూపాలని వేముల రోహిత్ ఆత్మహత్యోదంతం నేపథ్యంలో హెచ్‌సీయూ వీసీగా అప్పారావు కొనసాగింపు వ్యవహారంలో దాఖలైన కేసులో పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో తగిన అధ్యయనం చేసి రావాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా అప్పారావు తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అనుమతినివ్వడాన్ని సవాలు చేస్తూ, అప్పారావును హెచ్‌సీయూ నుంచి మరోచోటుకు బదిలీ చేయడంతో పాటు, బోధనా, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీ చేయకుండా హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ను ఆదేశించాలంటూ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.దీన్ని బుధవారం తాత్కాలిక సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదలను వినిపిస్తూ, హెచ్‌సీయూ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి నమోదైన కేసులో వీసీ అప్పారావు మొదటి నిందితునిగా ఉన్నారని తెలిపారు.
సంబంధిత ఎఫ్‌ఐఆర్‌ను ఆయన ధర్మాసనం ముందుంచారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం, ఓ కేసులో మొదట నిందితునిగా ఉన్న వ్యక్తి వీసీగా కొనసాగరాదని ఏ చట్టంలో ఉందో చూపాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. భావోద్వేగాల ఆధారంగా అధికరణ 226 కింద కేసులను విచారించడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ‘మీరు అప్పారావును తొలగించాలని కోరుతున్నారు.. మేం చట్టం గురించి అడుగుతున్నాం’...అంటూ పిటిషనర్‌ను ఉద్దేశించి పేర్కొంది. ఈ కేసును పూర్తిగా అధ్యయనం చేసి రావాలని సూచించిన ధర్మాసనం, ఈ కేసులో తామెవ్వరికీ నోటీసులు జారీ చేయడం లేదంది.