
పాడి రైతులకూ ఉచిత విద్యుత్
♦ పరిశీలిస్తున్నామన్న పోచారం
♦ హైటెక్స్‌లో పాడి ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో రైతులకు ఇస్తున్నట్లే పాడి రైతులకు కూడా ఉచిత విద్యుత్, వడ్డీపై రాయితీ ఇచ్చే అంశాన్ని సర్కారు పరిశీలిస్తోందని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. వాణిజ్య ప్రయోజనా లు లేకపోతే తప్పకుండా చిన్న, సన్నకారు రైతులకు ఈ ప్రయోజనాలు కల్పించే అంశాలను పరిశీలిస్తామన్నారు. పశుసంవర్థకశాఖ, అభ్యుదయ పాడి రైతు సంఘం, యాక్టివ్ సంస్థల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే పాడి ప్రదర్శన ను వ్యవసాయ మంత్రి పోచారం శనివారమిక్కడి హైటెక్స్‌లో ప్రారంభించారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపుతున్న పాడిరంగంపై లక్షలాది మంది రైతు కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. ఆహార భద్రత, పౌష్టికాహార భద్రతను దృష్టిలో పెట్టుకొని పాడి రైతులు, యువతను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం కల్పించేది పాడి రంగమేనన్నారు. ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రూ. 25 వేల కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో నిర్ణయించామన్నారు.
వ్యవసాయ అనుబంధ పాడి, ఇతర రంగాలకు మరో రూ. 7 వేల కోట్లు పంపిణీ చేయాలని బ్యాంకర్లకు సూచించామన్నారు. ఉప ముఖ్యమంత్రి మహ మూద్‌అలీ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ప్రపంచస్థాయి పాడి విజ్ఞానం, విత్తనాలు, పశుగ్రాసాలు, పరి శ్రమలు, యంత్రాలు, పరిశోధన, కొత్త ఆవిష్కరణలు, పాల పదార్థాల తయారీ, మేలుజాతి పశువులతో ప్రదర్శన జరుగుతోంది.