1 నుంచి గ్రామ రైతు సంఘాలు | Village farmers communities from september 1 | Sakshi
Sakshi News home page

1 నుంచి గ్రామ రైతు సంఘాలు

Published Mon, Aug 28 2017 1:41 AM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM

1 నుంచి గ్రామ రైతు సంఘాలు - Sakshi

1 నుంచి గ్రామ రైతు సంఘాలు

ఉద్యాన మహోత్సవం–2017 ప్రారంభంలో పోచారం 
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 10,800 రెవెన్యూ గ్రామాలను 3,600 యూనిట్లుగా విభజించి సెప్టెంబర్‌ ఒకటి నుంచి 9వ తేదీ వరకు గ్రామ రైతు సమన్వయ సంఘాలు ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 10 నుంచి 14 వరకు మండల రైతు సమన్వయ సంఘాలు.. అలాగే జిల్లా, రాష్ట్ర సమన్వయ సంఘాలూ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 15 వరకు భూ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేపట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో ‘తెలంగాణ ఉద్యాన మహోత్సవం 2017‘ను ఆదివారం మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు అప్పుల బారినుంచి బయటపడి ఆత్మహత్యల్లేని తెలంగాణ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని.. రైతు సమగ్ర సర్వే వివరాల ఆధారంగా 2018, మే 15 నాటికి ఎకరాకు రూ. 4 వేల నగదును రైతుల ఖాతాల్లోకి బదిలీ చేస్తామని పేర్కొన్నారు. ఉద్యాన రైతులకూ నగదు సాయం చేస్తామని వివరించారు. అవసరమైన కూరగాయలను ఇంట్లోనే పండించుకోవాలని ప్రజలకు మంత్రి సూచించారు.

ఇళ్ళలో కూరగాయలు పండించేందుకు అధునాతన, సాంకేతిక పద్ధతులను ఉద్యాన శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఉద్యాన పంటలతోనే రైతులు అధిక ఆదాయం పొందుతారని, 50 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే వచ్చే లాభానికన్నా 15 లక్షల ఎకరాల్లో పండించే ఉద్యాన పంటల ఆదాయం ఎక్కువని మంత్రి విశ్లేషించారు. అందుకే ప్రభుత్వం భారీ రాయితీలు కల్పించి ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. కాగా, ఉద్యాన మహోత్సవం ఈ నెల 31 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు తమ ఉత్పత్తులతో కూడిన స్టాళ్లను ఏర్పాటు చేశాయి.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement