హోంగార్డుల ఆందోళన: గాంధీ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: హోంగార్డుల ఆందోళనలతో గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీక్ష చేపట్టిన హోంగార్డులను మంగళవారం వేకువజామున పోలీసులు బలవంతంగా గాంధీ ఆస్పత్రికి తరలించిన విషయం విదితమే. అయితే, వారు ఆందోళనను విరమించలేదు. డిమాండ్లు సాధించేదాకా దీక్షలు కొనసాగిస్తామని చెప్పారు. మధ్యాహ్నం సమయంలో ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. అక్కడికి మిగతా హోంగార్డులు కూడా పెద్ద సంఖ్యలో తరలిరావటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడికి చేరుకున్న నార్త్‌జోన్ డీసీపీ, టాస్క్‌ఫోర్స్ డీసీపీలను చుట్టుముట్టి, వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
తమ డిమాండ్లు పరిష్కరించకపోతే కిందికి దూకుతామని ముగ్గురు హోమ్‌గార్డులు గాంధీ ఆస్పత్రి ప్రదాన భవనంపైకి ఎక్కారు. ప్రభుత్వం తమ డిమాండ్లు ఆమోదించకపోతే కిందికి దూకేస్తామని వారు బెదిరిస్తున్నారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. హోమ్‌గార్డు సంఘాలకు చెందిన ప్రతినిధులు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారని, ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదిస్తే కిందికి దిగుతామని లేకపోతే దూకేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. పోలీసులు పైకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారు డాబా తలుపు వేసి గడియపెట్టుకున్నారు. ముగ్గురు హోంగార్డులు గాంధీ ఆస్పత్రి పైకి ఎక్కడంతో ఆస్పత్రి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.