'ఎమ్మెల్యేగా పోటీ చేసిన హోంగార్డే కారణం'
'ఎమ్మెల్యేగా పోటీ చేసిన హోంగార్డే కారణం'
Published Tue, Oct 25 2016 4:26 PM | Last Updated on Sun, Sep 2 2018 3:08 PM
హైదరాబాద్: వలంటరీగా సేవలందిస్తున్న హోంగార్డులను పర్మినెంట్ చేసే విషయమై సీఎం కేసీఆర్ సానుకూలంగానే ఉన్నారని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజాలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నకు పైవిధంగా బదులిచ్చారు. హోంగార్డుల వేతనాన్ని రూ. తొమ్మిది వేల నుంచి 12 వేలకు పెంచడంతో పాటు వారికి డ్రెస్సులు, బస్సుపాస్‌లను కూడా ప్రభుత్వమే అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. హోంగార్డులకు ప్రమాదం సంభవిస్తే రూ. 5 లక్షల పరిహారమే అందేలా ఇన్సూరెన్స్ కవరేజీ వర్తింపచేశామని తెలిపారు.
గతంలో హోంగార్డుగా పనిచేసి డిస్మిస్ అయి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీచేసిన ఓ హోంగార్డు ఆందోళనకు దిగి అనవసర రాద్దాంతం చేసి పత్రికల్లో వార్తల్లో వ్యక్తిగా నిలవాలనుకుంటున్నాడని అన్నారు. అందరూ హోంగార్డులు సంతోషంగానే ఉన్నారని, ఎవరి విధులు వారు సక్రమంగానే నిర్వర్తిస్తున్నారని హోంమంత్రి వివరించారు. సరైన సమయం వచ్చినప్పుడు హోంగార్డులను పర్మినెంట్ చేసేందుకు సీఎం కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు.
Advertisement