రాష్ట్రపతి నిలయానికి భారీ బందోబస్తు
బొల్లారం, న్యూస్‌లైన్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తొలిసారిగా హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఆయన ప్రత్యేక విమానం ల్యాండ్ కానుంది. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు తరలి రానున్నారు. గురువారం సాయంత్రం 5.15 గంటలకు రాష్ట్రపతి విమానం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో దిగనుంది.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆయనను తీసుకువచ్చే వాహనాలతో బుధవారం మధ్యాహ్నం రూటు రిహార్సల్‌ను అధికారులు నిర్వహించారు. రాష్ట్రపతి నిలయం నుంచి ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి రాష్ట్రపతి నిలయం వరకు కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. హైదరబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ, అడిషనల్ కమిషనర్ అంజనికుమార్, ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అమిత్‌గార్గ్, సంయుక్త కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) బి.మల్లారెడ్డి డీసీపీ జయలక్ష్మి, ఇతర పోలీసు, ఆర్మీ ఉన్నతాధికారులు బందోబస్తుతో పాటు ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ప్రణాళికలు రూపొందించారు. ఉన్నతాధికారుల కాకుండా 750 మంది సిబ్బందిని రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో మోహరించారు. ఆర్మీ, పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు స్పెషల్ బ్రాంచి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.
నేడు ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్రపతి గురువారం హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం 5.15 గంటలకు హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఆయన ప్రత్యేక విమానం దిగనుంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ కింద తెలిపిన ప్రాంతాల మీదుగా ప్రయాణించే వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకోవాలని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అమిత్‌గార్గ్ కోరారు.
ఆంక్షలున్న ప్రాంతాలివే: ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ‘వై’ జంక్షన్-ఎయిర్‌ఫోర్స్ బెటాలియన్ 2,3 గేట్లు-బొల్లారం చెక్‌పోస్ట్-సహేజ్ ద్వార్-ఈఎంఈ సెంటర్ వద్ద ఉన్న జేసీఓ మెస్, ఫస్ట్ బెటాలియన్-పంప్ హౌస్-బిసిన్ ఎన్వైర్‌మెంట్ పార్క్-బిసిన్ హెడ్ క్వార్టర్స్ మెయిన్ గేట్- యాప్రాల్-బిసిన్ బేకరీ ఎక్స్‌టెన్షన్- నేవీహౌస్ జంక్షన్- ఆంధ్రా సబ్-ఏరియా ఆఫీసర్స్ మెస్- ఆర్‌ఎస్సై జంక్షన్- ఈఎంఈ సెంటర్ హౌస్-గేట్ నెం.3, 2, 1- రాష్ట్రపతి నిలయం మెయిన్‌గేట్.