- ఏప్రిల్ 8న ఇంటింటా ఉగాది-ఇంటికి పునాది’
- గృహ నిర్మాణ శాఖ అధికారుల సమీక్షలో సీఎం
సాక్షి, హైదరాబాద్‌ః ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణంలో అవసరమైతే ప్రైవేట్ నిర్మాణదారులకు భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి గృహ నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లు ఎలా ఉండాలనే అంశంపై మంత్రుల బృందంతో చర్చించి వెంటనే ఒక స్పష్టతకు రావాలని ఆధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఆర్కిటెక్టులు, బిల్డర్లు, విశ్వవిద్యాలయాల్లో నిర్మాణరంగ విద్యనభ్యసించే విద్యార్థుల భాగస్వామ్యంతో టౌన్‌షిప్పుల నిర్మాణాలు జరగాలన్నారు. రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇతర మౌళిక సదుపాయాలతో కూడిన గృహ నిర్మాణానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టబోయే గృహ నిర్మాణాలు రానున్న కాలంలో అక్కడ ఆర్థిక కార్యకలాపాలను పెంచే రీతిలో ఉండాలన్నారు. పట్టణ, గ్రామీణ గృహ నిర్మాణాలే కాకుండా ఇండస్ట్రియల్ టౌన్‌షిప్స్ కూడా పెద్ద ఎత్తున చేపట్టబోతున్నట్లు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకం కింద రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు నిర్మించే అవకాశం ఉందో అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణాల్లో పారదర్శకత అత్యంత ప్రాధాన్యమైన అంశమని, ఎక్కడా అవకతవకలు జరగకుండా ప్రతి దశలోనూ సాంకేతిక పద్ధతుల్ని అనుసరించాలని ఆదేశించారు. జియో ట్యాగింగ్ చేయడమే కాకుండా నిర్మాణంలోని ప్రతి దశను త్రీడీ పద్ధతిలో సంబంధిత వీడియో చిత్రీకరించి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలన్నారు. ఏప్రిల్ 8న ఇంటింటా ఉగాది-ఇంటికి పునాది కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. సమీక్షా సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి మృణాళిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ టక్కర్, గృహనిర్మాణ సంస్థ అధ్యక్షుడు వర్ల రామయ్య, ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్, ముఖ్యమంత్రి కార్యదర్శి సాయి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి రాజమౌళి, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు పాల్గొన్నారు.
ప్రైవేట్ భాగస్వామ్యంతో గృహ నిర్మాణాలు
Published Thu, Mar 24 2016 10:52 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM
Advertisement
Advertisement