private partnership
-
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మధ్య ఆదాయ వర్గాలు (ఎంఐజీ) కోరుకునే ఇంటి నిర్మాణం కోసం అవసరమైన ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లను పూర్తి ప్రభుత్వ హామీతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. వాటిని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. స్మార్ట్ టౌన్‌షిప్‌ల అభివృద్ధి మార్గదర్శకాలు, పాటించాల్సిన నిబంధనలపై చర్చించేందుకు శనివారం సీఆర్డీఏ కార్యాలయంలో రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌తో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్ అలీంబాషా, డెవెలప్మెంట్ ప్రమోషన్ డైరెక్టర్ ఎం.వెంకటసుబ్బయ్య, క్రెడాయ్ అధ్యక్షుడు కె.రాజేంద్ర, సభ్యులు, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నెరెడ్కో) సభ్యులు, వాటి పరిధిలోని రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో కమిషనర్ డెవలపర్స్ సందేహాలకు సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. సీఆర్డీఏ పరిధితో పాటు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో స్మార్ట్ టౌన్‌షిప్‌లను చేపట్టనున్నామని, ప్రాజెక్టు అమలుకు జిల్లా స్థాయి కమిటీ (డీఎల్సీ) నేతృత్వం వహిస్తుందని వివరిచారు. ప్రాజెక్టుకు 20 ఎకరాలు తప్పనిసరి డెవలపర్ సంస్థ కనీసం 20 ఎకరాల భూమిని లే అవుట్‌గా అభివృద్ధి చేయాలని, యజమాని పేరుతోనే భూమి ఉండాలని కమిషనర్ సూచించారు. లే అవుట్ అభివృద్ధికి ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం వేగంగా అన్ని అనుమతులు ఇస్తుందని వివరించారు. లే అవుట్లను మౌలిక సదుపాయాలతో సహా 150, 200, 240 గజాల విస్తీర్ణంలో మూడు రకాల ప్లాట్లను అభివృద్ధి చేయాలని, డెవలపర్ భూమి ఇచ్చినప్పటి నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అన్ని అభివృద్ధి పనులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందని కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. భూమి యజమానికి, ఎంఐజీల్లో ప్లాట్లు కొనుగోలు చేసేవారికి వారధిగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందన్నారు. ఈ నెల 20 నుంచి ఎంఐజీ లే అవుట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, డెవలపర్స్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా డెవలప్స్ అడిగిన సందేహాలను వివేక్ యాదవ్‌తో పాటు, ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్సెట్ మేనేజ్మెంట్కు చెందిన డొమైన్ ప్రాజెక్ట్ మేనేజర్ సిద్ధార్థ నివృత్తి చేశారు. అలాగే సీఆర్డీఏ ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని పాయకాపురం, తెనాలిలోని చెంచుపేట, మంగళగిరి, ఇబ్రహీంపట్నంలోని ట్రక్ టెర్మినల్ ప్రాంతాల్లో ప్లాట్లను ఈ–వేలం ద్వారా అమ్మకానికి ఉంచామని, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తోడ్పాటునందించాలని కోరారు. ఎంఐజీ నిబంధనలు ఇవీ.. ► రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 88లోని నిబంధనలకు అనుగుణంగా ఎంఐజీ లే అవుట్లు ఉండాలి ► లే అవుట్లో పట్టణాభివృద్ధి సంస్థ (యూడిఏ) వాటాగా 40 శాతం కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని ఎంఐజీ దరఖాస్తుదారులకు ఇచ్చేందుకు ప్రాజెక్టు అభివృద్ధి సంస్థ ముందుకొస్తే దాన్ని తిరస్కరణ లేదా అంగీకరించే అధికారం జిల్లాస్థాయి కమిటీకి ఉంటుంది ► దరఖాస్తుదారులకు అనువైన ప్రాంతంలో ఎలాంటి వ్యాజ్యాలు, తాకట్టులు లేని కనీసం 20 ఎకరాల భూమిలో మాత్రమే వీటిని ఏర్పాటు చేయాలి ► ఎంఐజీ ప్లాట్ల అనుమతులు, మార్కెట్ విలువ, అమ్మకం ధర వంటి అంశాలు ఎలా ఉండాలో జిల్లా కమిటీ సూచిస్తుంది. ► ప్రాజెక్టు ఏర్పాటు చేసే ఒక ప్రాంతం నుంచి ఒకటికి మించి దరఖాస్తులు వస్తే మార్గదర్శకాలకు అనుగుణంగా అభివృద్ధి సంస్థలను జిల్లా కమిటీ ఎంపిక చేస్తుంది ► ఎంఐజీ ప్లాట్ల అమ్మకపు ధర ఎప్పుడూ మార్కెట్ ధర కంటే కనీసం 10 నుంచి 20 శాతం తక్కువగా ఉండేలా కమిటీ చూడాలి ► లే అవుట్లలో అంతర్గత రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పార్కులు, ఫుట్‌పాత్ తదితర ముఖ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి ► ఎంఐజీలో ప్లాట్లు కావాలనుకునేవారు దరఖాస్తుతో పాటు ప్లాట్ ధరలో 10 శాతం, ఒప్పదం చేసుకునే సమయంలో మరో 10 శాతం, ప్రాజెక్టు పూర్తయ్యాక ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో మిగిలిన 80 శాతం మొత్తాన్ని చెల్లించాలి. -
అసమాన పెట్టుబడి కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: ఇటీవల చేపట్టిన కార్మిక, వ్యవసాయ సంస్కరణలు భారత్‌లో వ్యాపారం చేయడాన్ని మరింత సులభతరం చేస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మార్కెట్‌ను ఎంచుకోవడానికి రైతులకు హక్కు కల్పిస్తోందని, అలాగే ఎగుమతులు పెరిగేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. ఇన్వెస్ట్ ఇండియా–2020 సదస్సులో ఆయన వీడియో ద్వారా కీలకోపన్యాసం చేశారు. భారత్–కెనడా మధ్య వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. శక్తివంతమైన ప్రజాస్వామ్యం, రాజకీయ స్థిరత్వం, వ్యాపారానికి అనుకూలమైన విధానాలతో విదేశీ వ్యాపారులకు భారత్ అసమాన పెట్టుబడి కేంద్రంగా నిలిచిందని ప్రధాని అన్నారు. పెద్ద ఎత్తున సంస్కరణలు.. ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని మెరుగుపరిచేందుకే విద్య, వ్యవసాయం, కార్మిక వంటి ప్రధాన రంగాల్లో సంస్కరణలు చేపట్టామని మోదీ తెలిపారు. ‘కార్మిక చట్టాల సంస్మరణలతో లేబర్ కోడ్స్ తగ్గుతాయి. ఇవి సంస్థలకు, ఉద్యోగులకు స్నేహపూర్వకంగా ఉంటాయి. అలాగే ఆత్మనిర్భర భారత్ నిర్మాణానికి దోహదం చేస్తాయి. విద్యా రంగంలో సంస్కరణలతో యువత నైపుణ్యం మెరుగవుతుంది. విదేశీ యూనివర్సిటీలు భారత్‌కు వస్తాయి. విద్య, తయారీ, సేవలు, వ్యవసాయ రంగాల్లో భాగస్వామ్యం, పెట్టుబడి, సహకారానికి భారత్ సరైన వేదిక’ అని వివరించారు. అవకాశాలను అందుకున్నాయి.. మౌలిక రంగ పెట్టుబడిలో ఉన్న పెద్ద సంస్థలకు కెనడా కేంద్రంగా ఉందని ప్రధాని గుర్తు చేశారు. ‘కెనడాకు చెందిన పెన్షన్ ఫండ్స్ తొలుత ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. హైవేస్, ఎయిర్‌పోర్టులు, లాజిస్టిక్స్ రంగాల్లో కెనడా సంస్థలు ఇక్కడి అవకాశాలను అందుకున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ నేడు బలంగా ఉంది. రేపు మరింత శక్తివంతమవుతుంది. ఎయిర్‌పోర్టులు, రైల్వేలు, హైవేలు, పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్‌లో ప్రైవేటు పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నాం. ఎఫ్‌డీఐ విధానాలను సరళీకరించాం. సార్వభౌమ సంపద, పెన్షన్ ఫండ్స్ విషయంలో స్నేహపూర్వక పన్నుల విధానం అనుసరిస్తున్నాం. కోవిడ్–19 నేపథ్యంలో ప్రత్యేక విధానాన్ని అమలుచేశాం. పేదలు, చిన్న వ్యాపారుల కోసం ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చాం. నిర్మాణాత్మక సంస్కరణలకు దీనిని అవకాశంగా తీసుకున్నాం’ అని చెప్పారు. ఔషధ కేంద్రంగా భారత్.. ప్రపంచానికి ఔషధ కేంద్రంగా భారత్ నిలిచిందని నరేంద్ర మోదీ తెలిపారు. ‘150కిపైగా దేశాలకు భారత్ మందులు అందించింది. 2019లో అంతర్జాతీయంగా ఎఫ్‌డీఐల రాక 1 శాతం తగ్గితే, భారత్ విషయంలో ఇది 20 శాతం వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్ పట్ల నమ్మకం కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనం. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 20 బిలియన్ డాలర్లకుపైగా ఎఫ్‌డీఐలను భారత్ స్వీకరించింది. అంతర్జాతీయంగా కోవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ ఇది సాధించాం’ అని వివరించారు. కాగా, భారత్‌లో విదేశీ పెట్టుబడుల్లో కెనడా 20వ స్థానంలో ఉంది. 600లకుపైగా కెనడా కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇవి 50 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు చేశాయి. -
ఆలోచన ఘనం.. నిర్మాణం శూన్యం!
సాక్షి, గుంటూరు: సుమారు 500 ఎకరాల రెవెన్యూ పోరంబోకు భూముల్లో సర్వే నిర్వహించి ఈ ప్రాజెక్టుకు స్థలాన్ని కేటాయించేందుకు రెవెన్యూశాఖ చర్యలు చేపట్టింది. అనంతరం వైఎస్సార్ అకాల మరణం, తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన కె.రోశయ్య మైసూరులోని బృందావన్ గార్డెన్స్, బెంగళూరులోని లాల్బాగ్ గార్డెన్ల తరహాలో ఇక్కడ అత్యాధునికంగా పార్కును అభివృద్ధి చేయాలని సంకల్పించారు. అప్పటి పర్యాటక శాఖ మంత్రి గీతారెడ్డి, పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి నూతన పర్యాటక విధాన ముసాయిదాను ఆమోదించారు. పర్యాటక అభివృద్ధితో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందిచాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఈ ప్రాజెక్టు భూములను అనేక సార్లు పర్యాటకశాఖ అధికారులు సందర్శించి హైదరాబాద్, ముంబాయి నగరాలకు చెందిన ఆర్కిటెక్చర్స్‌తో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. నిధుల విడుదలలో నెలకొన్న జాప్యంతో ప్రాజెక్టు నిలిచిపోయింది. టీడీపీలో రేటు మారింది మెగా టూరిజం ప్రాజెక్టుకు తెలుగుదేశం ప్రభుత్వం 2015లో 250 ఎకరాల స్థలాన్ని కేటాయించి దశల వారీగా మరికొంత స్థలంతో పాటు నిధులు మంజూరు చేసి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీనిచ్చింది. 2013లో టూరిజం శాఖ మెగా టూరిజం ప్రాజెక్టు స్థలాన్ని కేటాయించమని కోరినప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఎకరం 1.80లక్షల రూపాయలు ఉండగా ప్రస్తుతం ఎకరం 2.50లక్షల రూపాయలుగా పెరిగింది. చూసి వెళ్తున్నారు.. టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో మెగా టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి పర్చాలని భావించింది. ఈ నేపథ్యంలో 2015 డిసెంబర్ 29న ముంబాయి ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్‌చంద్ర తన సొంత హెలికాఫ్టర్‌లో మెగా టూరిజం ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి ఈ ప్రాంతం ఎంతో నచ్చిందని చెప్పటంతో ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ పడినట్లయ్యింది. 2017 ఫిబ్రవరిలో కూడా ఎస్ఎల్ గ్రూపు ప్రతినిధులు మరో సారి మెగాటూరిజం ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. ఇప్పటి వరకు వారు చూసి వెళ్లడమే కానీ ప్రాజెక్టు నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఎన్నెన్నో అందాలు.. విజయపురిసౌత్ పరిధిలో చూడచక్కని చారిత్రక ప్రదేశాలైన నాగార్జునకొండ, అనుపు, ఎత్తిపోతల జలపాతాలు పర్యాటకులను కనువిందు చేస్తాయి. దేశ, విదేశీ పర్యాటకులు కారులో ఇక్కడకి చేరుకోవాలంటే హైదరాబాద్ శంషాబాద్ విమానశ్రయం నుంచి కేవలం రెండున్నర గంటల సమయం పడుతుంది. ఇక్కడ ఇన్ని సౌకర్యాలతో పాటు కనువిందు చేసే ప్రకృతి అందాలకు తోడు మెగా టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి. మెగా టూరిజం ప్రాజెక్టులో చూడచక్కని అందాలతో ఎమ్యూజ్మెంట్ పార్కులు, సినిమా స్టూడియోలు, స్విమ్మింగ్‌పూల్స్, స్టార్ హోటళ్లు పర్యాటకులకు అందుబాటులోకి వస్తాయి. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతమైన విజయపురిసౌత్‌లో వందలాది ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. ఇక్కడ ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే సినీ పరిశ్రమకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో ఇచ్చిన హామీకి ఇప్పటి వరకు మోక్షం లభించలేదు. -
ప్రైవేటుతో కలసి ఉపగ్రహాలు
తొలిసారిగా చేతులు కలిపిన ఇస్రో బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. తొలిసారిగా ప్రైవేటు భాగస్వామ్యంతో భారత సమాచార వ్యవస్థకు సంబంధించి రెండు భారీ ఉపగ్రహాలను రూపొందిస్తోంది. ఈ మేరకు బెంగళూరుకు చెందిన అత్యాధునిక రక్షణ పరికరాలు సరఫరా చేసే ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రైవేటు రంగంలోని నిపుణుల బృందం... ప్రభుత్వ ఇంజనీర్లతో కలసి ఇందుకోసం శ్రమిస్తోంది. త్వరలోనే ఈ ఉపగ్రహాలు నింగిలోకి దూసుకుపోనున్నాయి. ఇస్రో పూర్తిస్థాయి సమాచార ఉపగ్రహాల తయారీకి తొలిసారి ప్రైవేటు పరిశ్రమతో చేతులు కలపడం విశేషం. శ్రమిస్తున్న 70 మంది ఇంజనీర్లు... ఈ ప్రాజెక్టులో భాగంగా 6 నెలల్లో ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు 70 మంది ఇంజనీర్లు శ్రమిస్తున్నారు. ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ చైర్మన్, ఎండీ కల్నల్ హెచ్ఎస్ శంకర్ నేతృత్వంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. నావిక్ (నావిగేషన్ విత్ ఇండియన్ కంస్టాలేషన్) వ్యవస్థకు సంబంధించి ఇప్పటికే ఏడు ఉపగ్రహాలు కక్ష్యలో ఉండగా, అత్యవసర పరిస్థితుల్లో స్టాండ్‌బైగా వీటిని రూపొందిస్తున్నారు. ఇందుకు రూ.400 కోట్లకు ఆల్ఫా డిజైన్‌తో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది. ‘కోట్ల రూపాయల విలువైన ఉపగ్రహాల తయారీ ఎంతో క్లిష్టమైనది. ఇవి అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాతా మరమ్మతులు రాకుండా ఏళ్లతరబడి పనిచేయాల్సి ఉంటుంది. దీంతో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం’ అని ఇస్రో బెంగళూరు ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్ ఎం.అన్నాదురై చెప్పారు. ‘నావిక్’ కింద తయారైన అన్ని ఉపగ్రహాలకూ 95 శాతానికి పైగా సిస్టమ్స్ బయటి పరిశ్రమ నుంచే అందుతున్నాయన్నారు. ‘మొదటగా ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(ఐఆర్ఎన్ఎస్ఎస్) ఉపగ్రహాన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో రూపొందిస్తాం. దాన్ని ఇస్రో నిపుణుల బృందం పరిశీలించి... రెండో ఉపగ్రహ తయారీని అప్పగిస్తుంది’ అని చెప్పారు. అత్యాధునిక అంతరిక్ష పార్కు బెంగళూరులో సిద్ధమైందని, ఇది అందుబాటులోకి వస్తే అన్నీ ఒకేచోట లభించే ఈ తరహా పార్కు ప్రపంచంలోనే తొలిదవుతుందన్నారు. -
ప్రైవేట్ భాగస్వామ్యంతో మెరుగైన సేవలు
నెల్లూరు రూరల్: ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. సింహపురి స్పెషాల్టీ ఆస్పత్రిలో శనివారం రాత్రి న్యూరో నావిగేషన్ పరికరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో సేవలు అందుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో గుంటూరులో ప్రయోగాత్మకంగా వైద్యసేవలందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, విజయవంతమైందని చెప్పారు. సింహపురి ఆస్పత్రి ఎండీ కాటంరెడ్డి రవీంద్రరెడ్డి, పీఏఓ నాగేంద్రప్రసాద్, వైద్యులు వెంకటేశ్వరప్రసన్న, భక్తవత్సలం, దీక్షాంతి నారాయణ్, గోపాలకృష్ణయ్య, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. పరామర్శ సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ నాయకుడు కందుకూరి సత్యనారాయణ కుటుంబసభ్యురాలిని మంత్రి కామినేని శ్రీనివాస్ పరామర్శించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, కందుకూరి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ భాగస్వామ్యంతో గృహ నిర్మాణాలు
- ఏప్రిల్ 8న ఇంటింటా ఉగాది-ఇంటికి పునాది’ - గృహ నిర్మాణ శాఖ అధికారుల సమీక్షలో సీఎం సాక్షి, హైదరాబాద్ః ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణంలో అవసరమైతే ప్రైవేట్ నిర్మాణదారులకు భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి గృహ నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లు ఎలా ఉండాలనే అంశంపై మంత్రుల బృందంతో చర్చించి వెంటనే ఒక స్పష్టతకు రావాలని ఆధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఆర్కిటెక్టులు, బిల్డర్లు, విశ్వవిద్యాలయాల్లో నిర్మాణరంగ విద్యనభ్యసించే విద్యార్థుల భాగస్వామ్యంతో టౌన్‌షిప్పుల నిర్మాణాలు జరగాలన్నారు. రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇతర మౌళిక సదుపాయాలతో కూడిన గృహ నిర్మాణానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టబోయే గృహ నిర్మాణాలు రానున్న కాలంలో అక్కడ ఆర్థిక కార్యకలాపాలను పెంచే రీతిలో ఉండాలన్నారు. పట్టణ, గ్రామీణ గృహ నిర్మాణాలే కాకుండా ఇండస్ట్రియల్ టౌన్‌షిప్స్ కూడా పెద్ద ఎత్తున చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకం కింద రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు నిర్మించే అవకాశం ఉందో అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణాల్లో పారదర్శకత అత్యంత ప్రాధాన్యమైన అంశమని, ఎక్కడా అవకతవకలు జరగకుండా ప్రతి దశలోనూ సాంకేతిక పద్ధతుల్ని అనుసరించాలని ఆదేశించారు. జియో ట్యాగింగ్ చేయడమే కాకుండా నిర్మాణంలోని ప్రతి దశను త్రీడీ పద్ధతిలో సంబంధిత వీడియో చిత్రీకరించి ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఏప్రిల్ 8న ఇంటింటా ఉగాది-ఇంటికి పునాది కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. సమీక్షా సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి మృణాళిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, గృహనిర్మాణ సంస్థ అధ్యక్షుడు వర్ల రామయ్య, ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్, ముఖ్యమంత్రి కార్యదర్శి సాయి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి రాజమౌళి, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు పాల్గొన్నారు. -
తెలంగాణకు తీరని అన్యాయం
* ప్రజలను నిరాశపరిచిన బడ్జెట్ * సంపన్నులు, బహుళజాతికి ప్రాధాన్యం * కేంద్ర బడ్జెట్‌పై ఎంపీలు, చార్టర్‌డ అకౌంటెంట్ల అసంతృప్తి సంపన్నుల, బహుళజాతి బడ్జెట్... ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలిచ్చిన నరేంద్రమోడీ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. అందరికీ అన్ని ఇస్తామని భ్రమింపజేసిన ఆయన.. చివరికి ఏదీ లేదని నిరూపించారు. పేదల పట్ల వారికున్న వైఖరి, సంక్షేమంపై ఉన్న వ్యతిరేకతను ఈ బడ్జెట్లో నిరూపించారు. కేవలం సంపన్నులు, బహుళజాతి సంస్థలకు ఉపకరించే ప్రణాళికలను మాత్రమే బడ్జెట్లో ఆవిష్కరించారు. అన్నింటా ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో విదేశీ నిధుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు యత్నిస్తున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలపై విదేశీ పెత్తనం పెరిగే ప్రమాదాన్ని ఈబడ్జెట్ తెలియజేస్తోంది. ఇక కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఇచ్చిన ప్రాజెక్టు ఒక్కటీ లేదు. మోడీ గతంలో చెప్పినమాటలకు.. చేతలకు పొంతనలేదని ఈ బడ్జెట్‌తో తేలింది. - రాపోలు ఆనందభాస్కర్, రాజ్యసభ సభ్యుడు బడ్జెట్ ఆశాజనకంగా లేదు... కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పింది. అయితే ఇది దేశాని కి అంత మంచిది కాదు. ముఖ్యంగా రక్షణ రం గంలో కూడా విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడంతో నష్టం వాటిల్లుతుంది. కేంద్రం ఇంతకాలం చెప్పిన దానికి ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణకు కేంద్ర పాలకులు తీరని అన్యాయం చేశారు. రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడితో ఒక రాష్ట్రానికి ఓ న్యాయం.. ఇంకో రాష్ట్రానికి మరో న్యాయం చేయడం మంచిపద్ధతి కాదు. తెలంగాణ రీ ఆర్గనైజేషన్ బిల్లులో పొందుపరిచిన వాటిని కూడా పట్టించుకోకపోవడం బాధాకరం. ముఖ్యంగా ఏపీకి ఏడు ప్రాజెక్టులు, తెలంగాణకు ఒకే ప్రాజెక్టు ఇవ్వడంతో కేంద్ర వైఖరి తెలిసిపోయింది. బీజేపీ, అనుకూల ప్రభుత్వాలున్న రాష్ట్రాల బడ్జెట్‌గా మారింది. ఇదే తీరుగా వ్యవహరిస్తే కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. - కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ ఏ రంగానికి న్యాయం చేయలేదు... ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో అరైవె ఏళ్ల కల నిజమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంతో న్యాయంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నం. అయితే ఎవరి ఒత్తిడి వల్ల జరిగిందో.. ఏమో కానీ గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మాత్రం పూర్తి అన్యాయం జరిగింది. బడ్జెట్లో తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. ఏ రంగానికి కనీస న్యాయం చేయలేదు. కేవలం మొక్కుబడిగా హార్టికల్చర్ యూనివర్సిటీని మాత్రమే ప్రకటించారు. ఇప్పటివరకు గిరిజన విశ్వవిద్యాలయం గురించి ప్రస్తావించకుండా ప్రజలను నిరాశపరిచారు. రీఆర్గనైజేషన్ బిల్లులో పొందుపరిచినా గ్యారంటీ లేదు. భవిష్యత్ పేరుతో అన్యాయం చేస్తున్నారు. పార్లమెంట్లో ఇతరపార్టీల గోడు పట్టించుకునేవారే కరువయ్యారు. అన్యాయం చేస్తే మోడీ సర్కార్‌పై పోరాటం చేస్తాం. - అజ్మీరా సీతారాంనాయక్, మహబూబాబాద్ ఎంపీ పారిశ్రామిక రంగానికి చేయూత... కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పారిశ్రామిక రంగానికి చేయూతనిచ్చే విధంగా ఉంది. అలాగే భారతదేశ ప్రజలను, బయటి దేశాల్లోని ఇన్వెస్టర్లను సైతం కొంత నిరాశ పరిచే విధంగా కూడా ఉంది. నల్లధనం వెలికి తీస్తాం.. అని మొదట్లో చెప్పిన మోడీ ఇప్పుడు బడ్జెట్లో ఆ ప్రస్తావనే తీసుకురాకపోవడం బాధాకరం. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు బడ్జెట్లో స్థానం లేకపోవడంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఈ ఏడాది కూడా అందే పరిస్థితి లేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో పొదుపు పరిమితిని ప్రస్తుతం రూ. లక్ష నుంచి రూ. 1.5 లక్ష వరకు పెంచడంతో దానిపై వడ్డీరేటు 8 శాతం నుం చి 9 శాతం వస్తుంది. -త్రిపురనేని గోపిచంద్, సీఏ ఇన్స్టిట్యూట్ కార్యదర్శి పన్నుల విభాగంలో మార్పులు... ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్.. పన్నుల విభాగంలో పలు మార్పులు తీసుకొచ్చింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ. 2 నుంచి రూ 2.5 లక్షలు పెంచారు. అలాగే 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటీజన్స్‌కు రూ. 2.5 నుంచి రూ.3లక్షలకు పెంచి, సేవింగ్స్ పరిమితి రూ. లక్ష నుంచి రూ. 1.5లక్షలకు పెంచారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు, చిరు వ్యాపారులకు పన్నుల నుంచి ఉపశమనం కలిగింది. కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో సబ్బులు, సౌందర్య సాధనాలు, 19 ఇంచులలోపు ఎల్సీడీ, ఎల్ఈడీ కలర్ టీవీలు, చెప్పులు, సిమెంట్, స్టీల్ ధరలు కాస్త తగ్గుతాయి. -పీవీ నారాయణరావు, సీఏ సిరిసిల్ల టెక్స్‌టైల్స్‌కు అనుమతి రాలేదు... చేనేత వస్త్రాలకు ప్రసిద్ధిగాంచిన సిరిసిల్లలో టెక్స్టైల్స్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడం బాధాకరం. ఆరు టెక్స్టైల్స్ క్లస్టర్లలో కనీసం ఒక్కదానికి అనుమతిచ్చినా నిరుద్యోగ సమస్య కొంతమేరకు తగ్గేది. ఉద్యోగులకు ఐటీ మినహాయింపు రూ. 2.5 లక్షలకు ఇవ్వడం నిరాశజనకం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ. 5లక్షలు ఇస్తే బాగుండే ది. ఏపీ భాగస్వామ్య రాజకీయంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. పేదలను మరిచి విదేశీ, కార్పొరేట్ సంస్థలకు రెడ్‌కార్పెట్ వేసింది. ఓంప్రకాష్లోయ, చార్టర్డ్ అకౌంటెంట్ -ఓం ప్రకాష్లోయ, సీఏ ప్రకటనదారులకు ఖర్చు తగ్గుతుంది... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ లో మీడియా ప్రకటనలపై సర్వీస్ టాక్స్ ఎత్తివేస్తున్నట్లు చెప్పడంతో ప్రకటనదారులకు ఖర్చు తగ్గుతుంది. మన దేశానికి ఇంపోర్ట్ చేసే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో ఇతర దేశాల వస్తువులకు స్వస్తి పలికి స్వదేశీ ప్రొడక్ట్స్ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అంతర్జాతీయ అకౌంటింగ్ ప్రమాణాలను దేశీయ కంపెనీలు తప్పనిసరిగా పాటించాలని నిబంధన పెట్టడం మంచిది. ఇలా చేయడం ద్వారా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్టే. - పిప్పర్తి రాఘవరెడ్డి, సీఏ చంద్రబాబు, వెంకయ్యనాయుడి కుట్ర... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుట్రలో భాగంగానే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. యూపీఏ హయాంలో ఎఫ్‌డీఏలను వ్యతిరేకించినా బీజేపీ.. ప్రస్తుతం రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను ఎలా స్వాగతిస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆంధ్రాకు వరాల జల్లు కురిపించిన కేంద్రం, తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపించింది. కొత్త సీసాలో పాత సార మాదిరిగా కేంద్ర బడ్జెట్ ఉంది. - బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పీసీసీ సెక్రటరీ యూపీఏ విధానాలనే కొనసాగించింది... యూపీఏ ప్రభుత్వం కొనసాగించిన ప్రజా వ్యతిరేక విధానాలనే ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తుందనడానికి గురువారం ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ నిదర్శనంగా నిలిచింది. ఈబడ్జెట్ కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తుందే తప్ప, పేదలకు ఒరిగిందేమీలేదు. ఎన్నికల ముందు మోడీ జపం చేసిన నాయకులు ఈ బడ్జెట్‌తో కళ్లు తెరవాల్సిన అవసరం ఉంది. అధిక ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైన బీజేపీ సర్కార్, పేదలకు అనుకూలమైన బడ్జెట్‌ను తీసుకురాలేకపోయింది. - తక్కళ్లపెల్లి శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి నిరుద్యోగులకు మొండి చేయి... కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి అవకాశాలూ కల్పించలేదు. ఈ ప్రాంత పారిశ్రామికాభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మోడీ బడ్జెట్‌పై నిరుద్యోగులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని మోడీ అమలు చేయలేదు. ఆంధ్రాకు కాకినాడ నుంచి చెన్నయ్‌కు నౌకాయా నం ఏర్పాటు చేయడం ద్వారా అక్కడి నిరుద్యోగులకు ఉపాధి దోరుకుతుంది. తెలంగాణలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా బడ్జెట్లో ఎలాంటి ఊసులేకపోవడం శోచనీయం. - కోమాకుల నాగరాజు, నిరుద్యోగి, వరంగల్