తెలంగాణకు తీరని అన్యాయం | MPs from the central budget, accountants dissatisfaction | Sakshi
Sakshi News home page

తెలంగాణకు తీరని అన్యాయం

Published Fri, Jul 11 2014 3:48 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM

తెలంగాణకు తీరని అన్యాయం - Sakshi

తెలంగాణకు తీరని అన్యాయం

* ప్రజలను నిరాశపరిచిన బడ్జెట్
*  సంపన్నులు, బహుళజాతికి ప్రాధాన్యం
* కేంద్ర బడ్జెట్‌పై ఎంపీలు, చార్టర్‌‌డ అకౌంటెంట్ల అసంతృప్తి
సంపన్నుల, బహుళజాతి బడ్జెట్...
ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలిచ్చిన నరేంద్రమోడీ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. అందరికీ అన్ని ఇస్తామని భ్రమింపజేసిన ఆయన.. చివరికి ఏదీ లేదని నిరూపించారు. పేదల పట్ల వారికున్న వైఖరి, సంక్షేమంపై ఉన్న వ్యతిరేకతను ఈ బడ్జెట్‌లో నిరూపించారు. కేవలం సంపన్నులు, బహుళజాతి సంస్థలకు ఉపకరించే ప్రణాళికలను మాత్రమే బడ్జెట్‌లో ఆవిష్కరించారు. అన్నింటా ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో విదేశీ నిధుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు యత్నిస్తున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలపై విదేశీ పెత్తనం పెరిగే ప్రమాదాన్ని ఈబడ్జెట్ తెలియజేస్తోంది. ఇక కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఇచ్చిన ప్రాజెక్టు ఒక్కటీ లేదు. మోడీ గతంలో చెప్పినమాటలకు.. చేతలకు పొంతనలేదని ఈ బడ్జెట్‌తో తేలింది.
 - రాపోలు ఆనందభాస్కర్, రాజ్యసభ సభ్యుడు
 
బడ్జెట్ ఆశాజనకంగా లేదు...
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పింది. అయితే ఇది దేశాని కి అంత మంచిది కాదు. ముఖ్యంగా రక్షణ రం గంలో కూడా విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడంతో నష్టం వాటిల్లుతుంది. కేంద్రం ఇంతకాలం చెప్పిన దానికి ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణకు కేంద్ర పాలకులు తీరని అన్యాయం చేశారు. రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడితో ఒక రాష్ట్రానికి ఓ న్యాయం.. ఇంకో రాష్ట్రానికి మరో న్యాయం చేయడం మంచిపద్ధతి కాదు. తెలంగాణ రీ ఆర్గనైజేషన్ బిల్లులో పొందుపరిచిన వాటిని కూడా పట్టించుకోకపోవడం బాధాకరం. ముఖ్యంగా ఏపీకి ఏడు ప్రాజెక్టులు, తెలంగాణకు ఒకే ప్రాజెక్టు ఇవ్వడంతో కేంద్ర  వైఖరి తెలిసిపోయింది. బీజేపీ, అనుకూల ప్రభుత్వాలున్న రాష్ట్రాల బడ్జెట్‌గా మారింది. ఇదే తీరుగా వ్యవహరిస్తే కేంద్రంపై ఒత్తిడి తెస్తాం.    - కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ
 
ఏ రంగానికి న్యాయం చేయలేదు...
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో అరైవె  ఏళ్ల కల నిజమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంతో న్యాయంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నం. అయితే ఎవరి ఒత్తిడి వల్ల జరిగిందో.. ఏమో కానీ  గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు మాత్రం పూర్తి అన్యాయం జరిగింది. బడ్జెట్‌లో  తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. ఏ రంగానికి కనీస న్యాయం చేయలేదు. కేవలం మొక్కుబడిగా హార్టికల్చర్ యూనివర్సిటీని మాత్రమే ప్రకటించారు. ఇప్పటివరకు గిరిజన విశ్వవిద్యాలయం గురించి ప్రస్తావించకుండా ప్రజలను నిరాశపరిచారు. రీఆర్గనైజేషన్ బిల్లులో పొందుపరిచినా గ్యారంటీ లేదు. భవిష్యత్ పేరుతో అన్యాయం చేస్తున్నారు. పార్లమెంట్‌లో ఇతరపార్టీల గోడు పట్టించుకునేవారే కరువయ్యారు. అన్యాయం చేస్తే మోడీ సర్కార్‌పై పోరాటం చేస్తాం.
 - అజ్మీరా సీతారాంనాయక్, మహబూబాబాద్ ఎంపీ
 
పారిశ్రామిక రంగానికి చేయూత...
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పారిశ్రామిక రంగానికి చేయూతనిచ్చే విధంగా ఉంది. అలాగే భారతదేశ ప్రజలను, బయటి దేశాల్లోని ఇన్వెస్టర్లను సైతం కొంత నిరాశ పరిచే విధంగా కూడా ఉంది. నల్లధనం వెలికి తీస్తాం.. అని మొదట్లో చెప్పిన మోడీ ఇప్పుడు బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే తీసుకురాకపోవడం బాధాకరం. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు బడ్జెట్‌లో స్థానం లేకపోవడంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఈ ఏడాది కూడా అందే పరిస్థితి లేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో పొదుపు పరిమితిని ప్రస్తుతం రూ. లక్ష నుంచి రూ. 1.5 లక్ష వరకు పెంచడంతో దానిపై వడ్డీరేటు 8 శాతం నుం చి 9 శాతం వస్తుంది.    -త్రిపురనేని గోపిచంద్, సీఏ ఇన్‌స్టిట్యూట్ కార్యదర్శి
 
పన్నుల విభాగంలో మార్పులు...
ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్.. పన్నుల విభాగంలో పలు మార్పులు తీసుకొచ్చింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ. 2 నుంచి రూ 2.5 లక్షలు పెంచారు. అలాగే 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటీజన్స్‌కు రూ. 2.5 నుంచి రూ.3లక్షలకు పెంచి, సేవింగ్స్ పరిమితి రూ. లక్ష నుంచి రూ. 1.5లక్షలకు పెంచారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు, చిరు వ్యాపారులకు పన్నుల నుంచి ఉపశమనం కలిగింది. కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో సబ్బులు, సౌందర్య సాధనాలు, 19 ఇంచులలోపు ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ కలర్ టీవీలు, చెప్పులు, సిమెంట్, స్టీల్ ధరలు కాస్త తగ్గుతాయి.    -పీవీ నారాయణరావు, సీఏ
 
సిరిసిల్ల టెక్స్‌టైల్స్‌కు అనుమతి రాలేదు...
చేనేత వస్త్రాలకు ప్రసిద్ధిగాంచిన సిరిసిల్లలో టెక్స్‌టైల్స్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడం బాధాకరం. ఆరు టెక్స్‌టైల్స్ క్లస్టర్లలో కనీసం ఒక్కదానికి అనుమతిచ్చినా నిరుద్యోగ సమస్య కొంతమేరకు తగ్గేది. ఉద్యోగులకు ఐటీ మినహాయింపు రూ. 2.5 లక్షలకు ఇవ్వడం నిరాశజనకం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ. 5లక్షలు ఇస్తే బాగుండే ది. ఏపీ భాగస్వామ్య రాజకీయంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. పేదలను మరిచి విదేశీ, కార్పొరేట్ సంస్థలకు రెడ్‌కార్పెట్ వేసింది.   ఓంప్రకాష్‌లోయ, చార్టర్డ్ అకౌంటెంట్ -ఓం ప్రకాష్‌లోయ, సీఏ
 
ప్రకటనదారులకు ఖర్చు తగ్గుతుంది...
 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ లో మీడియా ప్రకటనలపై సర్వీస్ టాక్స్ ఎత్తివేస్తున్నట్లు చెప్పడంతో ప్రకటనదారులకు ఖర్చు తగ్గుతుంది. మన దేశానికి ఇంపోర్ట్ చేసే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో ఇతర దేశాల వస్తువులకు స్వస్తి పలికి స్వదేశీ ప్రొడక్ట్స్ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అంతర్జాతీయ అకౌంటింగ్ ప్రమాణాలను దేశీయ కంపెనీలు తప్పనిసరిగా పాటించాలని నిబంధన పెట్టడం మంచిది. ఇలా చేయడం ద్వారా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్టే.  - పిప్పర్తి రాఘవరెడ్డి, సీఏ
 
చంద్రబాబు, వెంకయ్యనాయుడి కుట్ర...
 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుట్రలో భాగంగానే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది. యూపీఏ హయాంలో ఎఫ్‌డీఏలను వ్యతిరేకించినా బీజేపీ.. ప్రస్తుతం రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను ఎలా స్వాగతిస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆంధ్రాకు వరాల జల్లు కురిపించిన కేంద్రం, తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపించింది. కొత్త సీసాలో పాత సార మాదిరిగా కేంద్ర బడ్జెట్ ఉంది. - బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పీసీసీ సెక్రటరీ
 
యూపీఏ విధానాలనే కొనసాగించింది...
యూపీఏ ప్రభుత్వం కొనసాగించిన ప్రజా వ్యతిరేక విధానాలనే ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తుందనడానికి గురువారం ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ నిదర్శనంగా నిలిచింది. ఈబడ్జెట్ కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తుందే తప్ప, పేదలకు ఒరిగిందేమీలేదు. ఎన్నికల ముందు మోడీ జపం చేసిన నాయకులు ఈ బడ్జెట్‌తో కళ్లు తెరవాల్సిన అవసరం ఉంది. అధిక ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైన బీజేపీ సర్కార్, పేదలకు అనుకూలమైన బడ్జెట్‌ను తీసుకురాలేకపోయింది.
 - తక్కళ్లపెల్లి శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి
 
నిరుద్యోగులకు మొండి చేయి...

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి అవకాశాలూ కల్పించలేదు. ఈ ప్రాంత పారిశ్రామికాభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మోడీ బడ్జెట్‌పై నిరుద్యోగులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని మోడీ అమలు చేయలేదు. ఆంధ్రాకు కాకినాడ నుంచి చెన్నయ్‌కు నౌకాయా నం ఏర్పాటు చేయడం ద్వారా అక్కడి నిరుద్యోగులకు ఉపాధి దోరుకుతుంది. తెలంగాణలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా బడ్జెట్‌లో ఎలాంటి ఊసులేకపోవడం శోచనీయం.    - కోమాకుల నాగరాజు, నిరుద్యోగి, వరంగల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement