సిగ్గు లేకుండా.. స్వాగతిస్తారా?
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో వాళ్ల ఆశల మీద నీళ్లు చల్లేలా జైట్లీ ప్రకటన వచ్చిందని, దాన్ని స్వాగతిస్తున్నానని చంద్రబాబు సిగ్గులేకుండా ఎలా చెప్పారో అర్థం కాలేదని వైఎస్ఆర్‌సీపీ మహిళా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాదుకదా, కనీసం ప్రత్యేక ప్యాకేజి కూడా ఇవ్వలేదని.. కాబట్టి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఏమీ రావని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రజటకు కావల్సింది హోదాయేనని, దానిపై ఎంతవరకైనా పోరాడుతామని, అన్ని పార్టీలను కలుపుకొని రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చామని ఆమె చెప్పారు.
హోదా వస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని, దాని కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మరో ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. హోదా వచ్చేవరకు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి వచ్చి పోరాడాలని కోరుతున్నామన్నారు. తనకు ముఖ్యమంత్రి హోదా ఉంది కదాని 5 కోట్ల మంది ఆంధ్రులకు దక్కాల్సిన ప్రత్యేక హోదాను చంద్రబాబు పక్కన పెట్టారని, ఇది చీకటి రోజు కాబట్టే తామంతా నల్ల దుస్తులతో వచ్చామని మరో మహిళా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఓటుకు కోట్లు కేసులో నిండా మునిగిపోయిన బాబు.. దాన్నుంచి బయటపడేందుకే ప్యాకేజి వైపు మొగ్గు చూపుతున్నారని ఆమె విమర్శించారు.