4 ఏళ్లు మౌనం..4రోజులు నాటకం | tdp another game started | Sakshi
Sakshi News home page

4 ఏళ్లు మౌనం..4రోజులు నాటకం

Published Sat, Feb 10 2018 1:20 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

tdp another game started - Sakshi

కేంద్రంలో భాగస్వామిగా ఉండి కేంద్రంపైనే పోరాటమంటూ హంగామా ప్రజల్లో వ్యతిరేకతను చల్లార్చేందుకు, స్వప్రయోజనాల కోసం మాయనాటకాలు  కేంద్ర బడ్జెట్‌ను మంత్రివర్గంలో ఆమోదించి, పార్లమెంటులో పోరాటం! బడ్జెట్‌పై ఇప్పటివరకూ అధికారికంగా నోరుమెదపని చంద్రబాబు

సాక్షి, అమరావతి: పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి, రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరక్షన్‌లో టీడీపీ ఎంపీలు గత వారం రోజులుగా సాగిస్తున్న డ్రామా నేడు పతాకస్థాయికి చేరింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజునుంచీ పార్లమెంటులోనూ, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన బంద్‌లోనూ టీడీపీ అనుసరించిన వైఖరి పట్ల రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజులపాటు పోరాటం చేస్తున్నామంటూ భ్రమ కల్పించడం తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క హామీనైనా సాధించలేకపోవడంపై ధ్వజమెత్తుతున్నారు. దీనికి కారణం రాష్ట్ర ప్రయోజనాలపై ముందుండి పోరాడాల్సిన ప్రభుత్వం, తన రాజకీయ అవసరాలకోసం కేవలం ప్రజల దృష్టిని మరల్చేందుకు, అనుకూల మీడియా సహాయంతో పార్లమెంటు సాక్షిగా ప్రజల కళ్లకు గంతలు కడుతూ సాగిస్తున్న కపట నాటకం శుక్రవారం పార్లమెంటు వాయిదా తర్వాత పతాకస్థాయికి చేరుకుంది.

ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో శుక్రవారం చేసిన ప్రకటనలో సైతం రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత టీడీపీ ఎంపీలు ఆయనతో భేటీ జరిపి, రాష్ట్ర విభజన చట్టంలోని అన్ని అంశాలపై ‘అభయం’ లభించినట్లూ, కేంద్రం దిగివచ్చినట్లూ తమ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడాన్ని చూసి రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. పార్లమెంటులో గట్టిగా తన మిత్రపక్షాన్ని నిలదీయకుండా.. ప్రధాని, ఆర్థికమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో అడ్డుతగలకుండా సహకరిస్తూ.. పార్లమెంటు వెలుపల మాత్రం ఏదో పోరాటం చేస్తున్నామన్న భ్రమ కల్పించడం తప్ప సాధించిందేమీ లేదంటూ విమర్శిస్తున్నారు. ప్రధాని ప్రసంగంలో కానీ, ఆర్థికమంత్రి ప్రసంగంలోకానీ హామీలేమీ పొందకుండా, ప్రధాని విదేశీ పర్యటనకు బయల్దేరిన తర్వాత అన్నింటికీ హామీలు లభించాయని లీకులివ్వడం మోసపూరిత డ్రామాకు పరాకాష్టగా భావిస్తున్నారు. 

బడ్జెట్‌కు ఆమోదం  తెలిపి నిరసనలా?
నిజానికి నాలుగేళ్లుగా టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగానే ఉంది. ఆ పార్టీ ఎంపీలు మంత్రులుగా కొనసాగుతూనే ఉన్నారు. బడ్జెట్‌ను కేబినెట్‌లో ఆమోదించాకే పార్లమెంటులో ప్రవేశపెడతారు. అంటే నాలుగేళ్లుగా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని టీడీపీ కేంద్రమంత్రులకు స్పష్టంగా తెలుసు. అయినా వారు దానిపై ఏనాడూ పెదవి విప్పిన దాఖలాల్లేవు. కేబినెట్‌ సమావేశంలో తమ అసమ్మతిని తెలిపినట్లు వార్తల్లేవు. తాజా బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు దాన్ని కేంద్ర మంత్రివర్గంలో ఆమోదించారు. నిజంగా రాష్ట్ర ప్రయోజనాలే భావించి ఉంటే మంత్రివర్గ సమావేశంలోనే బడ్జెట్‌ను ఎందుకు వ్యతిరేకించలేదనే దానికి టీడీపీ నేతలు సమాధానం చెప్పడంలేదు. ప్రతి చిన్న విషయానికి మీడియా సమావేశం పెట్టి గంటల కొద్దీ మాట్లాడే చంద్రబాబు బడ్జెట్‌పై ఇప్పటివరకూ నేరుగా స్పందించలేదు. నాలుగేళ్లుగా కేంద్రాన్ని ఆకాశానికెత్తేస్తున్న ముఖ్యమంత్రి ఇపుడే ఏదో అన్యాయం జరుగుతున్నట్లు, కేంద్రం సహాయం చేయడం లేదన్నట్లు మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం ఏమీ చేయకపోయినా నాలుగేళ్లుగా ఎందుకు పొగుడుతున్నారు..? రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి కేంద్రానికి ఎందుకు సాగిలబడ్డారు..? అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర అన్యాయానికి గురై రాష్ట్రప్రజలు తీవ్ర అసంతృప్తి జ్వాలల్లో రగిలిపోతుంటే ఇక తమ నాటకాలు సాగేటట్లు లేవని గ్రహించి పార్లమెంటు లోపల, వెలుపల జరుగుతున్న ఆందోళనల్లో టీడీపీ పాలుపంచుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు, ప్రజలు చేస్తున్న ఆందోళనల క్రెడిట్‌ను కూడా టీడీపీకి ఆపాదించేందుకు అనుకూల మీడియా ఆపసోపాలు పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఐదుకోట్ల మంది ఆంధ్రుల ప్రయోజనాలను చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని వారు విమర్శిస్తున్నారు. నాలుగేళ్లుగా కేంద్రంలో భాగస్వాములుగా ఉంటూ, కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే ప్రశంసిస్తూ, కేంద్ర పెద్దల మెప్పు కోసం పాకులాడిన చంద్రబాబు ఉన్నట్టుండి రూటు మార్చేయడం వెనుక రాజకీయ, స్వప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. 

బంద్‌లోనూ గందరగోళం  సృష్టించే యత్నం
బడ్జెట్‌లో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా వామపక్షాలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తే దాన్లోనూ చొరబడి ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నించింది. కేంద్రంలో భాగస్వామిగా ఉండి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే తప్పని విమర్శలు రావడంతో... పార్లమెంటులో ఆందోళన చేస్తున్న తమ ఎంపీలకు మద్దతు పేరుతో ప్రదర్శనలు నిర్వహించి అనుకూల మీడియాలో తనకు అనుకూలంగా ప్రచారాన్ని హోరెత్తించింది. నిజానికి గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి... కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యా యానికి సమాధానం చెప్పాల్సివుంది. నాలు గేళ్లుగా రాష్ట్రానికి ఏం సాధించారో ప్రజలకు వివరించాల్సివుంది. కానీ వాటిపై నోరు మెద పకుండా రాజకీయ అవసరాలే ప్రధానమను కుని పార్లమెంటులో హడావుడి చేసింది. పోరాటమంటూనే ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రసంగాల సమ యంలో మిన్నకుండిపోయారు. సాక్షాత్తూ కేంద్రమంత్రి సుజనా చౌదరి బల్లలు చరిచి ఆమోదం తెలిపారు. పార్లమెంటులో టీడీపీ నాలుగురోజుల పోరాటంలో వారు ఎక్కడా ప్రత్యేక హోదా ప్రస్తావనే చేయకపోవడం ఆ పార్టీ వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది. అందు కే కేంద్రంలో ఉంటూ కేంద్రాన్నే నిలదీస్తు న్నట్లు హంగామా సృష్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియాలో హడావుడి చేయడం, తామేదో చేశామని చెప్పుకోవడాని కి తప్ప ఈ పోరాటం డ్రామా ఎందుకూ పనికి రాలేదని టీడీపీ వర్గాలే మ«థనపడుతున్నాయి. 

పోరాడాల్సింది  మరిచి విమర్శలా? 
ఒకవైపు ప్రజల్ని మభ్యపెట్టేందుకు పార్లమెంటు లోపలా, బయటా నానా హంగామా సృష్టించడంతోపాటు... విభజన సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీపై అడుగడుగునా బురదజల్లే ప్రయత్నం చేయడంపై ఆ పార్టీ వర్గాలు టీడీపీపై మండిపడుతున్నాయి. విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్షంగా తమ పార్టీ నాలుగేళ్లుగా సాగిస్తున్న అలుపెరుగని పోరాటం వల్లే హోదా కాంక్ష ప్రజల్లో సజీవంగా ఉందని చెబుతున్నారు. ప్రత్యేకహోదాకోసం, హామీల అమలుకోసంతమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రం నలుమూలలా నిర్వహించినటువంటి యువ భేరి సదస్సులు, ధర్నాలు, నిరసన దీక్షలు.. ప్రధాని, రాష్ట్రపతి, వివిధ కేంద్రమంత్రులను, వివిధ రాజకీయ పక్షాలను కలిసిన విషయాన్ని వారు ఉదహరిస్తున్నారు. మరోవైపు ముందుండి పోరాడాల్సిన చంద్రబాబు లేని ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదా డిమాండ్‌ను నీరుగార్చడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. వీటినుంచి తప్పించుకోవడానికే టీడీపీ జగన్‌పై కేసులున్నాయంటూ తాజాగా విమర్శించి పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శిస్తున్నారు. ఆ కేసులన్నీ గతంలో కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ పెట్టిన కేసులు కావా? అని ప్రశ్నిస్తున్నారు. బొగ్గు నుంచి ఇసుక వరకు, పంచభూతాలను వదలకుండా రూ.3.75 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డ టీడీపీ ప్రభుత్వం, తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కొత్తగా నాటకాలాడుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఒకరు మండిపడ్డారు. నాలుగేళ్లుగా తాత్కాలిక కట్టడాలు, గ్రాఫిక్స్‌ల పేరుతో కాలం గడిపిన టీడీపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల కోసమే ఇప్పుడు డ్రామాలాడుతోందని  ఆయన ధ్వజమెత్తారు. 

ప్రత్యేక హోదాపై సీఎం రాజీ
ఎన్నికలకు ముందు, అధికార పీఠమెక్కాక ప్రత్యేక హోదా వల్లే ఏపీ అభివృద్ధి సాధ్యమని చెప్పిన చంద్రబాబు... ప్రత్యేక హోదా వచ్చేస్తుందంటూ మొదటి రెండేళ్లూ కాలం గడిపేశారు. ఆ తర్వాత హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చిచెప్పినా రాజీపడిపోయారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలనే ప్రత్యేక సహాయంగా ప్రకటించినా నోరు విప్పలేదు. అర్ధరాత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జైట్లీ ప్రకటనను స్వాగతించారు. దాన్నే ప్రత్యేక ప్యాకేజీగా ప్రజలను నమ్మించేందుకు నానా ప్రయత్నాలు చేశారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తినా ఖాతరు చేయలేదు. హోదా సంజీవిని కాదని, హోదా వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదని సమర్థించుకున్నారు. హోదాలో వచ్చే ప్రయోజనాలకు మించి ప్యాకేజీ ద్వారా ఇస్తామని చెప్పడం వల్లే అందుకు ఒప్పుకున్నానని చెప్పారు. కానీ తాము ప్రచారం చేసినట్లుగా ప్రత్యేక ప్యాకేజీలోని అంశాలను అమలు చేయాలని కూడా అడిగిన దాఖలాలు లేవు. విభజన చట్టంలోని హామీలైన విశాఖలో రైల్వేజోన్, కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ, దుగరాజపట్నం పోర్టు, ఏపీలో 11 కేంద్ర సంస్థల ఏర్పాటు, రాజధాని నిర్మాణానికి నిధులను సాధించలేక చతికిలపడ్డారు.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే నిర్మించి ఇస్తానన్నా పట్టుబట్టి తీసుకుని అంచనా వ్యయం పెంచి ప్రాజెక్టు నిర్మాణాన్ని పడకేయించారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులను కొనసాగిస్తూ రాష్ట్రప్రయోజనాలను గాలికొదిలేశారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి అయితే కేంద్రం ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసిందని, ఇంతకుమించి ఎవరూ ఇవ్వలేరని, అడిగే హక్కు మనకు లేదని ప్రకటించారు. కానీ అసలు ప్రత్యేక ప్యాకేజీ అనేదే లేదన్న విషయం చంద్రబాబుకు తెలుసు... కేంద్రానికీ తెలుసు. అందుకే కేంద్రం నుంచి ఎలాంటి లేఖలు వచ్చినా అందులో ప్రత్యేక ప్యాకేజీ అన్న పదమే కనిపించదు. ప్రత్యేక సాయం అన్న పదమే కనిపిస్తుంది. పార్లమెంటులో అరుణ్‌జైట్లీ ప్రసంగాన్ని జాగ్రత్తగా వింటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయినా ఇన్నాళ్లూ ప్రత్యేక ప్యాకేజీ అంటూ చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులూ ప్రజలను మభ్యపెట్టారు. నాలుగేళ్లుగా ఎక్కడికక్కడ రాజీపడిపోయి ఇప్పుడు ఒక్కసారిగా పార్లమెంటులో పోరాటం డ్రామా నడపడం రాజకీయ వ్యూహమేనని చెబుతున్నారు.

వివిధ సందర్భాల్లో చంద్రబాబు ఏమన్నారంటే..
►10.9.2016: హోదాకు సమానంగా కేంద్రం ఇస్తామంటున్న నిధులు తీసుకోవద్దా? పోలవరం వద్దా? దెబ్బలు తగిలిన చోటే ప్రతిపక్షం కారం చల్లుతోంది. ప్రతిపక్షం చేస్తున్న బంద్‌కు సహకరించవద్దని ప్రజలను కోరుతున్నా.
►11.9.2016: కేంద్రం చెప్పినదానికన్నా అదనంగా ఏం వస్తాయో చెప్పండి. హోదా ఇచ్చినా ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి లేదు. పరిశ్రమలు రావాలంటున్నారు.. వస్తున్న వాటిని వ్యతిరేకిస్తున్నారు.
►20.6.2016: నిధులు వద్దంటే ఎలా? ప్యాకేజీ మించి హోదాతో వచ్చేదేంటి? కేంద్రం నుంచి అన్ని నిధులూ రాబడతా. . 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తా.
►29.10.2016: ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు, పోలవరం ప్రాజెక్టుని సాకారం చేస్తున్నందుకు జైట్లీకి కృతజ్ఞతలు 
►26.1.2017: మనమే ఎక్కువ సాధించాం.. ఏ రాష్ట్రానికైనా ఇంతకన్నా ఎక్కువ వచ్చాయా? ఆధారాలుంటే చెప్పండి. ప్రత్యేక హోదాతో సమానమైనవన్నీ వచ్చాయి.
►16.3.2017: సయోధ్యతోనే సాధ్యమైంది. సంప్రదింపుల ఫలితంగానే ప్రత్యేక సాయానికి కేంద్ర ఆమోదం. రావాల్సినవన్నీ సాధించుకుంటున్నాం.
►17.3.2017: మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు.. ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు. ఈ మేరకు అసెంబ్లీ తీర్మానం చేస్తున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement