ముందుగానే మహాగణపతి నిమజ్జనం
హైదరాబాద్: ఈ ఏడాది సైతం ఖైరతాబాద్ మహాగణపతిని ముందస్తుగా నిమజ్జనం జరిపిస్తామని డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. తెలంగాణలో మొత్తం 94,856 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. హైదరాబాద్‌లో 25,850 విగ్రహాలు ఉన్నాయని, ఇప్పటికి 40 శాతం విగ్రహాల నిమజ్జనాలు జరిగాయని చెప్పారు.
నిమజ్జనం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో 26 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశామని, 11 మంది ఐజీలు, నలుగురు డీఐజీలు, 15 మంది ఎస్పీలు, 122 మంది డీఎస్పీలు, 333 మంది ఇన్స్పెక్టర్లు, 1,187 మంది ఎస్ఐలు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారన్నారు. 18 ప్లటూన్ల కేంద్ర బలగాలు వచ్చాయన్నారు.
మరోవైపు నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రధాన ఊరేగింపు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. నిమజ్జనానికి భక్తులు వచ్చేందుకు ప్రధాన రూట్లలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. ఈ బస్సులకు నిర్ణీత ప్రదేశాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులను నగర శివార్లకు పరిమితం చేస్తారు. ప్రతి అరగంటకు ఒక ఎంఎంటీఎస్ రైలు నడిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు.