
భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం
హైదరాబాద్: ఉపరితల ఆవర్తన ద్రోణి, నైరుతి రుతుపవనాల ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. గురువారం రాత్రి 7 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షాలకు పలు ముఖ్యమైన కూడళ్లలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కొన్ని ప్రధాన జంక్షన్లలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఉప్పల్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, మీయాపూర్, ఖైరతాబాద్, కోఠి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, మాదాపూర్ తదితర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. నేటి ఉదయంతో పాటు రాత్రి పూట కురుస్తున్న ఈ భారీ వర్షాలతో హైదరాబాద్ లోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
రహదారులు పూర్తిగా జలమయవడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉప్పల్ లో గరిష్టంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం నాడు గణేష్ నిమజ్జనం కూడా ఉండటంతో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారయింది. హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతిని ఈసారి ముందుగానే నిమజ్జనం చేయనున్నారు. చివరిరోజు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవాలని భావించిన భక్తులకు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటల లోపు ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేయాలని అధికారులు నిర్ణయించారు. వర్షాల కారణంగా నిమజ్జనం ఏర్పాట్లకు కాస్త అంతరాయం ఏర్పడే అవకాశాలున్నాయి.
భారీ వర్షాల కారణంగా పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో నాలాలు పొంగి పొర్లుతున్నాయన్నారు. నాలాల సమీపంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేటి ఉదయం జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి నగర ప్రజలకు ఆయన సూచించిన విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా మలక్ పేట్ అలీ కేఫ్ బ్రిడ్జి నీట మునిగిపోయింది. దీంతో అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కాప్రా సర్కిల్ తో పాటు నేరెడ్ మెట్, కాప్రా, ఏఎస్ రావు నగర్, సీఐఎల్, కుషాయిగూడ, చర్లపల్లి, హెచ్.బీ.కాలనీ, దమ్మాయిగూడ, నాగారం, కీసరతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి.