Ganesha nimajjanam
-
గణేశ నిమజ్జనాల్లో ఐదుగురు గల్లంతు
వాకాడు/వీరపునాయునిపల్లె: వినాయక ప్రతిమల నిమజ్జన కార్యక్రమంలో ఐదుగురు గల్లంతైన ఘటనలు తిరుపతి, వైఎస్సార్ జిల్లాల్లో సోమవారం జరిగాయి. వీరిలో ముగ్గురు మృత్యువాత పడగా, ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మరో వ్యక్తి ఆచూకీ లభించలేదు. వివరాల్లోకి వెళితే... తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం బీచ్‌కి నాయుడుపేట మారయ్య, కావమ్మ గుడి ప్రాంతానికి చెందిన సుమారు 20 మంది యువకులు వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చారు.తీరంలో స్నానాలు చేస్తున్న క్రమంలో మునిరాజ, ఫయాజ్, శ్రీనివాసులు అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. గమనించిన పోలీసులు శ్రీనివాసులు, ఫయాజ్‌లను ఒడ్డుకు చేర్చారు. శ్రీనివాసులు ప్రాణాలతో బయట పడగా, ఫయాజ్(22) వాకాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మునిరాజ ఆచూకీ తెలియరాలేదు. ఐదు గంటల తర్వాత మృతదేహాల వెలికితీత వైఎస్సార్ జిల్లా వేంపల్లె పట్టణానికి చెందిన పలువురు తమ వినాయకుడి విగ్రహం నిమజ్జనం చేసేందుకు వీరపునాయునిపల్లె మండలంలోని ఎన్.పాలగిరి క్రాస్ వద్ద ఉన్న మొగమూరు వాగు వద్దకు వచ్చారు. వినాయకుడి ప్రతిమను నీటిలోకి వదులుతున్న సమయంలో వంశీ(25), రాజా(40) వాగులో పడిపోయారు. విషయం తెలుసుకొన్న ఎస్ఐ మంజునాథ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వెలికితీసే కార్యక్రమం చేపట్టారు. ఫలితం లేకపోవడంతో పులివెందుల నుంచి ఫైర్ సిబ్బందిని పిలిపించి స్థానికుల సహకారంతో ఐదు గంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికితీశారు. వేర్వేరు ఘటనల్లో మరో ముగ్గురు మృతి వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలంలో ట్రాక్టర్ కింద పడి గౌతమ్(17), అన్నమయ్య జిల్లా పాపేపల్లె పంచాయతీలో ట్రాక్టర్ చెరువులో పడి అప్ఙల్(11), దుద్యాల గ్రామంలో గుండెపోటుతో ఉప్పు సుబ్బరామయ్య (54) మృతి చెందారు. -
ముందుగానే మహాగణపతి నిమజ్జనం
-
ముందుగానే మహాగణపతి నిమజ్జనం
హైదరాబాద్: ఈ ఏడాది సైతం ఖైరతాబాద్ మహాగణపతిని ముందస్తుగా నిమజ్జనం జరిపిస్తామని డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. తెలంగాణలో మొత్తం 94,856 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. హైదరాబాద్‌లో 25,850 విగ్రహాలు ఉన్నాయని, ఇప్పటికి 40 శాతం విగ్రహాల నిమజ్జనాలు జరిగాయని చెప్పారు. నిమజ్జనం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో 26 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశామని, 11 మంది ఐజీలు, నలుగురు డీఐజీలు, 15 మంది ఎస్పీలు, 122 మంది డీఎస్పీలు, 333 మంది ఇన్స్పెక్టర్లు, 1,187 మంది ఎస్ఐలు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారన్నారు. 18 ప్లటూన్ల కేంద్ర బలగాలు వచ్చాయన్నారు. మరోవైపు నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రధాన ఊరేగింపు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. నిమజ్జనానికి భక్తులు వచ్చేందుకు ప్రధాన రూట్లలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. ఈ బస్సులకు నిర్ణీత ప్రదేశాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులను నగర శివార్లకు పరిమితం చేస్తారు. ప్రతి అరగంటకు ఒక ఎంఎంటీఎస్ రైలు నడిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం
హైదరాబాద్: ఉపరితల ఆవర్తన ద్రోణి, నైరుతి రుతుపవనాల ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. గురువారం రాత్రి 7 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షాలకు పలు ముఖ్యమైన కూడళ్లలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కొన్ని ప్రధాన జంక్షన్లలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఉప్పల్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, మీయాపూర్, ఖైరతాబాద్, కోఠి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, మాదాపూర్ తదితర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. నేటి ఉదయంతో పాటు రాత్రి పూట కురుస్తున్న ఈ భారీ వర్షాలతో హైదరాబాద్ లోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు పూర్తిగా జలమయవడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉప్పల్ లో గరిష్టంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం నాడు గణేష్ నిమజ్జనం కూడా ఉండటంతో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారయింది. హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతిని ఈసారి ముందుగానే నిమజ్జనం చేయనున్నారు. చివరిరోజు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవాలని భావించిన భక్తులకు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటల లోపు ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేయాలని అధికారులు నిర్ణయించారు. వర్షాల కారణంగా నిమజ్జనం ఏర్పాట్లకు కాస్త అంతరాయం ఏర్పడే అవకాశాలున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో నాలాలు పొంగి పొర్లుతున్నాయన్నారు. నాలాల సమీపంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేటి ఉదయం జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి నగర ప్రజలకు ఆయన సూచించిన విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా మలక్ పేట్ అలీ కేఫ్ బ్రిడ్జి నీట మునిగిపోయింది. దీంతో అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కాప్రా సర్కిల్ తో పాటు నేరెడ్ మెట్, కాప్రా, ఏఎస్ రావు నగర్, సీఐఎల్, కుషాయిగూడ, చర్లపల్లి, హెచ్.బీ.కాలనీ, దమ్మాయిగూడ, నాగారం, కీసరతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. -
రేపే గణేష్ నిమజ్జనం.. భారీ ఏర్పాట్లు!
-
రేపే గణేష్ నిమజ్జనం.. భారీ ఏర్పాట్లు!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతిని ఈసారి ముందుగానే నిమజ్జనం చేయనున్నారు. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం అర్ధరాత్రి వరకు భక్తులకు దర్శనం కోసం అనుమతినిస్తారు. గురువారం 12గంటల లోపు ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేస్తారు. గతానికి భిన్నంగా ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడిని ముందుగానే నిమజ్జనం చేయనున్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్‌లో 10 క్రేన్లు, అప్పర్ ట్యాంకు బండ్‌పై 24 క్రేన్లను ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం కోసం నగరంలో 12వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిమజ్జనం రూట్లో 2వేలు, సాగర్ చుట్టూ 44 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనానికి 5వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. బంజారాహిల్స్, ఫిలింనగర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ఆయన పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని వినాయక నిమజ్జన ప్రాంతాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పరిశీలించారు. 14వ మైలు వద్ద ఉన్న ఎడమ కాల్వ వద్ద వినాయక నిమజ్జన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. నల్గొండ నుంచి 2500 విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం కోసం వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో నిమజ్జనానికి హాజరయ్యారు. మరోవైపు హైదరాబాద్ బాలాపూర్ వినాయక నిమజ్జనానికి ఉత్సవకమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలాపూర్ లడ్డూ వేలం అనంతరం స్వామివారిని నిమజ్జనానికి తరలిస్తారు. ఈసారి ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం అనంతరం బాలాపూర్ వినాయక శోభాయాత్ర ప్రారంభంకానుంది.