నగరంలోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అశేష జనవాహిని మధ్య మధ్యాహ్నం దాదాపు రెండు గంటల ప్రాంతంలో పూర్తయింది.
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అశేష జనవాహిని మధ్య మధ్యాహ్నం దాదాపు రెండు గంటల ప్రాంతంలో పూర్తయింది. మరోవైపు భక్త జనుల జయజయ ధ్వానాలు.. బ్యాండు మేళాలు.. యువత కోలాహలం మధ్య ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరారు. మంగళవారం మధ్యాహ్నానికే అనంత చతుర్దశి ముగుస్తుందని చెప్పిన అధికారులు గతేడాది తరహాలోనే నిమజ్జనం కార్యక్రమాన్ని సాధ్యమైనంత ముందుగానే ముగించారు.
నేటి ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ చండీకుమార అనంత మహాగణపతి శోభాయాత్ర 12 గంటలకల్లా పూర్తవుతుందని భావించినా అశేష జనవాహిని ట్యాంకు బండ్ కు తరలిరావడంతో కాస్త ఆలస్యమైంది. ఖైరతాబాద్ లోని సెన్సేషన్ థియేటర్, రాజ్ దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, సచివాలయం పాత గేటు, తెలుగుతల్లి చౌరస్తా, లుంబినీ పార్క్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 4 వద్దకు మొత్తంగా 3 కిలోమీటర్ల మేరకు చండీకుమార అనంత మహాగణపతి శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది.
ఉదయం తక్కువ మంది భక్తులు రావడంతో ఉత్సాహంగా ప్రారంభమైన శోభాయాత్ర, క్రమక్రమంగా భక్తులు ట్యాంక్‌బండ్‌కు తరలిరావడంతో నెమ్మదించింది. అయినా ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా అధికారులు మహాగణనాథుని గంగమ్మ ఒడికి చేర్చారు. జిల్లాల నుంచి తరలివస్తున్న గణనాథుల నిమజ్జనం ఇంకా కొనసాగుతోంది.