
ఇల్లాలినే వెలయాలిగా చూపాడు
భార్య ఫొటోలు, ఫోన్ నంబర్‌ను అశ్లీల వెబ్‌సైట్‌లో పెట్టిన శాడిస్టు భర్త
సాక్షి, హైదరాబాద్: ప్రేమించానన్నాడు. పెళ్లికి ముందే సహజీవనం చేశాడు. గర్భం దాల్చిన తర్వాత వదిలించుకునే ప్రయత్నం చేశాడు. అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి చేయడంతో కొన్నా ళ్లు బాగానే ఉన్నాడు. ఇంతలో అతడిలో కట్నపిశాచి మేలుకుంది. ఎలాగైనా భార్యను వదిలించుకోవాలన్న తలంపుతో దుర్మార్గపు ఆలోచనలు చేశాడు. కట్టుకున్న ఆలినే వెలయాలిగా చిత్రించాలని చూశాడు. భార్య ఫొటోలు, ఫోన్ నంబర్‌ను అశ్లీల వెబ్‌సైట్లలో పెట్టాడు! వ్యక్తిత్వంపై బురదజల్లి కోర్టు ద్వారా విడాకులు పొందాలన్న ఆ ఉన్మాదిని.. భార్య ఫిర్యాదుతో పోలీసులు పట్టుకున్నారు. ఆ శాడిస్టు పేరు మురళీకృష్ణ. సొంతూరు నల్లగొండ జిల్లా చౌటుప్పల్ సమీపంలోని మల్కాపురం. ఇతడి కుటుంబం గత కొద్దికాలంగా హైదరాబాద్‌లోని తిరుమలహిల్స్‌లో నివసిస్తోంది. ఎంసీఏ మధ్యలో ఆపేసిన మురళి ఓ మల్టీనేషనల్ కంపెనీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా చేరా డు. ఇతడికి మరదలి వరసయ్యే మలక్‌పేటకు చెందిన బాధితురాలు ఎంసీఏ పూర్తి చేసింది. క్యాంపస్ సెలక్షన్స్‌లో ప్రథమ స్థానం సంపాదించి 2007లో అదే మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా చేరింది. 2008లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
పుణే తీసుకెళ్లి మోసగించి...
మురళీకృష్ణ కుటుంబీకులు డబ్బుకే విలువిస్తారనే ఉద్దేశంతో వివాహానికి యువతి కుటుంబీకులు అంగీకరించలేదు. దీంతో పథకం ప్రకారం తనతోపాటు యువతికి మహారాష్ట్రలోని పుణేకు బదిలీ చేయించుకున్న మురళీకృష్ణ.. అక్కడ ఆమెతో సహజీవనం చేశాడు. ఐదు నెలల గర్భవతిగా ఉండగా నాంపల్లి వరకు తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. దీనిపై పుణేలో వీరు పని చేస్తున్న సంస్థ యాజమాన్యమే మురళీకృష్ణపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తర్వాత యువతి కుటుంబీకులు, పెద్దలు, పోలీసుల సమక్షంలో రాజీ కుదిర్చి రూ.3 లక్షల ఖర్చుతో ఓ గుడిలో ఇద్దరికీ వివాహం చేశారు. ఈ వివాహం ఇష్టం లేని మురళీకృష్ణ కుటుంబీకులు దంపతుల్ని ఇంట్లోకి రానీయలేదు. దీంతో యువతి కుటుం బీకులే మరో రూ.50 వేలు ఇచ్చి ఇద్దరినీ ఉద్యోగాలు చేసుకోమని పుణే పంపారు. ఓ కుమారుడు పుట్టిన తర్వాత మురళీకృష్ణ మళ్లీ భార్యను అక్కడే ఓ హోటల్‌లో వదిలేసి వచ్చేశాడు.
ఇంటర్నెట్‌లో ఫొటోలు పెట్టి..
భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న మురళి.. పెళ్లి సమయంలో తీసిన ఫొటోలను సేకరించాడు. వాటితోపాటు భార్య ఫోన్ నంబర్‌ను ఆరు నెలల క్రితం అశ్లీల, ‘ఎస్కార్ట్స్’ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేశాడు. కొందరి నుంచి ఫోన్లు రావడంతో బాధితురాలు సీసీఎస్ అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విషయం తెలియడంతో దాదాపు ఐదు నెలలుగా మురళీకృష్ణ పరారీలో ఉన్నాడు. పోలీసులు ముమ్మరంగా గాలించి ఎట్టకేలకు మంగళవారం మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లోనూ సోదాలు నిర్వహించి కంప్యూటర్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.
రూ. 20 లక్షలతో వివాహం..
తమ కుమారుడికి ఘనంగా పెళ్లి చేస్తేనే కాపురాన్ని అంగీకరిస్తామని మురళీకృష్ణ కుటుంబీకులు చెప్పడంతో... ఇంటిని అమ్మేసి అమ్మాయి కుటుంబీకులు... 2010లో రూ.20 లక్షలతో పెళ్లి చేశారు. తర్వాత కొన్ని రోజులకు మురళీకృష్ణ మళ్లీ వే ధింపులకు పాల్పడ్డాడు. పుట్టింటికి వచ్చిన భార్య మరో కుమారుడికి జన్మనిచ్చింది. అదనపు కట్నం డిమాండ్ చేయడంతో అమ్మాయి తరఫు వారు మలక్‌పేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో భార్యపై కక్షకట్టిన మురళీకృష్ణ.. ఆమె ప్రవర్తన మంచిది కాదని నిరూపించి కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాలని పథకం వేశాడు.