రెండు నదులు.. ఒక నగరం
► మహానగర దాహార్తిని తీరుస్తున్న కృష్ణా, గోదావరి
► రోజుకు సరఫరా 405 మిలియన్ గ్యాలన్లు
► అడుగంటిన సింగూరు, మంజీరా, జంట జలాశయాలు
‘‘ఒకే రక్తం పంచుకుపుట్టినవాళ్లు అన్నదమ్ములైతే.. ఒకే నది నీళ్లు తాగినవాళ్లం అన్నదమ్ములం, అక్కాచెల్లెళ్లం కాలేమా?..’’ – రుద్రమదేవి సినిమాలోనిది ఈ డైలాగ్
మనం హైదరాబాదీలం మాత్రం రెండు నదుల నీళ్లు తాగుతున్న ఒకే నగరం బిడ్డలం.
హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చే గండిపేట నీళ్లు గత చరిత్రగా మారాయి. సింగూరు జలాలు మెతుకు సీమకే పరిమితమయ్యాయి. ఇప్పుడు మన మహానగరం మొత్తానికి రెండు పెద్ద నదులు దాహార్తిని తీరుస్తున్నాయి.
కృష్ణమ్మ తియ్యగా...
సుమారు 138 కి.మీ. దూరంలో ఉన్న అక్కంపల్లి జలాశయం నుంచి నగరానికి తరలిస్తున్న కృష్ణా జలాలు రుచికి తియ్యగా.. తాకితే తేలికగా ఉంటాయి. కృష్ణా నీళ్లు నగరవాసుల ఆరోగ్యానికి, అందానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమౌతున్నాయన్నది నిపుణుల మాట. ఈ నీటిలో కరిగిన ఘన పదార్థాలు, కాఠిన్యత, గాఢత అధికంగా ఉండదు.
గోదావరి కమ్మగా...
గ్రేటర్‌కు 186 కి.మీ దూరంలో ఉన్న ఎల్లంపల్లి జలాశయం నుంచి నగరానికి తరలించే గోదావరి జలాలది రుచి, నాణ్యత, మన్నిక పరంగా విశిష్ట స్థానం. దేశంలో దక్షిణ గంగానదిగా పేరొందిన గోదారమ్మ జలాలు మహానగరవాసులకు ఇప్పుడు ఆదరువయ్యాయి. ఈ నీటిలో కరిగిన ఘన పదార్థాలు, ఆవశ్యక లవణాలు, పోషకాలు, గాఢత, కాఠిన్యత అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉండటం విశేషం.
గలగలా గోదావరి... బిరబిరా కృష్ణమ్మ మహానగర దాహార్తిని తీరుస్తూ.. సిటిజన్లకు వరదాయినిలుగా మారాయి. సింగూరు, మంజీరా, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాల నుంచి నగరానికి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రస్తుతం ఈ నదులే రాజధాని వాసుల గొంతు తడుపుతున్నాయి. గ్రేటర్‌కు 138 కి.మీ. దూరంలో ఉన్న అక్కంపల్లి (నల్లగొండ జిల్లా) జలాశయం నుంచి నిత్యం మూడు దశల పంపింగ్ ద్వారా 270 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలను రాజధానికి తరలిస్తున్నారు. ఇక గ్రేటర్‌కు 186 కి.మీ. దూరంలో ఉన్న కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి 135 మిలియన్ గ్యాలన్ల గోదావరి జలాలను నగర తాగునీటి అవసరాలకు జలమండలి తరలిస్తోంది. మొత్తంగా మహానగర విస్తీర్ణం 688 చదరపు కిలోమీటర్లు కాగా.. ఇందులో 60 శాతం ప్రాంతాలకు కృష్ణా జలాలు.. మరో 40 శాతం ప్రాంతాలకు గోదావరి జలాలు దాహార్తిని తీరుస్తుండడం విశేషం. – సాక్షి, హైదరాబాద్
గోదావరి జలాల ప్రస్థానం ఇలా...
ఎల్లంపల్లి రిజర్వాయర్ సమీపంలో ఉన్న ఇన్‌టేక్ చానల్ (కాల్వ) నుంచి 53 కి.మీ. దూరంలో ఉన్న బొమ్మకల్‌కు 121 మీటర్ల ఎత్తున లిఫ్టు ద్వారా నీటిని పంపింగ్ చేస్తారు. అక్కడ్నుంచి 48 కి.మీ. దూరంలో ఉన్న మల్లారం నీటిశుద్ధి కేంద్రానికి 133.5 మీటర్ల ఎత్తున ఉన్న లిఫ్టు ద్వారా పంపింగ్ చేస్తారు. అక్కడ గోదావరి రా వాటర్‌ను శుద్ధి చేసి.. అక్కడి నుంచి 27 కి.మీ. దూరంలో ఉన్న కొండపాకకు 141 మీటర్ల ఎత్తున ఉన్న లిఫ్టు ద్వారా తరలిస్తారు. మరోసారి నీటిని శుద్ధి చేసి, అక్కడి నుంచి 58 కి.మీ. దూరంలో ఉన్న ఘన్‌పూర్ రిజర్వాయర్ (గ్రేటర్ శివార్లు)కు 120 మీటర్ల ఎత్తున ఉండే లిఫ్టు ద్వారా పంపింగ్ చేస్తారు. అక్కడ్నుంచి రెండు భారీ రింగ్‌మెయిన్ పైపులైన్ల ద్వారా నగరం నలుమూలలకు గోదావరి జలాలను తరలిస్తారు. ఈ నీటిని లింగంపల్లి, కాప్రా, అల్వాల్, సైనిక్‌పురి, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, పటాన్‌చెరు, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర మున్సిపల్ సర్కిళ్లకు సరఫరా చేస్తారు.
కృష్ణా జలాల ప్రస్థానం ఇలా...
నాగార్జునసాగర్ సమీపంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 34 కి.మీ. దూరంలో ఉన్న కోదండాపూర్‌కు గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలిస్తారు. అక్కడ శుద్ధి చేసి 353 మీటర్ల ఎత్తున్న లిఫ్టు ద్వారా 24 కి.మీ. దూరంలోని నాసర్లపల్లికి పంపింగ్ చేస్తారు. ఇక్కడ నీటిని శుద్ధి చేసి 495 మీటర్ల ఎత్తున లిఫ్టు చేసి 20 కి.మీ. దూరంలో ఉన్న గోడకండ్ల క్లియర్ వాటర్ రిజర్వాయర్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి 618 మీటర్ల ఎత్తున లిప్టు చేసి 31 కి.మీ. దూరంలో ఉన్న గున్‌గల్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. అక్కడినుంచి 29 కి.మీ. దూరంలో ఉన్న సాహెబ్‌నగర్ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తరలిస్తారు. అక్కడి నుంచి రింగ్‌మెయిన్ పైపులైన్ల ద్వారా ప్రశాసన్‌నగర్, సైనిక్‌పురి వరకు భారీ పైపులైన్ల ద్వారా కృష్ణా జలాలను సరఫరా చేస్తారు. కృష్ణా జలాలతో పాతనగరంలోని నాలుగు నియోజకవర్గాలతోపాటు, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, ఉప్పల్, మలక్‌పేట్, మహేశ్వరం, తదితర ప్రాంతాల దాహార్తి తీరుతోంది.
గ్రేటర్ తాగునీటి ముఖచిత్రం...
► జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం: 688 చదరపు కిలోమీటర్లు
► కృష్ణా, గోదావరి జలాలను నగరం నలుమూలలకు
► సరఫరా చేసేందుకు అందుబాటులో ఉన్న పైపులైన్లు: 9500 కి.మీ.(చిన్న, మధ్య, భారీ)
► గ్రేటర్ పరిధిలో మొత్తం నల్లా కనెక్షన్లు: 9.8 లక్షలు
► రోజువారీ సరఫరా చేస్తున్న కృష్ణా, గోదావరి జలాలు: 405 మిలియన్ గ్యాలన్లు (270 కృష్ణా, 135 గోదావరి)
► మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉన్న ప్రాంతం: 80 శాతం
► ప్రతి వ్యక్తికి రోజువారీ సరఫరా చేసే నీటి పరిమాణం: సుమారు 100 లీటర్లు (తలసరి నీటి లభ్యత)