
ట్రాఫిక్ పోలీసుల దసరా ఆఫర్
సాధారణంగా దసరా సీజన్ వచ్చిందంటే వివిధ దుకాణాల వాళ్లు ఆఫర్లు ప్రకటిస్తారు. ఈ-షాపింగ్ సైట్లు కూడా ఇప్పటికే పండగ ఆఫర్లతో ముందుకు వచ్చేశాయి. ఇలాంటి సమయంలో తాము మాత్రం ఎందుకు వెనకబడాలని.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం వాహనచోదకులకు దసరా ఆఫర్ ప్రకటించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి తాము విధించే చలానాల్లో సగం మొత్తం కడితే సరిపోతుందంటూ '50% ఆఫ్' అనే ఆఫర్‌ను ప్రకటించారు.
అయితే ఇందుకు ఓ చిన్న నిబంధన కూడా పెట్టారు. వాహన చోదకులు ముందుగా 'అదాలత్'కు హాజరై.. అక్కడే తమకు ట్రాఫిక్ పోలీసుల నుంచి అందిన చలానాలో సగం కడితే సరిపోతుందన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు గోషామహల్‌లోని పోలీసు స్టేడియంలో నిర్వహించే అదాలత్‌కు చలానాలు తీసుకుని వచ్చి.. ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.