
‘స్మార్ట్ అగ్రికల్చర్’తోనే సంక్షోభానికి తెర
ఐఏఎస్ అధికారి డాక్టర్ రాంపుల్లారెడ్డి సూచన
♦ మార్కెట్ ధరల్లో మార్పులపై ముందస్తు సమాచారం ఉండాలి
♦ సాగును లాభదాయకంగా చేయాలన్న నిపుణులు
♦ అధునిక సాగు పద్ధతులు, ప్రభుత్వ విధానాలపై సమగ్ర చర్చ
♦ వ్యవసాయంపై రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత సంక్షోభం నుంచి వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించాలంటే స్మార్ట్ అగ్రికల్చర్ దిశగా ముందుకెళ్లడమే ఉత్తమమని కర్నూలు వాసి, కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రాంపుల్లారెడ్డి చెప్పారు. సమాచార, సాంకేతిక వ్యవస్థను ఈ రంగ ంలో విరివిగా వినియోగించుకోవడమే స్మార్ట్ అగ్రికల్చర్ విధానమన్నారు. సాగు సమస్యలన్నింటినీ ఒకేసారి పరిష్కరించే మంత్రదండం ప్రభుత్వం వద్ద లేనప్పటికీ, స్మార్ట్ అగ్రికల్చర్‌కు సంబంధించిన టూల్స్‌ను ముందుగా సిద్ధం చేసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఉత్పాదకత , మార్కెట్ ధరల్లో మార్పు లు.. తదితర అంశాలపై ముందస్తు సమాచారాన్ని రైతులకు అందించగలిగితే వ్యవసాయం ప్రతి రైతుకూ లాభదాయకం కానుందని చెప్పారు. ‘రైతాంగ సమస్యలు-వ్యవసాయ స్థిరత్వానికి పరిష్కారాలు’ అంశంపై ఫోరం ఫర్ ఫార్మర్స్ సంస్థ శనివారం సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ఆడిటోరియంలో రౌండ్ టేబుల్ నిర్వహించింది. ఈ సమావేశానికి రాంపుల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
‘వ్యాస్’తో అనిశ్చితులకు చెక్
రైతులు ఎదుర్కొంటున్న నాలుగు రకాల అనిశ్చితులను తొలగించడానికి టెక్నాలజీ సహకారంతో తాను వ్యాస్ (వర్చువల్ అగ్రికల్చర్ సిస్టమ్) అనే కొత్త ఉత్పత్తిని రూపొందించినట్లు రాంపుల్లారెడ్డి తెలిపారు. ముఖ్యంగా వర్షాలు, వడగండ్లు, కరువు పరిస్థితులను అధికారులు, రైతులు ముందుగా అంచనా వేయలేకపోవడం, నష్టపోయిన రైతులకు పరిహారమిచ్చేందుకు అవసరమైన పక్కా సమాచారం (రైతు, భూమి విస్తీర్ణం, వేసిన పంట..తదితర వివరాలు) ప్రభుత్వాల వద్ద లేకపోతుండటం, ఉత్పత్తి పెరిగినా మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులను ముందుగానే పసిగట్టలేకపోవడం, విత్తనాలు, పురుగు మందుల్లో నాణ్యత కొరవడడం వంటి.. అనిశ్చితుల నుంచి వ్యవసాయ రంగాన్ని బయటపడేసేందుకు ఇది ఉపకరిస్తుందన్నారు.
గ్రామాల్లో ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తే వాతావరణ పరిస్థితులపై ఆ ప్రాంత రైతులకు అవగాహన ఉంటుందన్నారు. రైతాంగం మూస పద్ధతుల నుంచి బయటపడి ఆధునిక సాగును అవలంబించాలని సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. ఉత్పాదకతను పెంచడం, రైతులకు లాభసాటి ధర, కమతాల విస్తీర్ణం, శిక్షణ, సామర్థ్య పెంపు తదితరాలు సాగులో ప్రధాన సమస్యలని చెప్పారు. సమావేశంలో వ్యవసాయ వర్సిటీ డెరైక్టర్ ఈఏ సిద్ధిఖీ, పలువురు శాస్త్రవేత్తలు, వ్యవసాయ, ఆర్థిక సంస్థల నిపుణులు పాల్గొన్నారు.
ప్రభుత్వాలు ఆత్మ విమర్శ చేసుకోవాలి
కేవలం వ్యవసాయ ఉత్పత్తిపై మినహా రైతుల లాభదాయకతపై ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదని, తాము అనుసరిస్తున్న సాగు విధానాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. వరి పండించిన రైతులకు 23 శాతం నష్టం వస్తోంటే, వివిధరకాల పన్నుల రూపంలో ప్రభుత్వానికి 19 శాతం లాభం వస్తోందన్నారు. ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ.1,850గా ఉంటే, మద్దతు ధర కేవలం రూ.1,410 మాత్రమే ఉందన్నారు. దీంతో రైతు క్వింటాలుకు రూ.450 నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
మార్కెట్ శక్తులతోనే నిర్వీర్యం
ప్రపంచీకరణ సందర్భంగా సాగు రంగంలోకి కార్పొరేట్ మార్కెట్ శక్తులు ప్రవేశించడంతో ఈ రంగం నిర్వీర్యమైందని వైఎస్సార్‌సీపీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లలో సాగుకు కేటాయింపులు పెంచాలన్నారు. వ్యవసాయ పరిశోధనలు మరింతగా ఊపందుకోవాలని కాంక్షించారు. దేశవ్యాప్తంగా 11 బీమా కంపెనీలు ఉంటే, వీటిలో 2 మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయన్నారు. ప్రైవేటు బీమా సంస్థల ద్వారా రైతులకు ఏమాత్రం న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఫోరం ఫర్ ఫార్మర్స్ వ్యవస్థాపక చైర్మన్ టీజీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయాన్ని తిరిగి ఊరికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.