ఓ ఐఏఎస్.. ఓ నటి.. ఓ గోపాల్ | IAS Rekharani second marriage became a issue | Sakshi
Sakshi News home page

ఓ ఐఏఎస్.. ఓ నటి.. ఓ గోపాల్

Published Wed, May 4 2016 4:24 AM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM

ఓ ఐఏఎస్.. ఓ నటి.. ఓ గోపాల్

ఓ ఐఏఎస్.. ఓ నటి.. ఓ గోపాల్

♦ వివాదాస్పదమైన ఐఏఎస్ అధికారిణి రేఖారాణి రెండో వివాహం
♦ విజయ్‌గోపాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న రేఖారాణి
♦ అతనితో తనకు ముందే పెళ్లయ్యిందన్న సినీ నటి పూజిత
♦ తనకు విడాకులివ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నారని ఆరోపణ
♦ తమకు ప్రాణహాని ఉందని నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు
 
 సాక్షి, హైదరాబాద్: దివంగత ఐపీఎస్ అధికారి పరదేశీనాయుడు సతీమణి, ఐఏఎస్ అధికారిణి రేఖారాణి రెండో వివాహం వివాదాస్పదమైంది. రేఖారాణి వివాహం చేసుకున్న విజయ్‌గోపాల్ అంతకు ముందే తనను పెళ్లిచేసుకున్నాడని.. తమకు పన్నెండేళ్ల కుమారుడున్నాడని.. తనకు విడాకులివ్వకుండానే మళ్లీ పెళ్లి చేసుకున్నాడని సినీ నటి పూజిత మంగళవారం నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. తనకు, తన కుమారునికీ ప్రాణభయం ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్‌గోపాల్ పెళ్లి విషయాన్ని రేఖారాణి తల్లిదండ్రులే తనకు స్వయంగా చెప్పారని పూజిత పేర్కొనడం గమనార్హం.

అయితే న్యాయపరంగా అన్నీ చూసుకున్నాకే విజయ్‌గోపాల్‌ను తాను రెండో వివాహం చేసుకున్నట్లు రేఖారాణి స్పష్టం చేశారు. మరోవైపు నటి పూజితతో తాను సహజీవనమే చేశానని, పెళ్లి చేసుకోలేదని విజయ్‌గోపాల్ అంగీకరించారు. అయితే రేఖారాణితో వివాహం గురించి ‘సాక్షి’ ఆయనను ప్రశ్నించగా స్పందించలేదు. కాగా, పూజిత గతంలో ఇద్ద రు పెళ్లాల ముద్దుల పోలీస్ తదితర సినిమాలతో పాటు రుతురాగాలు వంటి సీరియల్స్‌లోనూ నటించారు. విజయ్‌గోపాల్ గతంలో ఓ పత్రికలో సినిమా రిపోర్టర్‌గా, ఎంపీ వద్ద పీఏగా పనిచేశారు. ఈ సందర్భంగా పూజిత మీడియాతో ఏమన్నారంటే...

 ప్రాణహాని ఉంది...
 ‘‘విజయ్‌గోపాల్ పెద్ద మోసగాడు. అతనిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. విజయ్‌గోపాల్ నా భర్తే అనేందుకు కావాల్సిన అన్ని ఆధారాలను నేను కమిషనర్‌కు అందజేశాను. నాతో పాటు పలువురు అమ్మాయిలను మోసం చేసిన విజయ్‌గోపాల్‌ను తక్షణం అరెస్టు చేయాలి. విజయ్‌గోపాల్ ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని వివాహం చేసుకున్న వ్యవహారంలో పూర్తి ఆధారాలు నా వద్ద ఉన్నాయి. ఈ పెళ్లి వ్యవహారం నేపథ్యంలో నాకు కొంత మంది నుంచి ప్రాణహాని ఉంది. ఐపీఎస్ అధికారిణి అంజనాసిన్హా నుంచి కూడా ప్రాణభయం ఉంది. అందుకే ఆరు రోజులుగా అండర్‌గ్రౌండ్లో ఉన్నాను. ఇప్పుడు బయటకు వచ్చాను. నగరం నడిమధ్యలోనైనా ఈ విషయం తేల్చుకునేందుకు నేను సిద్ధం. రేఖారాణి, విజయ్‌గోపాల్ పెళ్లికి మొదటి సాక్షి అంజనా సిన్హానే. ఆమెను ఈ కేసు విచారణ నుంచి తప్పించాలి. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నాకు సహకరించాలి.

 విజయ్‌గోపాల్‌తో పరిచయం ఇలా..
 ఒక సినిమా షూటింగ్‌లో విజయ్‌గోపాల్ సినిమా రిపోర్టర్‌గా నాకు పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో నన్ను ఫాలోఅప్ చేయడంతోపాటు నా తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి వివాహం చేసుకున్నాడు. వివాహ రిసెప్షన్ కూడా ఆయన ఇంట్లో గ్రాండ్‌గా జరుపుకున్నాం. పెళ్లి అయిన తరవాత ఆయన నిజస్వరూపం నాకు తెలిసింది. నిత్యం గంటలకొద్దీ ఫేస్‌బుక్‌లో గడిపేవాడు. నా వద్ద ఉన్న నగదు, బంగారాన్ని కాజేశాడు. నా సంపాదన అంతా ఆయన చేసిన అప్పులు తీర్చడానికే సరిపోయింది. ఒక రాత్రి చెప్పాపెట్టకుండా ఆయన పారిపోయాడు. ఆయన ఆచూకీ కోసం పలు మార్లు ప్రయత్నించా.. చివరకు ఈ పెళ్లి విషయం రేఖారాణి తల్లిదండ్రులే స్వయంగా నాకు చెప్పారు. నాకు విడాకులివ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం న్యాయపరంగా కరెక్ట్ కాదని, ఈ పెళ్లి ఆపమని వారే నాకు సలహా ఇచ్చారు. ఈ పెళ్లిపై తొలుత సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా వారు స్పందించలేదు.’’
 
 వాళ్లు పదేళ్ల క్రితమే విడిపోయారు: రేఖారాణి
 పెళ్లి వివాదంపై ఐఏఎస్ అధికారిణి, శాప్ ఎండీ రేఖారాణి ‘సాక్షి’తో ఫోన్‌లైన్‌లో మాట్లాడారు. ‘‘విజయ్‌గోపాల్, పూజిత పదేళ్ల క్రితమే విడిపోయారు. వారిద్దరికీ వివాహం జరగలేదు. సహజీవనం మాత్రమే చేశారు. నేను అన్నీ లీగల్‌గా చూసుకునే పెళ్లి చేసుకున్నా. విజయ్‌గోపాల్‌తో రిలేషన్ వద్దని వదిలేసుకుంది. నా తల్లిదండ్రులు ఆమెకు సపోర్ట్ చేయడం నా బ్యాడ్‌లక్. నా వైపు నుంచి పూజితకు ఎలాంటి అపాయం లేదు’’ అని తెలిపారు.
 
 పూజితతో పన్నెండేళ్లు సహజీవనం చేశా: విజయ్‌గోపాల్
 ‘‘పూజితను నేను పెళ్లి చేసుకోలేదు. కానీ పన్నెండేళ్లపాటు ఆమెతో సహజీవనం చేశా. మాకు ఒక కొడుకు ఉన్న మాట వాస్తవమే. కానీ పెళ్లి లాంటిదేమీ జరగలేదు. ఏడేళ్లుగా నాకు పూజితతో కాంటాక్ట్ లేదు. కనీసం ఆమె ఫోన్ నంబర్ కూడా నా వద్ద లేదు. పూజితకు ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించాలి. ఆమె ఉద్దేశం నాకు అర్థం కావడం లేదు. అన్ని విషయాలు కోర్టులో తేలుతాయి. పూజిత వెనక ఎవరో పెద్దల హస్తం ఉంది. కావాలనే ఆమెను రెచ్చగొడుతున్నారు. ఆ విషయాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement