టైటిల్ : ఆకాశ వీధుల్లో
నటీనటులు : గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ, దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ తదితరులు
నిర్మాతలు : మనోజ్ జెడి , డా. డీజే మణికంఠ
దర్శకత్వం: గౌతమ్ కృష్ణ
సంగీతం : జూడా శాండీ
సినిమాటోగ్రఫీ:విశ్వనాధ్ రెడ్డి
విడుదల తేది: సెప్టెంబర్ 2, 2022
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ యంగ్ హీరోలు వారి సినిమా కథలను వారే రాసుకుంటున్నారు. కొంతమంది అయితే నటించడంతో పాటు దర్శకత్వం కూడా చేస్తున్నారు. ఇలా మల్టీ టాలెంట్‌తో ఇండస్గ్రీలో తమ మార్క్‌ను చూపించుకుంటున్నారు. ఇప్పుడు అదే కోవలోకి వచ్చాడు గౌతమ్ కృష్ణ. ‘ఆకాశ వీధుల్లో’సినిమాలో హీరోగా నటిస్తూనే దర్శకత్వ బాధ్యతలను చేపట్టాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 2) థియేటర్స్‌లో విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం
కథేంటంటే..
మధ్య తరగతి కుటుంబానికి చెందిన సిద్దు(గౌతమ్ కృష్ణ)కి మ్యూజిక్ అంటే ప్రాణం. చదువు అంతగా రాదు కానీ..సంగీతంపై మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే సిద్ధు తండ్రి(దేవీ ప్రసాద్)కి మాత్రం అది నచ్చదు. కొడుకు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటాడు. ఇదే విషయం సిద్దుతో చెబితే..తనకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదని, సంగీతం నేర్చుకుంటానని చెబుతాడు.
తండ్రి మందలించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతాడు. ఎప్పటికైనా రాక్ స్టార్ అవుతానని కలలు కంటాడు. మ్యూజిక్ ప్రయత్నాలు చేస్తూనే.. నిషా(పూజితా పొన్నాడ)తో ప్రేమలో పడిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత నిషా తో మనం లివింగ్ లో ఉందామని చెపుతాడు సిద్దు. నిషా మాత్రం తనకు లవ్‌పై నమ్మకం లేదని చెప్పి అతనికి దూరంగా ఉంటుంది.ప్రేమ విఫలం కావడంతో సిద్దు మద్యానికి, డ్రగ్స్‌కి అలవాటు పడతాడు. ఫ్రెండ్స్ చెప్పిన వినకుండా నిత్యం డ్రగ్స్ తీసుకుంటూ సంగీతాన్ని పూర్తిగా పక్కకి పెడతాడు. ఎవరు ఎన్ని చెప్పినా వినని పరిస్థితుల్లో ఉన్న సిద్దు తన గర్ల్ ఫ్రెండ్ నిషా ప్రేమను తిరిగి పొందగలిగాడా లేదా? సామాన్యుడైన సిద్దు చివరకు రాక్‌స్టార్ అయ్యాడా? లేదా? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
లవ్ ఫెయిల్యూర్‌తో హీరో డిప్రెషన్‌లో పడిపోవడం, తర్వాత కెరీర్‌పై దృష్టి పెట్టి విజయం సాధించడం. ఇలాంటి చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి. ఆకాశ వీధుల్లో కూడా ఇదే కోవలోకి వస్తుంది. అయితే కథనం మాత్రం కొత్తగా ఉంటుంది. ప్రస్తుత యంగ్‌స్టర్స్ ఎలా ఉంటున్నారు? వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? మనలో మనకు జరిగే సంఘర్షణ ఎలా ఉంటుంది? కుటుంబ పెద్దల ఆలోచనలు ఎలా ఉంటాయనే అంశాలను తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు గౌతమ్.
ఇందులో ఆయనే హీరో అవ్వడం కలిసొచ్చింది.కొన్ని లవ్ సీన్స్ మరియు ప్రయాణ సన్నివేశాలు కొత్తగా లేకపోయినా, ఆ సన్నివేశాలు మిమ్మల్ని కాసేపు నిమగ్నం చేస్తాయి హీరో పాత్రని ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది. దర్శకుడిగా గౌతమ్‌కి ఇది తొలి సినిమానే అయినా కథనం, సంభాషణలు ఇవన్నీ చక్కగా కుదిరేలా రాసుకున్నాడు.
ఎవరెలా చేశారంటే..
గౌతమ్ కృష్ణకు ఇది మొదటి సినిమా అయినా అది తెరపై కనిపించకుండా..పాత్ర పరిధిమేరకు చక్కగా నటించాడు. అటు రొమాంటిక్ పాత్రలో, ఇటు రాక్ స్టార్ పాత్రలో రెండు షేడ్స్ వున్న పాత్రలలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. నిషా గా పూజిత పొన్నాడ తన లుక్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ లలో యూత్ ను ఆకట్టుకుంటుంది. సిద్దు తండ్రిగా నటించిన దేవి ప్రసాద్.. మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. నిషా తండ్రిగా శ్రీకాంత్ అయ్యంగార్ బాగా యాక్ట్ చేశారు.సిద్దుకు తల్లిగా బాల పరాశర్, చెల్లి గా దివ్య నార్ని తమదైన నటనతో మెప్పించారు.
ఫ్రెండ్స్ పాత్రలో నటించిన ఆనంద్ (రిషి),సత్యం రాజేష్ లు తన నటనతో ఆకట్టుకున్నారు . మీర్జాపూర్ ఫెమ్ హర్షిత గౌర్ స్పెషల్ అప్పిరియన్స్ గా అలరించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. జూడా శాండీ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. సింగర్ కాల భైరవ ఆలపించిన ‘జతగా నువ్వు లేని ఏకాకిగా’ పాట ఆకట్టుకుంటుంది. విశ్వనాధ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. శశాంక్ నాగరాజు ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment