బంగారంపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు
బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: బంగారంపై మోదీ ప్రభుత్వం ఎలాంటి చట్టం తీసుకురాలేదని, మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బంగారానికి సంబంధించి ఎలాంటి సోదాలుండవని, ఈ విషయమై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
శుక్రవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులు ప్రకాశ్‌రెడ్డి, రాములు తో కలసి మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థకు జాడ్యంగా మారిన నల్లధనాన్ని అదుపుచేసేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయంతో అందరికీ మంచి జరుగుతుందని, మహా యజ్ఞంగా మొదలుపెట్టిన నోట్ల రద్దుపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో బీద, ధనిక తారతమ్యాలు తగ్గి సమసమాజ స్థాపనకు అవకాశం ఏర్పడుతుందన్నారు.