నయీం బెడ్ రూంలో సిట్ సోదాలు
హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం కేసు దర్యాప్తుకు నియమించిన సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) రంగంలోకి దిగింది. సిట్ ప్రత్యేక అధికారి నాగిరెడ్డి బుధవారం సాయంత్రం నార్సింగిలోని నయీం ఇంట్లో స్వయంగా సోదాలు చేపట్టారు. నయీం బెడ్ రూమ్, పర్సనల్ రూమ్ లో డి తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భారీగా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే రాజేంద్రనగర్ మండలం నెక్‌నాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అల్కపురి టౌన్‌షిప్‌లో నయిం ఇంట్లో 60కి పైగా ఖరీదైన వాచీలు, డైమండ్ రింగ్స్, ఏకే-47 గన్ ఉన్నట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే నయీం కుటుంబసభ్యులు, అనుచరులలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వనస్థలిపురం ద్వారకామయినగర్లో నయీం అనుచరుడు ఖయ్యూమ్ ఇంటిని బుధవారం పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లోనే మరో ఇద్దరు అనుచరులు నరేష్, సుధాకర్ ఉంటున్నారు. అయితే నయీం ఎన్కౌంటర్ తర్వాత వారు అక్కడి నుంచి పరారయ్యారు.
ఖయ్యూమ్ ఇంట్లో కీలక డాక్యుమెంట్లు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వారిద్దరు రిటైర్డు ఏసీపీ ఇంటి సమీపంలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అలాగే మెదక్ జిల్లా నారాయణఖేడ్లో కూడా పోలీసులు విస్తృత సోదాలు చేపట్టారు. నయీం అనుచరులు ఉన్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. ఓ లాడ్జిలో ముగ్గరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.