సిట్ చీఫ్ నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 కేసులు నమోదు చేసి, 18 మందిని అరెస్టు చేసినట్లు సిట్ చీఫ్ నాగిరెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం డీజీపీ కార్యాలయ ఆవరణలో మాట్లాడుతూ.. నయీమ్ అనుచరులపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చోట్ల నమోదైన 12 కేసులు తమ అధీనంలోకి తీసుకున్నట్లు చెప్పారు. నయీమ్ అనుచరుల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో భారీగా ల్యాండ్ డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ఇప్పటి వరకు రూ.2.61 కోట్ల నగదు, రెండు కిలోల 14 గ్రాముల బంగారం, 599 ల్యాండ్ డాక్యుమెంట్లు లభించినట్లు తెలిపారు. వీటిలో చాలా వరకు నయీమ్ సమీప బంధువుల వద్దే దొరికినట్లు పేర్కొన్నారు. అలాగే 19 ఆయుధాలు లభించాయని వాటిలో ఏకే 47 గన్స్, కంట్రిమేడ్, తపంచాలున్నాయని వివరించారు. ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎలా లభించాయనే దానిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. నగదు, బంగారు ఆభరణాలు కూడా అక్రమంగా, బెదిరించి తీసుకున్నట్లు తెలుస్తోందని, వాటి వివరాలను ఐటీ, డీఆర్‌ఐ, ఈడీ సంస్థలకు సమాచారం అందిస్తామన్నారు.
బాధితులెవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. సిట్ సభ్యులతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యం గా ఉంచుతామని చెప్పారు. ఫిర్యాదులు చేసేందుకు 94406 27218 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. ఇప్పటి వరకు తమ విచారణలో పోలీస్ అధికారులు, రాజకీయ నాయకుల పేర్లు వెల్లడి కాలేదని, భవిష్యత్తులో తెలిస్తే వివరాలు వెల్లడిస్తామన్నారు.
12 కేసులు.. 18 మంది అరెస్టు
Published Fri, Aug 12 2016 2:12 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM
Advertisement
Advertisement