నయీం కేసులో 18మంది అరెస్ట్
హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం కేసులో ఇప్పటివరకూ 18మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ ప్రత్యేక అధికారి నాగిరెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన గురువారం మీడియాకు వెల్లడించారు. సోదాల్లో రాష్ట్రవ్యాప్తంగా 599 ల్యాండ్ డాక్యుమెంట్లు, 19 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు నాగిరెడ్డి తెలిపారు.
2 కిలోల బంగారం, 2.88 కోట్ల నగదు, 6కార్లు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకూ 12 కేసులు నమోదు చేసినట్లు నాగిరెడ్డి తెలిపారు. వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. బాధితులెవరైనా ఉంటే తమను ఆశ్రయించవచ్చని నాగిరెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో నయీంకు గల సంబంధాలపై డీజీపీ ఆదేశిస్తూ విచారణ చేస్తామన్నారు. అలాగే నయీం ఇంట్లో అదుపులోకి తీసుకున్న 9మంది చిన్నారులను బాలసదన్కు తరలించినట్లు నాగిరెడ్డి చెప్పారు.
మహబూబ్నగర్ జిల్లా షాద్ నగర్లో ఎన్కౌంటర్ జరిగిన ఇంటి నుంచి రెండు ఏకే-47 గన్లు, స్టెన్గన్, 4 రివాల్వర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 17 సెల్ఫోన్లు, మారుతీ డిజైర్, హోండా అమేజ్, స్కూటీని సీజ్ చేశారు. రూ.3.74 లక్షల నగదు, ఐదున్నర తులాల బంగారం, వ్యవసాయ భూములకు సంబంధించిన 121 డాక్యుమెంట్లు స్వాధీనపరుచుకున్నారు. అలాగే సంఘటనా స్థలంలో భువనగిరికి చెందిన సలీమాబేగం, మిర్యాలగూడకు చెందిన మతీన్ భార్య ఖలీమ, నయిముద్దీన్ భార్య హసీనాను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు తవ్విన కొద్దీ నయీం ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. నల్లగొండ జిల్లావ్యాప్తంగా నయీం అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నయీం భూదందాలు, సెటిల్మెంట్లపై ఆరా తీస్తున్నారు. భువనగిరి, బొమ్మలరామారంలో వందల ఎకరాలు గుర్తించారు. నయీం ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సిట్ లేఖలు రాసింది. నయీం, అతడి అనుచరుల రియల్ దందాలపై సిట్ చురుగ్గా దర్యాప్తు చేస్తోంది.