'నిల్వ ఉన్న పొగాకును తక్షణమే కొనుగోలు చేయాలి'
హైదరాబాద్: రైతుల వద్ద ఉన్న పొగాకు నిల్వలను తక్షణమే కొనుగోలు చేయాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఇక్కడ వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పొగాకు రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఈ ఏడాదిలోనే నలుగురు పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పొగాకు రైతులు అప్పులబారిన పడకుండా ఆదుకున్నారని గుర్తుచేశారు.
పొగాకు రైతుల సమస్యలపై చాలాసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా.. చోద్యం చూస్తున్నాయి తప్ప సమస్యను పరిష్కరిచండం లేదని దుయ్యబట్టారు. టొబాకో బోర్డు చైర్మన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. రైతుల వద్ద ఉన్న పొగాకు నిల్వలను తక్షణమే కొనుగోలు చేసి.. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారంగా ఇవ్వాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.