ప్రైవేటు పీజీ వైద్య ఫీజుల పెంపు!
వైద్యారోగ్య శాఖ సూత్రప్రాయ నిర్ణయం
- ప్రైవేటు మెడికల్ కాలేజీలతో మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు
- ఫీజులు రెండింతలు చేయాలంటున్న ప్రైవేటు కాలేజీలు
- ఉమ్మడి కౌన్సెలింగ్‌పై న్యాయ సలహాకు సర్కారు యోచన
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వైద్య విద్య కాలేజీల్లో పీజీ వైద్య సీట్ల ఫీజును పెంచాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దాంతోపాటు పీజీ, యూజీ వైద్య సీట్లను ‘నీట్’ ర్యాంకుల ఆధారంగా ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలన్న కేంద్ర నిర్ణయంపై న్యాయ సలహా తీసుకోవాలని యోచిస్తోంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతారని, అనంతరం ఫీజుల పెంపు, ఉమ్మడి కౌన్సెలింగ్‌పై ప్రకటన వెలువడనుందని వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
చర్చల సందర్భంగా ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు మాత్రం ఉమ్మడి కౌన్సెలింగ్ వద్దని కోరాయి. కానీ భారత వైద్య మండలి (ఎంసీఐ) ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించి తీరాలని, అయినా ఈ అంశంపై న్యాయ సలహా తీసుకోవాలని యోచిస్తున్నామని మంత్రి వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక పీజీ వైద్య సీట్ల ఫీజును రెండింతలకుపైగా పెంచాలని యాజమాన్యాలు మంత్రిని కోరగా.. దీనిపై మంత్రి ఎటువంటి హామీ ఇవ్వలేదని, సీఎంతో మాట్లాడాక నిర్ణయిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. నీట్ ర్యాంకుల ఆధారంగా సీట్ల భర్తీ ఉండనున్నందున ఫీజుల పెంపు విషయంలో సర్కారు తమ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని యాజమాన్యాలు కోరినట్లు తెలిసింది.
డొనేషన్లకు చెక్..!
ప్రస్తుతం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా క్లినికల్ సీట్లకు రూ.3.2 లక్షలు, యాజమాన్య కోటాలోని క్లినికల్ సీట్లకు రూ.5.8 లక్షలుగా ఫీజు ఉంది. కానీ యాజమాన్యాలు పీజీ సీట్లకు డొనేషన్ల పేరుతో రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు వసూలు చేస్తున్నాయి. అయితే నీట్ ర్యాంకులతో ఈసారి నుంచి డొనేషన్లకు చెక్ పడనుంది. ఈ నేపథ్యంలోనే యాజమాన్య కోటా సీట్లకు ఫీజులు భారీగా పెంచాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ఇది సున్నితమైన వ్యవహారం కనుక ఆచితూచి అడుగు వేయాలని, విద్యార్థులపై అధిక భారం పడకుండా నిర్ణయం తీసుకోవాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది.
ఉమ్మడి కౌన్సెలింగ్‌కే వెళ్లాలన్న కేంద్రం
ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారానే పీజీ, యూజీ వైద్య సీట్లను భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు తాజాగా మరోసారి రాష్ట్రానికి లేఖ రాసింది. కన్వీనర్, యాజమాన్య కోటా, ఎన్నారై సీట్లన్నింటికీ ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు న్యాయ సలహాకు వెళ్లినా ప్రయోజనం ఉండదన్న చర్చ జరుగుతోంది.