
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని క్రమంగా పెంచుతామని, మొదటి దశలో 500 వాహనాలు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని.. ఆర్టీసీతో పాటు జీహెచ్‌ఎంసీలోనూ వీటి వినియోగం పెంచుతామని చెప్పారు. ప్రైవేటు సంస్థలు కూడా కొనుగోలు చేసేలా అవగాహన కల్పిస్తామన్నారు.
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ఎక్కువ అవకాశం, ఆవశ్యకత ఉందని చెప్పారు. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ ఆటో ఇండస్ట్రీ లిమిటెడ్ ప్రతినిధులు బుధవారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. 100 శాతం బ్యాటరీతో నడిచే వాహనాల తయారీ పరిశ్రమను స్థానిక కంపెనీలతో కలసి హైదరాబాద్‌లో నెలకొల్పనున్నామని, చైనా బయట పరిశ్రమ నెలకొల్పడం ఇదే ప్రథమమని చెప్పారు.
దీనికి సీఎం హర్షం వ్యక్తం చేస్తూ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నగరాలు, పట్టణాల్లో వాహనాల నుంచి వెలువడే కాలుష్యం పెరిగిపోతోందని, దీన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాల వాడకం తప్పనిసరని అన్నారు.
ఎలక్ట్రిక్ బస్సులో సీఎం ప్రయాణం..
బీవైడీ రూపొందించిన ఎలక్ట్రిక్ బస్సు లో ముఖ్యమంత్రి కాసేపు ప్రయాణించి పరిశీలించారు. సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు, కాలుష్య రహిత వాతావరణానికి బస్సు ఎంతో అనువుగా ఉందని అభినందించారు.
ఒక్కసారి చార్జ్ చేస్తే 300–400 కిలోమీటర్ల వరకు నడుస్తుందని.. 3 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుందని, బస్సులతో పాటు కార్లు, ఆటోలు, ట్రక్కులు కూడా తయారు చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు సీఎంకు వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్టీసీ ఎండీ రమణారావు, బీవైడీ జనరల్ మేనేజర్ లియూ జూలింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాంగ్ జీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment